– అత్యాధునిక పరికరాల కొనుగోలుకు కూడా రుణం ఇచ్చే అవకాశం
– కో ఆపరేటివ్ బ్యాంకుల్లో కూడా ముద్ర లోన్ అంటే ఏమిటో తెలియదు
– ఆర్.యస్.యస్‌లో ఒక కొమ్మ సహకార భారతి
– విజయవాడ బీజేపీ ఎమ్మెల్యే, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి
విజయవాడ: పారిశ్రామికవేత్త ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే ఎన్నో లెక్కలు ఉంటాయ ని, రైతులు మాత్రమే ఎటువంటి లెక్కలు వేసుకోకుండా పని చేస్తారని విజయవాడ బీజేపీ ఎమ్మెల్యే, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి అన్నారు.
ఆర్ఎస్‌ఎస్ నేతృత్వంలోని సహకార భారతి ఆధ్వర్యంలో, రాష్ట్ర అభివృద్ధిలో సహకార సొసైటీల భాగస్వామ్యంపై విజయవాడలో సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ… లాభ నష్టాలతో సంబంధం లేకుండా వ్యవసాయం చేస్తారన్నారు. రైతు వారీ పంటలు అమ్ముకునేందుకు నేడు అనేక అవకాశాలు వచ్చాయని తెలిపారు. రుణాలు కూడా అనేక రకాలుగా నేడు బ్యాంకులు ఇస్తున్నాయన్నారు.
రైతు మాత్రం భూమిని తనఖా పెట్టి నేటికీ రుణాలు తీసుకుంటున్నారన్నారు. ప్రతి వంద మంది కో ఆపరేటీవ్‌గా ఏర్పడి విదేశాల్లో మార్కెటింగ్ చేస్తున్నారని, కో ఆపరేటివ్ బ్యాంకుల్లో కూడా ముద్ర లోన్ అంటే ఏమిటో తెలియదన్నారు. వాటిపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి లోన్‌లు ఇచ్చేలా చూడాలని సూచించారు.
వ్యాపారాన్ని బట్టి పది లక్షల నుంచి కోటి రూపాయల వరకు రుణం ఇస్తున్నారన్నారు. రైతులను కూడా ఒక బృందంగా ఏర్పాటు చేసి రుణ సౌకర్యం కల్పించాలన్నారు.
ఆర్.యస్.యస్‌లో ఒక కొమ్మ సహకార భారతి అని అన్నారు. దేశంలో సహకార భారతి గురించి అందరూ తెలుసుకోవాలన్నారు. ఉమ్మడి కుటుంబాలు గతంలో సహకార సొసైటీగా పని చేసేవని, వారి స్పూర్తితోనే సహకార సొసైటీలు వృద్ధి చెందాయన్నారు. పురుగు మందుల వాడకంలో చాలా మార్పు వచ్చిందన్నారు. అనేక అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి వచ్చాయని.. వాటి కొనుగోలుకు కూడా రుణం ఇచ్చే అవకాశం ఉందన్నారు.
గత ఐదేళ్లలో అరాచక పాలన వల్ల అన్ని వ్యవస్థలు నాశనం అయ్యాయని తెలిపారు. అసలు ఎటువంటి అవకాశాలు ఉన్నాయో కూడా తెలియకుండా చేశారన్నారు.
‘‘రైతు లేకుంటే ఈ సమాజం లేదు. మనం లేం’’ అని అన్నారు. అన్నదాత ఆనందం కోసం సహకార సొసైటీలు చేయూతను ఇవ్వాలని కోరారు. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు చాలా ఉన్నాయన్నారు. రైతు కూడా కొంతమందికి ఉపాధి కల్పిస్తారన్నారు. అందరూ రైతుల ఎదుగుదలకు సహకారం అందించాలన్నారు.
కో ఆపరేటివ్ సొసైటీల ముసుగులో మోసం చేస్తే శిక్షలు కూడా కఠినంగా ఉండాలన్నారు. ప్రతి పౌరుడు బాధ్యతగా కో ఆపరేషన్ వ్యవస్థలోకి రావాలని సుజనాచౌదరి అన్నారు.