ఒక్కో పంచాయతీకి రూ. లక్ష!

– పవన్‌ కల్యాణ్‌ స్ఫూర్తితో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌ విరాళం

పెదకూరపాడు, మహానాడు: ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ స్ఫూర్తితో పెదకూరపాడు నియోజకవర్గంలో 10 వరద ప్రభావిత గ్రామాలకు ఒక్కో పంచాయతీకి లక్ష రూపాయల చొప్పున 10 లక్షల రూపాయల వ్యక్తిగత సహాయాన్ని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ప్రకటించారు. పెదకూరపాడు నియోజకవర్గం లో వరద ముంపు 40 గ్రామాల పంచాయతీలకు ఉప ముఖ్యమంత్రి ప్రకటించిన నగదు చెక్కులను సోమవారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే… ప్రతి గ్రామంలో శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం ప్రతి గ్రామంలో సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తాం.. గత ప్రభుత్వంలో పంచాయతీల్లో జరిగిన అవినీతిని వెలికి తీస్తాం. సర్పంచ్ లు,సెక్రటరీలు అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం.

గత పదిరోజులుగా వరద కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని 400 పంచాయితీలకు లక్ష రూపాయల చొప్పున 4 కోట్ల రూపాయల సొంత నిధులను ఇవ్వడం సంతోషకరం. పవన్ స్ఫూర్తితో దాతలు ఎవరి గ్రామాలను వారు అభివృద్ధి చేసుకోవాలి. బాధితులకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా క్షణాల్లో స్పందించి వారి సమస్యలు పరిష్కరించేందుకు ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటాను. కాగా, ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, జనసేన నియోజకవర్గ ఇన్చార్జి రామకృష్ణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆలోకం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.