– ప్రకృతి వ్యవసాయ విధానాలతో పర్యావరణానికీ ఎంతో మేలు
– జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయంలో ఆదర్శంగా నిలుస్తున్న చెవుటూరు రైతులు
– జిల్లా కలెక్టర్ డా. జి.సృజన
ఎన్‌టీఆర్ జిల్లా/ జి.కొండూరు: ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో ఆరోగ్యంతో పాటు ఈ వ్యవసాయ విధానంతో పర్యావరణానికీ ఎంతో మేలు జరుగుతుందని.. జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయంలో చెవుటూరు రైతులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన అన్నారు.
బుధవారం కలెక్టర్ సృజన జి.కొండూరు మండలం, చెవుటూరు గ్రామంలో పర్యటించారు. తొలుత గ్రామ పరిధిలోని రైతులు అనుసరిస్తున్న జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పరిశీలించారు. నేలకు బలం.. పంటకు ఆరోగ్యాన్నిచ్చే జీవామృతం తయారీ విధానాన్ని పరిశీలించారు. అదే విధంగా వివిధ రకాల కషాయాల తయారీ, వినియోగించే విధానాల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. కొన్నేళ్లుగా ఈ ప్రాంత రైతులు, కౌలు రైతులు తాము ప్రకృతి సేద్యం ద్వారా పండిస్తున్న పంటలు, దిగుబడి, మార్కెటింగ్ తదితర వివరాలను కలెక్టర్, అధికారులతో పంచుకున్నారు.
జీరో బడ్జెట్ ప్రకృతి సాగుతో తాము ఎంతో లాభపడుతున్నామని.. తోటల్లో, చేల గట్ల మీద వేసే అంతర పంటలతో అదనపు ఆదాయం లభిస్తోందని, తాము ఇళ్లలో ఇవే ఉత్పత్తులను వినియోగిస్తున్నామని తెలిపారు. అసక్తికలిగిన వారికి కూడా ఈ సాగు విధానాలపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. సీతాఫలం, ఉమ్మెత్త, వేప తదితర పది రకాల ఆకులతో తయారుచేసే కషాయం మంచి ఫలితాలు ఇస్తోందని వివరించారు. ప్రకృతి వ్యవసాయ విధానాల ద్వారా 5204 రకం వరి సాగు ద్వారా మంచి రాబడి వస్తోందని ఓ రైతు తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ డా. జి.సృజన మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలో మన రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు ఉందని.. జిల్లాలో పెద్ద ఎత్తున ఈ విధానాలను అమలుచేసేలా రైతులను ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. ఎలాంటి రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకుండా జీవామృతం, వివిధ కషాయాలను ఉపయోగించి చేసే సాగుతో వచ్చే ఉత్పత్తులు ఆరోగ్యానికి ఎంతోమేలు చేస్తాయన్నారు. గత నాలుగైదేళ్లుగా చెవుటూరు రైతులు జీరో బడ్జెట్ ప్రకృతి సేద్యం చేస్తూ, దాంతో ప్రయోజనాలు పొందుతున్నారని, నలుగురికీ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు.
వాణిజ్య పరంగా ఈ విధానం గిట్టుబాటు కాదు అనే అపోహలను వీరు దూరం చేశారన్నారు. ప్రకృతి సేద్యం ఉత్పత్తులను పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, వసతిగృహాల్లో వినియోగించేలా ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. అదే విధంగా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న స్థలాల్లో ప్రకృతి సేద్యంతో కిచెన్ గార్డెన్లను అభివృద్ధి చేసేలా చొరవ తీసుకుంటున్నట్లు వివరించారు. విద్యార్థులకూ ఈ విధానాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సేద్యానికి అవసరమయ్యే కషాయాలు వంటివి తయారుచేసుకోలేని వారికి వీలుగా డీఆర్‌డీఏ, ఔత్సాహిక రైతుల ద్వారా దుకాణాల ద్వారా విక్రయానికి పైలట్ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు కలెక్టర్ సృజన వివరించారు.
అంగన్వాడీ, పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్:
కలెక్టర్ సృజన.. చెవుటూరులోని అంగన్వాడీ ప్రీ ప్రైమరీ, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను తనిఖీ చేశారు. పాఠ్య, సహపాఠ్య కార్యక్రమాల అమలుతీరును పరిశీలించారు. చిన్నారులకు మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా వడ్డించారు. ఆహార నాణ్యతను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలో కిచెన్ గార్డెన్‌ను పరిశీలించి.. ట్రేలో విత్తనాలు చల్లారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సృజన మాట్లాడుతూ విద్యార్థుల సమగ్రాభివృద్ధికి టీచింగ్ ప్లాన్ ప్రకారం బోధన జరిగేలా చూడాలన్నారు. అదే విధంగా కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ పెంచేలా ప్రత్యేక కార్యక్రమాలు అమలుచేయాలని ఆదేశించారు. బడిబయట పిల్లలు ఉండకుండా ప్రత్యేకంగా సర్వే నిర్వహిస్తున్నామని.. 100 శాతం పాఠశాలల్లో నమోదు జరిగేలా చూస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నట్లు వివరించారు. కలెక్టర్ వెంట డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, మండల ప్రత్యేక అధికారి జి.మోహన్‌బాబు, ఎంపీడీవో పి.అనురాధ, తహసీల్దార్ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.