కన్నయ్యనాయుడుని సన్మానించిన సీఎం చంద్రబాబు

అమరావతి, మహానాడు: ప్రముఖ సాగునీటి రంగ నిపుణుడు, రిటైర్డ్ అధికారి కన్నయ్య నాయుడిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సన్మానించారు. వెలగపూడి సచివాలయంలో కన్నయ్యనాయుడుకి బుధవారం శాలువా కప్పి జ్ఞాపిక అందించి ఘనంగా సత్కరించారు. వరద పోటుతో ఇటీవల తుంగభద్ర జలాశయ 19వ గేటు కొట్టుకపోయింది. విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు సమస్యను పరిష్కరించేందుకు కన్నయ్య నాయుడికి ఫోన్ చేసి అక్కడకు వెళ్లాలని కోరారు. పరిస్థితిని గాడిన పెట్టేందుకు ఎంతో శ్రమించిన కన్నయ్య నాయుడు వరద ప్రవాహం ఉద్ధృతంగా కొనసాగుతున్న సమయంలోనే ఏపీ, కర్నాటక అధికారుల సహకారంతో స్టాప్ లాగ్ గేటు విజయవంతంగా అమర్చారు. దీంతో సుమారు 30 టీఎంసీల నీరు వృథా కాకుండా అడ్డుకోగలిగారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కన్నయ్య నాయుడిని ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడి అభినందించారు. ప్రాజెక్టులో నీరు ఉండగానే స్టాప్ లాక్ గేటు అమర్చి నీరు వృథా కాకుండా రైతాంగానికి ఎంతో మేలు చేశారని ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర రైతాంగం తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు, తదితరులు పాల్గొన్నారు.