జగన్‌ బాటలో చంద్రబాబు!

– ఏపీసీసీ చీఫ్‌ షర్మిల విమర్శ

విజయవాడ, మహానాడు: వైద్య, విద్యా సంస్థలకు ఎన్టీఆర్‌ పేరు తొలగించి మాజీ సీఎం జగన్ ఆనాడు పెద్ద తప్పు చేస్తే… ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఏపీసీసీ చీఫ్‌ షర్మిల విమర్శించారు. ఇంకా ఆమె ఏమన్నారంటే.. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలకు, ఆసుపత్రులకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ పేరు తొలగించడాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతీకార చర్యగా భావిస్తోంది. ఎన్టీఆర్‌ అయినా, వైఎస్‌ఆర్‌ అయినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పాటుపడిన వాళ్ళే.. పాలనలో తమదైన ముద్ర వేసిన వాళ్ళే.. రాజకీయాలకు అతీతంగా ఇద్దరిని చూడాలి తప్పితే.. నీచ రాజకీయాలు ఆపాదించడం సమంజసం కాదు. వైఎస్‌ఆర్‌ అమలు చేసిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీ యింబర్స్‌మెంట్‌, రుణమాఫీ, ఉచిత కరెంట్,పెన్షన్లు, ఇలా ప్రతి పథకం దేశానికే ఆదర్శం. వైఎస్‌ఆర్‌ ఏదో ఒక్క పార్టీకి సొంతం కాదు.. తెలుగు వారి ఆస్తి. తెలుగు వారి గుండెల్లో ఆయన స్థానం ఈనాటికీ పదిలం. వైసీపీ మీద ఉన్న కోపాన్ని వైఎస్‌ఆర్‌ మీద రుద్దడం సరికాదు. వైసీపీలో వైఎస్‌ఆర్‌ లేరు.. అది ఎన్నటికైనా వైవీ, సజ్జల, సాయి రెడ్డి పార్టీనే.