– పెద్దారవీడు మండలంలో విషాదం
ప్రకాశం, మహానాడు: ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం, కొత్తపల్లి గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పంట పొలానికి ఏర్పాటు చేసుకున్న నీటికుంటలోకి దిగిన ముగ్గురు విద్యార్థులు ఊపిరాడక మృతి చెందారు. ఆదివారం సెలవు దినం కావడం.. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వాన ఆదివారం మధ్యాహ్నం తర్వాత తగ్గడంతో కొందరు విద్యార్థులు ఆటలాడుకుంటూ గ్రామ సమీపంలోని ఓ రైతు ఏర్పాటు చేసుకున్న నీటికుంట వద్దకు చేరుకున్నారు.
ఓ విద్యార్థి ప్రమాదవశాత్తు కాలుజారి నీటికుంటలోకి పడి మునిగిపోవడంతో ఆ విద్యార్థిని రక్షించడానికి మరో ఇద్దరు ప్రయత్నించిన క్రమంలో వారు కూడా నీటికుంటలోకి పడిపోయారు. మొత్తం ముగ్గురూ మునిగిపోయారు. ఈ సంఘటనతో నిశ్చేష్టులైన మిగతా విద్యార్థులు పరుగులు పెట్టి గ్రామస్తులకు చెప్పారు. వారంతా సంఘటన స్థలానికి చేరుకుని, ఆ విద్యార్థులను బయటకు తీసి, మార్కాపురంలోని ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్ళారు. అయితే, విద్యార్థులు మృతి చెందినట్టు వైద్యులు తెలపడంతో బోరున విలపించారు.
మార్కాపురంలోని ఓ ప్రైవేటు విద్యాసంస్థలో ఆరో తరగతి చదువుతున్న కొత్తపల్లి శివ(11), స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న ఆరవీటి ఏడుకొండలు(9), కొత్తపల్లి మను(9) మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న సబ్ కలెక్టర్, రెవెన్యూ, పోలీసు అధికారులు గ్రామానికి చేరుకుని నీటికుంటను పరిశీలించారు.
మంతి లోకేష్ దిగ్భ్రాంతి
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం ఎస్.కొత్తపల్లిలో కొత్తపల్లి శివ, కొత్తపల్లి మను, ఆరవీటి ఏడుకొండలు మృతిచెందిన ఘటన తీవ్ర ఆవేదనకు గురిచేసిందని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ఒక ప్రకటనలో తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని, వీరికి ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.