భారీ వర్షాలు… యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

– ఓర్వకల్లు పర్యటన రద్దు
– సీఎస్, డీజీపీ, మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు సహా ఆయా శాఖల అధికారులతో సీఎం టెలీకాన్ఫరెన్స్
– కొండచరియల బాధిత కుటుంబాలు ఆదుకుంటాం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

అమరావతి, మహానాడు: వాయుగుండంతో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఓర్వకల్లు పర్యటన రద్దు చేసుకుని శనివారం సీఎస్, డీజీపీ, మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలు సహా ఆయా శాఖల అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలు, వరదల సమయంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయి అప్రమత్తతో ఉంటే ప్రజల ఇబ్బందులను తగ్గించవచ్చు. ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ శాఖ సమన్వయంతో చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలి. పట్టణ ప్రాంతాల్లో రోడ్లపై భారీ స్థాయిలో నీరు చేరి ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగుతోంది. వీటిపై దృష్టిపెట్టాలి. పరిస్థితికి అనుగుణంగా ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టి ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలి.

వర్షాలు, వరదల కారణంగా మంచినీరు, ఆహారం కలుషితం అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. అల్లూరి జిల్లాలో కలుషిత ఆహారం ఘటన జరిగింది. వీటిపై అధికారులు సీరియస్ గా దృష్టిపెట్టాలి. బాధితులకు మెరుగైన వైద్యసాయం అందించాలి. కలుషిత ఆహారం ఘటనలకు గల కారణాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. సీజనల్ వ్యాధుల తీవ్రత దృష్ట్యా మరింత సమర్థవంతంగా పనిచేయాలని వైద్య శాఖ అధికారులకు ఆదేశం. ముఖ్యంగా ఏజెన్సీలలో జ్వరాలు బారిన పడిన గిరిజనులకు వైద్యం అందేలా చూడాలి. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కాలువలు, వాగులు దాటేందుకు ప్రజలను అనుమతించవద్దు. ఈ విషయంలో కఠినం గా ఉండాలి. వాట్సాప్ గ్రూప్ ల ద్వారా వివిధ శాఖల అధికారులు నిత్యం సంప్రదింపులు జరుపుకొని సమన్వయంతో పనిచేయాలి. తద్వారా ప్రజలకు సత్వర సాయం అందుతుంది. క్రైసిస్ మేనేజ్మెంట్ విషయంలో డ్రోన్లు వంటి టెక్నాలజీని విరివిగా వాడండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు వర్షాలపై సమాచారం ఇవ్వాలి.

భారీ వర్షాలు, వరదలపై ఆయా ప్రాంతాల ప్రజల ఫోన్లకు అలెర్ట్ మెసేజ్ లు పంపాలి. విపత్తు వచ్చినప్పుడు ప్రభుత్వం తమకు ఆదుకుంటుంది అనే నమ్మకం వారికి కల్పించేలా అధికారుల, ప్రజా ప్రజాప్రతినిధుల స్పందన ఉండాలి. ఇరిగేషన్ ప్రాజెక్టులలో నీటి నిల్వలను నిరంతరం మానిటర్ చేయాలి.

సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణకు అవసరమైన నిధులు విడుదలకు ఆదేశాలు ఇచ్చాను. ప్రాజెక్టుల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తాం.. అధికారులు బాధ్యతగా ఉండాలి. పింఛన్ల పంపిణీ విషయంలో సచివాలయ ఉద్యోగులకు వెసులుబాటు ఇచ్చాం. రేపు సెలవు కాబట్టి ముందు రోజే పింఛన్లు ఇవ్వాలని చూశాం. అయితే, భారీ వర్షాల కారణంగా పింఛన్ల పంపిణీకి సమయం పెంచాం. వచ్చే రెండు మూడు రోజుల్లో సచివాలయ ఉద్యోగులు పింఛన్ల పంపిణీ పూర్తి చేయవచ్చు. వర్షాలు లేని ప్రాంతాల్లో యథావిధిగా పింఛన్ల పంపిణీ కొనసాగుతుంది. విజయవాడలో కొండచరియలు విరిగి ఇంటిపై పడిన ఘటనపై సీఎం విచారం వ్యక్తం చేశారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రకటించారు.