అన్నా క్యాంటీన్ అసలు అవసరం గ్రామాల్లోనే..

అన్నా క్యాంటీన్ అసలు సిసలు అవసరం ఇప్పుడు గ్రామాల్లోనే ఉంది. దాదాపుగా ప్రతి కుటుంబం నుంచి యువత ఉపాధి రీత్యా వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిన నేపథ్యంలో దాదాపుగా ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబంలో పెద్ద వయసు వారే మిగిలి ఉన్నారు.

గ్రామాల్లో ఒకనాడు పాడి పంటతో ఇంటి నిండా నౌకర్లు జీతగాళ్ళతో కళ కళ లాడిన కుటుంబాలు కూడా నేడు ఒంటరి తనంతో సతమతమవుతూ విలవిల్లాడుతున్నారు. ఎప్పుడయితే వయసు- ఓపిక ఉడిగి వ్యవసాయం నుంచి పక్కకు జరిగారో, ఆటోమేటిక్ గా ఇంటి నిండా నౌకర్లు చాకర్లు కూడా కనుమరుగు అయ్యారు. ఒకనాడు 10 మందికి భోజనాలు పెట్టిన కుటుంబాలు కూడా , నేడు వారికి వండి పెట్టే వారు ఎవరైనా ఉంటే చాలు అనుకునే నిస్సహాయ పరిస్తితి.

గ్రామాల మీద మమకారం..
పిల్లల దగ్గర వుండలేని అశక్తత..
ఒంటరి తనం..
అనారోగ్యంతో సతమతం అవుతున్నారు.
కొందరు భార్య చనిపోయిన వారు..
తీవ్ర అనారోగ్యం, అశక్తతతో వంట కూడా చేసుకోలేని స్థితిలో వున్న వారు ఇప్పుడు గ్రామాల్లో కూడా అందుబాటులో వచ్చిన కర్రీ పాయింట్లు నుంచి కూరలు తెచ్చుకుని అవి ఎలా వున్నా రాజీ పడి బతికేస్తున్నారు.

ఈ సమస్యకు ఎలా అయినా తమకు చేతనైన వరకు ఆయినా పరిష్కారం చూపాలి అని, హైదరాబాద్ కి చెందిన మణికొండ కమ్మ సంఘం వారు గూడూరు సత్యనారాయణ నేతృత్వంలో గ్రామీణ ప్రాంతాలలో కమ్యూనిటీ కిచెన్స్ ఏర్పాటు చేయాలి అని తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఇటువంటి చొరవ వలన కుల, ఆర్థిక, సామాజిక బలం వున్న కొన్ని కులాల వారి సమస్య అడ్రెస్ అవుతుంది కానీ.. ఈ సమస్య నేడు కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా పిల్లలను బెటర్ కెరీర్ బెటర్ prospects కోసం వలస బాట పట్టించిన ప్రతి కుటుంబానిది.
కాబట్టి ప్రభుత్వమే అక్షయ పాత్ర ఫౌండేషన్ వంటి వారి సౌజన్యంతో, గ్రామాలలో వున్న ఈ సమస్యను అడ్రస్ చేయగలిగితే ఈ వృద్ధ తరానికి సరైన న్యాయం చేసినట్టు భావించవచ్చు.

అలాగే వీరికి సక్రమంగా సకాలంలో చేతికి ఇంత భోజనం అందిస్తే చాలు .అంతే తప్ప అన్నా క్యాంటీన్ లో పేదలకు ఇస్తున్నట్టు 5 రూపాయలకు ఇవ్వాల్సిన అవసరం లేదు.. ఎంత ఖర్చు అయితే అంత ఖర్చు చెల్లించి అయినా భోజనం తీసుకుంటారు. గూడూరు సత్యనారాయణ గారు వంటి వారు ప్రయత్నాలు సఫలీకృతం అయితే కొందరికి అయినా ఉపశమనం దక్కుతుంది.

– రాజేష్ అప్పసాని