స్మగ్లర్ గంగిరెడ్డికి ‘రెడ్’ కార్పెట్ వేసిందెవరు?

– బీజేపీలో గంగిరెడ్డి దంపతుల చేరిక వివాదం
– అసలు వారితో డీల్ చేసిన ఎవరా ఇద్దరు?
– ఢిల్లీవరకూ దాకా వెళ్లిన స్మగ్లర్ చేరిన యవ్వారం
– తాము బీజేపీలో చేరతామని మీడియాకు చెప్పిన గంగిరెడ్డి
– రాష్ట్ర నాయకత్వం అనుమతి లేకుండానే ఎలా చేరతారంటున్న సీనియర్లు
– సమన్వయకర్త ఆ ‘డాక్టరు’గారేనంటున్న బీజేపీ సీనియర్లు
– ఢిల్లీకి ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు
– నేరుగా వారికే ట్వీట్ చేసిన వైనం
– కీలక నేత ఆగ్రహంతోనే ఆగిన స్మగ్లర్ చేరిక
– దానితో దిద్దుబాటుకు దిగిన రాష్ట్ర నాయకత్వం
– వైసీపీ రెడ్డి నేతలకు ఓ అగ్రనేత ‘రెడ్డి’కార్పెట్
( మార్తి సుబ్రహ్మణ్యం)

అతను అప్పటి-ఇప్పటి సీఎం చంద్రబాబునాయుడుపై అలిపిరిలో నక్సల్స్ చేసిన దాడికి సహకరించిన వ్యక్తి. ఎర్రచందనం స్మగ్లర్ అన్నది ఆయనకున్న ఆరోపణలాంటి బిరుదు. మొన్నీ మధ్యనే ఆయనను పోలీసులు పిలిపించారట. అలాంటి వ్యక్తికి వైసీపీ ఎంపీ సీటు ఇచ్చిందని, కూటమి నేతలు విరుచుకుపడ్డారు. విచిత్రంగా అదే వ్యక్తి సతీసమేతంగా కమలవనంలో సేదదీరేందుకు సిద్ధమయ్యారు. ఆ మేరకు కడప బీజేపీ పెద్దా ‘రెడ్డి’ గారు, రాజంపేటకు చెందిన ఓ కేంద్రమాజీ మంత్రి అల్లుడుగారు తెరవెనుక కథ నడిపారు. చాలాకాలం నుంచి పార్టీలో తెరవెనుక కీలకపాత్ర పోషిస్తున్న ఓ ‘డాక్టరు’గారి సౌజన్యంతో.. సదరు స్మగ్లర్ దంపతులు కమలతీర్ధం తీసుకునే కార్యక్రమం సిద్ధమయింది.

తాము బీజేపీలో చేరబోతున్నట్లు స్మగ్లర్‌గా ఆరోపణలున్న వ్యక్తి సైతం ఓ మీడియా ప్రతినిధికి సగర్వంగా చెప్పిన వైనం పత్రికలో వచ్చింది. అంతే.. కథ అడ్డం తిరిగింది. యవ్వారం ఢిల్లీ పెద్దల వరకూ వెళ్లింది. వాళ్లు విచారించుకున్నారు. ‘‘మనది చిన్న పార్టీ. అంతపెద్ద హోదా ఉన్న వాళ్లు మన పార్టీకి పనికిరారు. వారిని ఏదైనా అంతర్జాతీయ పార్టీలో చేరమనండి’’ అని సలహా ఇచ్చారట. దానితో చివరి నిమిషంలో కొల్లం గంగిరెడ్డి దంపతుల చేరికకు బ్రేకు పడింది.

