ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచడం అలవాటు చేసుకోవాలి

– ఎమ్మెల్యే అరవింద బాబు పిలుపు

నరసరావుపేట, మహానాడు: మొక్కలు పెంచడాన్ని ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా చేసుకున్నపుడు మాత్రమే పర్యావరణం పచ్చగా ఉంటుందని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవింద బాబు అన్నారు. ఈ మేరకు నరసరావుపేటలో నిర్వహించిన వన మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. మొక్కలు నాటి నీరు పోశారు.

మొక్కల పెంపకం కూడా వ్యసనంలా మారే రోజు రావాలని ఆకాంక్షించారు. చెట్లు నరికేయడంపై ఉన్న శ్రద్ధ పెంచడంపై లేకపోవడం బాధాకరం అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచి పర్యావరణాన్ని కాపాడుకోవడంలో భాగస్వాములు కావాలన్నారు. చంద్రబాబు నాయుడు చెట్ల పెంపకానికి ప్రాధాన్యమిచ్చి గతంలో ఉద్యమంలా మొక్కలు నాటితే, జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వెళ్లిన ప్రతి చోటా చెట్లు నరికేసి నియంతలా వ్యవహరించారని మండిపడ్డారు.

ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నవ మోహన్ కృష్ణ, పట్టణ పార్టీ అధ్యక్షుడు కడియాల రమేష్ బాబు, బెల్లంకొండ అనిల్, వడ్లమూడి కిషోర్, రాయల శ్రీనివాసరావు, చింతిరాల బాలు, తదితరులు పాల్గొన్నారు.