కొండ ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలి

– శాసనసభ్యులు గద్దె రామమోహన్

విజయవాడ: విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా కొండ చరియలు విరిగిపడుతున్న నేపథ్యంలో కొండ ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని శాసనసభ్యులు గద్దె రామమోహన్ కోరారు. శనివారం ఉదయం క్రీస్తురాజపురం సున్నపు బట్టీల సెంటర్ ఏరియాలో కొండ చరియలు పడిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గద్దె రామమోహన్ హుటాహుటిన అక్కడకు చేరుకుని అధికారులతో మాట్లాడి సహయక చర్యలు చేపట్టారు.

ఈ సందర్భంగా శాసనసభ్యులు గద్దె రామమోహన్ మాట్లాడుతూ గత 40 సంవత్సరాలలో ఇటువంటి వర్షాలు ఎప్పుడూ పడలేదన్నారు. నిత్యం కరుస్తున్న వర్షాల కారణంగా కొండ చరియలు విరిగి పడి నలుగురు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని గద్దె రామమోహన్ విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రాంతాల్లో గతంలో అనేక సార్లు చిన్న చిన్న కొండ రాళ్ళు పడిన సందర్భాలు ఉన్నాయి గాని ఇంత పెద్ద కొండచరియ పడి ఈ స్థాయిలో ప్రమాదం జరగడం ఇదే మొదటి సారి అన్నారు.

ఈ సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి తగు సూచనలు చేస్తున్నారని, అలాగే తనతో మాట్లాడి సహాయక కార్యక్రమాలపై వివరాలు అడిగి తెలుసుకుంటున్నారన్నారు. రెస్క్యూ టీమ్ వచ్చి రాళ్ళను తొలగించి కొందరి ప్రాణాలు కాపాడడం జరిగిందన్నారు. గతంలో కూడా తాను ఈ ప్రాంతంలోని వారికి అనేక మార్లు మీరు ప్రమాద ప్రాంతంలో ఉంటున్నారని ఖాళీ చేయాలని విన్నవించడం జరిగిందన్నారు. అయినా కూడా ఎప్పటికప్పుడు కొత్తవారు రావడం జరిగిందన్నారు.

ఇంకా కూడా కొంత మంది తాము ఎంతోకాలం నుంచి ఉంటున్నామని, ఏమి జరగదనే దైర్యంతో ఉంటున్నారని, ఇప్పటికైనా ప్రమాదకరంగా ఉన్న ప్రాంతాల్లోని వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలని కోరారు. వారు వెళ్ళని సందర్భంగా ప్రమాదాలను నివారించేందుకు బలవంతంగా అయినా వారిని ఖాళీ చేసి ఎటువంటి ప్రాణనష్టం కలగకుండా చూస్తామన్నారు. గద్దె రామమోహన్ తో పాటు డివిజన్ తెదేపా అధ్యక్షులు నందిపాటి దేవానంద్, షేక్.షరీప్, కోడూరు సుబ్రమణ్యం, పటమట సతీష్చంద్ర, దోమకొండ రవి, పెనుగొండ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.