మరి ఇదంతా రాష్ట్ర నాయకత్వానికి తెలియకుండానే జరిగిందా? ఎవరి గ్రీన్‌సిగ్నల్ లేకుండానే గంగిరెడ్డి తాను బీజేపీలో చేరుతున్నట్లు, మీడియాకు ఏ ధైర్యంతో ఎలా చెప్పారు? గంగిరెడ్డి పార్టీలో చేరడం లేదని పార్టీ నాయకులు మళ్లీ ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? గంగిరెడ్డి చేరిక వెనుక వైసీపీ కీలక నేత ప్రోత్సాహం ఉందా? ఇంకా ఇలాంటి వారిని ఎంతమందిని చేర్పించే వ్యూహానికి తెరలేచింది? అంతకుమించి.. అసలు పార్టీలో సభ్యత్వం లేకపోయినా, ‘సదరు డాక్టరు గారు’ పార్టీ వ్యవహారాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు? .. ఇదీ ఇప్పుడు బీజేపీ వర్గాలలో జరుగుతున్న వాడివేడి చర్చ.

ఎర్రచందనం స్మగ్లర్‌గా పేరున్న గంగిరెడ్డి.. తన భార్యతోపాటు బీజేపీలో చేరుతున్నారన్న వార్త, రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది. కూటమి అధికారంలో ఉండగా..సీఎం చంద్రబాబునాయుడుపై అలిపిరిలో నక్సల్స్ జరిపిన దాడికి సహకరించారన్న ఆరోపణలున్న గంగిరెడ్డిని, బీజేపీలో ఎలా చేర్చుకుంటారన్నదే ఆ విస్మయానికి కారణం. తాను భార్యతో సహా బీజేపీలో చేరుతున్నట్లు గంగిరెడ్డి స్వయంగా ఓ మీడియాకు వెల్లడించిన వార్త, బీజేపీని అతలాకుతలం చేసింది.

పార్టీ రాష్ట్ర నాయకత్వ అనుమతి ఇవ్వకపోతే, అసలు గంగిరెడ్డి అక్కడినుంచి విజయవాడ దాకా ఎందుకు వస్తారు? ఎలా వస్తారు? తన చేరిక విషయాన్ని మీడియాకు ఆయన ఏ ధైర్యంతో, ఎలా వెల్లడించగలిగారు? పైస్థాయిలో గ్రీన్‌సిగ్నల్ రానిదే గంగిరెడ్డి పార్టీలో ఎలా చేరతారన్న ప్రశ్నలు బీజేపీలో హాట్ టాపిక్‌గా మారాయి.

నిజానికి గంగిరెడ్డి తాను బీజేపీలో చేరుతున్నట్లు మీడియాకు వెల్లడించకపోతే, ఆయన చేరిక విజయవంతంగా జరిగిదే. కానీ మీడియాలో వచ్చిన తర్వాత ఉమ్మడి టీడీపీ జిల్లా నేతలు స్పందించి, బీజేపీ అగ్రనేతలకు ట్వీట్ చేయడం.. దానిపై ఢిల్లీ నాయకత్వం ఆరా తీయడం.. చేర్చుకోవద్దని ఆదేశించడం చకచకా జరిగిపోయాయి. త ర్వాత గంగిరెడ్డి చేరికపై రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రకటన విడుదల చేయటం.. గంగిరెడ్డి పార్టీలో చేరుతున్నారని నేను ప్రకటించానా? ఆయనేమైనా మీకు చెప్పాడా? మా జిల్లా పార్టీ నేతలు మీకు చెప్పారా? అంటూ మీడియాను ప్రశ్నించడం జరిగిపోయింది. అయితే.. పార్టీలో చేరికకు ఆగ్రనేతల గ్రీన్ సిగ్నల్ లేకుండానే, గంగిరెడ్డి తన పార్టీ చేరికను మీడియాకు ఎలా ప్రకటించారన్నది ప్రశ్న.

