జానపద కళల పరిరక్షణకు కృషి

-కవులు, కళాకారులకు సముచిత స్థానం
-ప‌ర్యాట‌కంలో తెలంగాణ సంస్కృతి, క‌ళారూపాల -ప్ర‌ద‌ర్శ‌న‌ల‌కు ప్ర‌ణాళిక‌లు: మంత్రి జూప‌ల్లి

హైద‌రాబాద్, ఆగ‌స్టు 31: తెలంగాణలో అంతరించిపోతున్న జాన‌ప‌ద‌ కళారూపాలకు మళ్లీ పునరుత్తేజాన్ని తీసుకువ‌చ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార‌ధ్యంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌ని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ఱారావు అన్నారు. కళారంగానికి పెద్దపీట వేస్తుంద‌ని, కవులు, కళాకారులు, ర‌చయిత‌ల‌కు సముచితస్థానం కల్పిస్తుంద‌ని తెలిపారు.

తెలంగాణ ప్ర‌భుత్వం భాషా సంస్కృతిక శాఖ – సారిప‌ల్లి కొండ‌ల రావు ఫౌండేష‌న్ – యువ‌క‌ళావాహిని- తెలంగాణ రాష్ట్ర జాన‌ప‌ద క‌ళాకారుల సంఘం ఆద్వ‌ర్యంలో ర‌వీంద్ర‌భార‌తిలో నిర్వ‌హించిన‌ ప్ర‌పంచ జాన‌ప‌ద దినోత్స‌వ వేడుక‌ల‌కు మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ముఖ్యఅతిధిగా హాజ‌ర‌య్యారు. జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసి కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టీవీలు, కంప్యూటర్లు, సెల్‌ఫోన్ల లాంటి ప్రసార మాధ్యమాలు రాకముందు కథలు, నాటికలు వేసే జాన‌ప‌ద కళాకారులకు ప్రత్యేక గుర్తింపు ఉండేదని, దీంతో కష్టానికి తగ్గ ఫలితం పొందేవారన్నారు. కానీ ప్రస్తుతం అరచేతిలో ప్రపంచాన్ని చూసే రోజులొచ్చాక కళాకారుల పరిస్థితి దయనీయంగా మారిపోయిందని, దీంతో కళాకారుల వద్ద ఉన్న ప్రతిభను మాటల్లో చెప్పుకోవడానికి తప్ప ప్రదర్శిస్తే చూసేవారు కరువయ్యారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మారుతున్న కాలంలో యువ‌త వ్యాప‌కాలు మారిపోయాయ‌ని, చెడు వ్య‌స‌నాల‌కు బానిస‌లై బంగారు భ‌విష్య‌త్ ను నాశ‌నం చేసుకుంటున్నార‌ని,యువ‌త‌లో మార్పు తీసుకువ‌చ్చేందుకు క‌వులు, క‌ళాకారులు, ర‌చ‌యిత‌లు బాధ్య‌త తీసుకోవాల‌ని కోరారు.

ఒక దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే, ప్రాచీన వారసత్వాన్ని భావితరాలకు అందించే కళల‌ను, కళాకారుల‌ను కాపాడుకోవాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంతో పాటు స‌మాజంపై ఉంద‌ని తెలిపారు. కళలను నమ్ముకొని జీవించే కళాకారులను ప్రోత్స‌హిస్తూ.. వారికి అండ‌గా నిల‌వాల్సిన‌ అవసరం ఉంద‌ని చెప్పారు.

ప‌ర్యాట‌క రంగంలో జాన‌ప‌ద క‌ళాకారుల సేవ‌ల‌ను ఉపయోగించుకునేందుకు ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నామ‌ని పేర్కొన్నారు. దేశ‌, విదేశాల‌ నుంచి వ‌చ్చే ప‌ర్యాట‌కుల‌కు తెలంగాణ సంస్కృతి, సంప్ర‌దాయాలు, తెలంగాణ క‌ళారూపాలను తెలియ‌జేసేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని వివ‌రించారు.

ఈ కార్య‌క్ర‌మంలో సంగీత నాట‌క అకాడ‌మీ చైర్ ప‌ర్స‌న్ డాక్ట‌ర్ అలేఖ్య పుంజల, ప‌ద్మ‌శ్రీ పుర‌స్కార గ్ర‌హీత‌లు కెతావ‌త్ సోమ‌లాల్, గ‌డ్డం స‌మ్మ‌య్య, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి, జాన‌ప‌ద క‌ళాకారుల సంఘం గౌర‌వాధ్యక్షులు కె.వి.ర‌మ‌ణాచారి, పారిశ్రామిక‌వేత్త సారిప‌ల్లి కొండ‌ల రావు, యువ‌క‌ళావాహ‌ని అధ్య‌క్షులు లంకా ల‌క్ష్మినారాయ‌ణ‌, అమిగోస్ ఐఏఎస్ కోచింగ్ సెంట‌ర్ నిర్వ‌హ‌కులు ర‌మ‌ణ‌రెడ్డి, భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్ట‌ర్ మామిడి హ‌రికృష్ణ, జాన‌ప‌ద క‌ళాకారుల సంఘం అధ్య‌క్షులు శ్రీనివాస్ గౌడ్, లింగ‌య్య‌, , త‌దిత‌రులు పాల్గొన్నారు.