ఇకపై ఇలాంటి పరిస్థితి రానివ్వను

  • ఎమ్మెల్యే పరిటాల సునీత
  • 30లక్షలతో కల్వర్టులు, రోడ్డు నిర్మాణం చేపడుతాం
  • సదాశివకాలనీ వాసులకు పరిటాల సునీత హామీ
  • వరద నీటి ఇబ్బందులను స్వయంగా పరిశీలించిన పరిటాల సునీత
  • 2రోజులుగా పిల్లలు స్కూల్ కి వెళ్లలేదన్న కాలనీ వాసులు

అనంతపురం రూరల్ మండలంలో వరద నీటితో వస్తున్న ఇబ్బందులనుంచి కాలనీల వాసులను కాపాడుకుంటామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత హామీ ఇచ్చారు. అక్కంపల్లి పంచాయతీ సదాశివ కాలనీలోని వంక రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పొంగిపొర్లింది. కాలనీలోకి నీరు రావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అటు వైపు నుంచి ఇటు వైపు రాకపోకలు రెండు రోజులుగా నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న సునీత ఇవాళ పంచాయరాతీ రాజ్ ఇతర విభాగాల అధికారులతో కలసి కాలనీకి వెళ్లారు. వంక నుంచి వస్తున్న నీటిని పరిశీలించారు. స్థానికంగా కాలనీ వాసులు వారు పడుతున్న ఇబ్బందులను వివరించారు. అటు వైపుకు వెళ్లే మార్గం లేక రెండు రోజులుగా పిల్లలు పాఠశాలకు కూడా వెళ్లడం లేదన్నారు. అధికారులతో కలిసి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై చర్చించారు. జిల్లా కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ఈసందర్భంగా సునీత మాట్లాడుతూ కాలనీ వరద నీటికి శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే 30లక్షలు నిధులు తీసుకొచ్చి ఇక్కడ పనులు చేపడుతామన్నారు. అందుకు ప్రణాళికలు తయారు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ముందుగా 20లక్షలతో అధిక ప్రవాహం ఉన్న ఒక కల్వర్టు, 10లక్షలతో రోడ్డు నిర్మాణం చేపడుతామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఈ సమస్య తీవ్రంగా కనిపించినా.. హామీలు తప్ప.. నిధులు ఇవ్వలేదని విమర్శించారు. వచ్చే వర్షాకాలంలోపు ఈ సమస్య లేకుండా చేస్తామని ఈసందర్భంగా సునీత అన్నారు.