కాగా ఉమ్మడి-విభజిత కడప జిల్లాలకు చెందిన ఇద్దరు అగ్రనేతలే.. గంగిరెడ్డి దంపతులను పార్టీలో చేర్పించేందుకు కృషి చేశారన్న చర్చ బీజేపీ వర్గాల్లో జరుగుతోంది. అందులో ఒకరు జిల్లా స్థాయి నేత కాగా, మరొకరు మాజీ కేంద్రమంత్రి బంధువని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గంగిరెడ్డి పార్టీలో చేరితే ఉమ్మడి కడప జిల్లాలో పార్టీ బలపడుతుందని, ఆర్ధికంగా పార్టీకి సహకరిస్తారన్న వాదనతో వారిద్దరూ.. ఆర్ధిక వ్యవహారాల్లో నిష్ణాతుడైన, పార్టీకి ఏమాత్రం సంబంధం లేని ఒక డాక్టరు గారిని సంప్రదించారన్న వార్తలు గుప్పుమంటున్నాయి.

చాలాకాలం నుంచి వివిధ అంశాల్లో తెరవెనుక నుంచి చక్రం తిప్పుతున్న ఆ డాక్టరుగారు.. ఇటీవలి ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపికైనా కీలకపాత్ర పోషించారన్న ప్రచారం, పార్టీ వర్గాల్లో అప్పట్లోనే జరిగిన విషయం తెలిసింది. ప్రధానంగా మద్యం తయారీ- అమ్మకాల వ్యవహారాలు, కిరణ్‌కుమార్‌రెడ్డికి రాజంపేట ఎంపీ సీటు అంశం, రఘరామకృష్ణంరాజుకు నర్సాపురం సీటు రాకుండా అడ్డుపడటంలో సదరు డాక్టరుగారే తెరవెనుక చక్రం తిప్పారన్న ప్రచారం జరిగింది.

రాజంపేటలో మిథున్‌రెడ్డి గెలుపుతోపాటు.. సుజనాచౌదరి, సత్యకుమార్, సీఎం రమేష్, రఘురామకృష్ణంరాజుకు ఎంపీ టికెట్లు రాకుండా, చివరి వరకూ కృషి చేసిన సదరు డాక్టరు గారే.. ఇప్పుడు గంగిరెడ్డి దంపతుల చేరిక వెనుక సైతం కీలకపాత్ర పోషించారని, అది ఢి ల్లీ పెద్దలకు తెలియడంతో వ్యూహం దెబ్బతిందని పార్టీ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది.

దీనితో వైసీపీ నుంచి, ఇంకా ఎంతమందిని బీజేపీలో చేర్పించేందుకు రంగం సిద్ధం చేశారోనన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఇటీవల పార్టీ జాతీయ సహ సంఘటనా ప్రధాన కార్యదర్శి శివప్రకాష్‌జీ.. ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలను చేర్చుకోవాలని సూచించారు. అయితే అది టీడీపీ-జనసేనకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని, వివాదాస్పదులు, క్రిమినల్ కేసులు, ఆరోపణలున్న వారిని చేర్చుకోవద్దని స్పష్టం చేశారు. పెద్ద నేతలుంటే వారిని చేర్చుకునేముందు, తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

ఈ నేపథ్యంలో టీడీపీ-జనసేనలో ప్రవేశం లేని వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. వీరిలో దాదాపు అంతా ఆర్ధికంగా బలవంతులే కావడంతో, వారిని చేర్చుకోవడం ద్వారా ‘రెండురకాల లాభాలు’ంటాయన్న వ్యూహంతో.. వారి చేరికలను కొందరు ప్రోత్సహిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రధానంగా వైసీపీలోని రెడ్డి నేతలను చేర్చుకునేందుకు, పార్టీలోని అదే సామాజికవర్గానికి చెందిన ఓ కీలకనేత ఆసక్తిగా ఉన్నారని చెబుతున్నారు.

‘గతంలో వెంక య్యగారున్నప్పుడు పార్టీలో ఉన్నప్పుడు కమ్మ ముద్ర ఉండేది. ఇప్పుడు ఈయన వచ్చిన ఐదేళ్ల నుంచి రెడ్డిముద్ర పడింది. సిద్ధాంతాల ప్రాతిపదిక నడిచే మా పార్టీపై ఇలాంటి కులముద్ర పడటం బాధాకరం’ అని ఓ సీనియర్ నేత ఆవేదన వ్యక్తం చేశారు.