ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

– గత ప్రభుత్వంలో వేధింపులను ఏకరువు పెట్టి న్యాయం చేయాలని వినతులు

అమరావతి : మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల నుండి వినతులు స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారినుంచి వినతులు స్వీకరించిన సీఎం.. సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. పలువురు అభాగ్యులకు అభయం ఇవ్వడంతో పాటు ఆర్థికం సాయం కూడా అందించారు. పలువురు వైసీపీ బాధితులు తమ సమస్యలను సీఎం చంద్రబాబు కు తెలిపి సాయం కోరారు.

తమ పొలాన్ని వైసీపీ నేతలు ఆక్రమించుకున్నార‌ని, త‌న‌కు న్యాయం చేయాల‌ని కడప జిల్లా, కొట్టాల గ్రామానికి చెందిన బత్తుల కృష్ణయ్య సీఎంకు ఫిర్యాదు చేశారు. తాను పొలంలోకి అడుగు పెడితే చంపేస్తామ‌ని వైసీపీ నేత‌లు బెదిరిస్తున్నారని, తన పొలం తిరిగి త‌న‌కు వచ్చేలా చేయాలని కృష్ణయ్య కోరారు. త‌న‌కున్న రెండు సెంట్లు స్థ‌లాన్ని వైసీపీ అండ‌తో కొంత‌మంది ఆక్ర‌మించుకున్నార‌ని కాకినాడ రూరల్ మండలం, కరపకు చెందిన దారపు మణికుమారి అనే మహిళ సీఎంకు ఫిర్యాదు చేశారు.

రాష్ట్రంలో ప్రత్యక్షంగా 10,500 మంది, పరోక్షంగా 5,000 కుటుంబాలకు ఉపాధి కలిగించే మీ సేవా కేంద్రాలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మీ – సేవా ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోషియేషన్ సభ్యులు సీఎంకు వివరించారు. మీ సేవా కేంద్రాలకు మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలని సీఎంను కోరారు. గొల్లపూడికి చెందిన కొల్లా వెంకట్ అనే వ్యక్తి అన్న క్యాంటీన్ కు రూ.1 లక్ష విరాళంగా ఇవ్వగా ముఖ్య‌మంత్రి ఆయనను అభినందించారు.