– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
మధిర, మహానాడు: రూ. రెండు లక్షల రుణమాఫీపై అవగాహన లేని వారు కూడా అవాకులు చవాకులు పేలుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. ఈ మేరు ఆయన బుధవారం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని జమలాపురం లో మాట్లాడారు.
ఐదు సంవత్సరాల్లో లక్ష రుణమాఫీ చేయలేని వాళ్లు … మొదటి సంవత్సరంలోనే 2 లక్షల రుణమాఫీ చేసిన వారి గురించి సిగ్గు.. ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నారు.. ఈ భాష మాట్లాడడానికి బాధగా ఉంది. రెండు లక్షల పైన బ్యాంకు రుణం తీసుకున్న రైతులు .. పై మొత్తాన్ని చెల్లించి వ్యవసాయ శాఖకు సమాచారం ఇస్తే వెంటనే 2 లక్షల రుణమాఫీ అవుతుంది.
రుణమాఫీ కి సంబంధించి ఈ దేశంలో ఎవరు ఊహించని విధంగా, ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేశాం. అది కూడా అధికారం చేపట్టిన మొదటి సంవత్సరంలోనే పూర్తి చేశాం. జూలై 17న రుణమాఫీ జీవో ఇచ్చి వెంటనే 18వ తేదీన మొదటి విడత లక్ష వరకు రుణం ఉన్నవారి ఖాతాలో డబ్బులు జమచేశాం. రెండో విడత 15 రోజుల వ్యవధిలోనే ఆలస్యం జరగకుండా జూలై 30న అసెంబ్లీలో లక్షన్నర వరకు బ్యాంకు రుణం ఉన్నవారికి వారి ఖాతాల్లో నగదు జమ చేశాం. మూడో విడత ఆగస్టు 15న వైరా బహిరంగ సభలో రెండు లక్షల వరకు బ్యాంకు రుణం ఉన్న రైతుల ఖాతాలోకి నగదు జమ చేశాం.
గత పాలకులు 2014 నుంచి 2018 వరకు లక్ష రుణం ఐదు సంవత్సరాల పాలనా కాలంలో నాలుగు వాయిదాలలో చెల్లించారు. వారు వాయిదాలలో చెల్లించడంతో అది వడ్డీలకే సరిపోయింది.. బ్యాంకర్లు రైతులకు కొత్తగా రుణాలు ఇవ్వలేకపోయారు. రెండో దఫా అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్నికల ముందు అరకొరగా రైతులకు రుణమాఫీ చేశారు.
ఇది ప్రజా ప్రభుత్వం.. మీలాగా మేము దోపిడీలు చేయలేదు. రాష్ట్ర సంపద ప్రతి పైసా పేదవారికి చేరుస్తాం. గత పది సంవత్సరాలు పంటల బీమా కూడా చేయని పాలకులు వీరు. పంట నష్టపోతే ఒక్క రూపాయి కూడా రైతులకు రాలేదు. మేము అధికారంలోకి రాగానే పంటల బీమా కోసం రైతులు కట్టాల్సిన డబ్బులను బీమా కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించింది. త్వరలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్లకు అర్హులను ఖరారు చేసి.. భూమి పూజలు చేయనున్నామన్నారు.