కొన్ని ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ అయ్యే ప్రమాదం

-లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యే అవకాశం
-కొన్ని చోట్ల చెరువులకు స్థానికులు గండ్లు పెట్టే అవకాశం
-ప్రాణ, ఆస్తి నష్టం కలుగ కుండా జాగ్రత్తలు
-రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి

హైదరాబాద్, ఆగస్టు 31 : రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించినందున ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం కలుగ కుండా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నేడు జిల్లా కలెక్టర్లతో సి.ఎస్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. డీజీపీ డా. జితేందర్, మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, పంచాయితీ రాజ్ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, ఫైర్ సర్వీసుల శాఖ డీజీ నాగిరెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాటా, మున్సిపల్ పరిపాలన విభాగం సంచాలకులు గౌతమ్ లు కూడా ఈ టెలీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

ఈ సందర్బంగా సి.ఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, తెలంగాణా తో పాటు రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలోను భారీ వర్షాలు కురుస్తున్నాయని, ఏ విధమైన ఆకస్మిక విపత్తు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ అయ్యే అవకాశం కూడా ఉందని హెచ్చరించారు. ప్రతీ జిల్లా కలెక్టర్ కార్యాలయం తోపాటు జీహెచ్ఎంసీ, రాష్ట్ర సచివాలయంలోనూ కంట్రోల్ రూమ్ లను తెరవాలని తెలిపారు.

లోతట్టు, వరద ప్రాంతాల నుండి ప్రజలు వెళ్లకుండా తగు నిఘా పెట్టాలని అన్నారు. ముఖ్యంగా ఉదృతంగా పారే వాగుల వద్ద ఒక అధికారిని ప్రత్యేకంగా నియమించి పర్యవేక్షించాలని చెప్పారు. వర్షాల దృష్ట్యా జిల్లాల్లో పాఠశాలలకు సెలవు దినంగా ప్రకటించుకునే నిర్ణయం జిల్లా కలెక్టర్లు తీసుకోవాలని సి.ఎస్ స్పష్టం చేశారు. వరద ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాలనుండి ప్రజలను తరలించి పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసే విషయంలో ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు.

భారీ వర్షాలు, వరదల వల్ల తీసుకునే జాగ్రత్తలపై ప్రజలను ఎప్పటికప్పుడు ప్రసార మాధ్యమాల ద్వారా చైతన్య పరచాలని అన్నారు. గ్రామాలు, పట్టణాలలోని మంచి నీటి వనరులైన ట్యాంకులు కలుషితం కాకుండా తగు చర్యలు తీసుకోవడంతోపాటు, అంటూ వ్యాధులు ప్రబల కుండా బ్లీచింగ్ పౌడర్, క్లోరినేషన్ లను చేపట్టాలని తెలిపారు. వైద్య బృందాలను అప్రమత్తం చేశామని, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో తగు మందులను సిద్ధంగా ఉంచామని సి.ఎస్ శాంతి కుమారి తెలిపారు.

ప్రస్తుతం NDRF బృందాలు హైదరాబాద్, విజయవాడ లలో ఉన్నాయని, ఏవిధమైన అవసరం ఉన్నా ముందస్తు సమాచారం ఇస్తే ఈ NDRF బృదాలను పంపించగలమని తెలియచేసారు. గోదావరి, కృష్ణా నదుల పరివాహక ప్రాంతాల్లోని జిల్లాల కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భారీ వరదలు, వర్షాల వల్ల కొన్ని చోట్ల చెరువులకు స్థానికులు గండ్లు పెట్టే అవకాశం ఉందని, దీనివల్ల లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.

ఈ విధమైన చర్యలను పాల్పడకుండా నీటిపారుదల శాఖ అధికారులచే పర్యవేక్షించాలని సూచించారు. జిల్లాలో పోలీస్, నీటిపారుదల శాఖ, విపత్తుల నిర్వహణ శాఖ, పంచాయితీ రాజ్ తదితర శాఖలతో కలసి సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్లను ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ లో మాన్సూన్ ఎమర్జెన్సీ బృందాలను అప్రమత్తం చేయడంతో పాటు, మాన్ హోల్ లను తెరవకుండా నిఘా ఉంచాలని ఆదేశించారు.

డీజీపీ జితేందర్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని పోలీస్ కమిషనర్ కార్యాలయాలు, ఎస్.పీ లను అప్రమత్తం చేశామని తెలిపారు. ప్రధానంగా జిల్లా కలెక్టర్ల తో సమన్వయంతో పనిచేయాలని, అన్ని కమిషనరేట్, ఎస్.పీ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలని ఆదేశించినట్టు వెల్లడించారు.