సిగ్గులేని వైసీపీ నేతలు

– మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మండిపాటు

అమరావతి, మహానాడు: వైసీపీ నేతలు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ని ఎందుకు కలిశారు? చెప్పిన అబద్ధాలే పదేపదే చెప్పడానికి సిగ్గనిపించడం లేదా? అంబేద్కర్ విగ్రహం దగ్గర అంబేద్కర్ పేరు కంటే జగన్ పేరు పెద్దగా ఉండడంతో అంబేద్కర్ వాదులు దాన్ని జీర్ణించుకోలేక జగన్ పేరు తొలగించారు. అంబేద్కర్ విగ్రహంపై చిన్న గీత కూడా పడలేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మండిపడ్డారు.

ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వైసీపీ నేతలు మాత్రం అంబేద్కర్ విగ్రహంపై దాడి జరిగినట్టుగా ఫేక్ ప్రచారం చేస్తున్నారు. వైసీపీ ఫేక్ ప్రచారంతో ఢిల్లీ స్థాయిలో మరోసారి పరువు దిగజార్చుకున్నారు. విదేశీ విద్యకు అంబేద్కర్ పేరు తొలగించి జగన్ తన పేరు పెట్టుకున్నప్పుడు, వైసీపీ ఎమ్మెల్సీ దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంని దారుణంగా హత్య చేసినపుడు వైసీపీ నేతలు ఎస్సీ, ఎస్టీ కమిషన్ ని కలిసి ఉంటే దళిత జాతి హర్షించేది. వైసీపీ నీచ రాజకీయాలను దళిత సమాజం అసహ్యించుకుంటోంది.

వైసీపీ ఐదేళ్ల పాలనలో దళితులకు జరిగిన అన్యాయం ద్రోహం గతంలో ఎన్నడూ జరగలేదు, ఎస్సీ కార్పొరేషన్ ని నిర్వీర్యం చేశారు. సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారు. దళితుల అసైన్డ్ భూములు లాక్కున్నారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాలను నిర్వీర్యం చేశారు. చంద్రబాబు పాలనలోనే దళితుల అభివృద్ధి అని దళిత సమాజం గుర్తించే కూటమికి గొప్ప విజయం అందించారు. వైసిపి ఫేక్ ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. వైసిపి నేతలు ఇకనైనా నీచ రాజకీయాలు మానుకోవాలని మంత్రి హితవు పలికారు.