ఏలూరు జిల్లాలో వర్ష పరిస్థితిపై ముఖ్యమంత్రి ఆరా!

– నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రికి ఆదేశం

ఏలూరు, మహానాడు: ఏలూరు జిల్లాలో వర్ష పరిస్థితిపై రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథిని టెలిఫోన్ ద్వారా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడిగి తెలుసుకున్నారు. జిల్లా యంత్రాంగాన్ని అపప్రమత్తం చేసి ఎటువంటి నష్టం సంభవించకుండా పటిష్ఠ చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రికి మంత్రి వివరించారు. జిల్లాలో ప్రస్తుత పరిస్థితిని ముఖ్యమంత్రికి మంత్రి పార్థసారధి తెలియజేస్తూ జిల్లాలో ఎటువంటి ప్రాణ, ఆస్థి నష్టాలు కలగకుండా చర్యలు తీసుకున్నామని, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని మంత్రి చెప్పారు. అధికారులను ముందుగానే అప్రమత్తం చేయడంతో నష్టం జరగకుండా చూడగలిగామని ఈ సందర్భంగా మంత్రి ముఖ్యమంత్రికి తెలిపారు.

జిల్లా, డివిజన్, మండల స్థాయి రెవిన్యూ కార్యాలయాలలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి, పరిస్థితిని ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నామని, కాజ్ వే వద్ద ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకున్నామని మంత్రి వివరించారు. మండల ప్రత్యేక అధికారులు సంబంధిత మండలంల్లోనే బస ఉండి, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. నూజివీడు మండలంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు.

రాష్ట్ర విపత్తు నివారణ దళాన్ని కూడా నూజివీడు ప్రాంతంలో సిద్ధం చేశామని, 200 మందిని నూజివీడులో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలకు తరలించి, భోజన, వసతి సౌకర్యాలు కల్పించామన్నారు. భద్రాచలం వద్ద గోదావరి వరద నీటి మట్టం, నాగిరెడ్డిగూడెం వద్ద తమ్మిలేరు నీటి మట్టం పెరుగుతున్న దృష్ట్యా ఆయా తీర ప్రాంతంలోని ప్రజలను అపప్రమత్తం చేశామని, ముంపునకు గురయ్యే ప్రాంతాలను ముందుగానే గుర్తించి ఆ ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామన్నారు. జిల్లాలో పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని ముఖ్యమంత్రి మంత్రి పార్థసారథి కి సూచించారు.