– వసూళ్ల పల్లవిలో ‘మోహనరాగం’
– టీడీపీలో పనిచేసిన జగన్ తాజా వ్యూహకర్త
– యువగళం స్కెచ్ తనదేనని బిల్డప్పు
– లోకేష్ టీమ్‌లో అనుబంధసంస్థల బాధ్యత
– పదవులిప్పిస్తానని తమ్ముళ్ల దగ్గర వసూళ్లు
– దాదాపు రెండు కోట్లు లాగించేశారట
– సర్దుబాటు కింద మరికొందరు తమ్ముళ్ల నుంచి వసూళ్లు
– అది తెలిసి గెంటేసిన లోకేష్
– ఇప్పుడు భారీ ప్యాకేజీతో జగన్ పంచన
– వ్యూహకర్త పనితనం తెలిసి విస్తుపోతున్న వైసీపీ నేతలు
– ఇంకా వ్యూహకర్తలెందుకంటున్న సీనియర్లు
– పార్టీ నడిపించే సొంత తెలివి లేదా?
(మార్తి సుబ్రహ్మణ్యం)
ఐసియులో ఉన్న పార్టీని జనరల్ వార్డుకు పంపించి, అక్కడి నుంచి నేరుగా అధికారపగ్గాలందుకోవాలన్న కసితో పనిచేస్తున్న వైసీపీ అధినేత జగన్.. కొత్తగా పార్టీకి తెచ్చిపెట్టిన సలహాల డాక్టర్‌కు అంత సీనులేదని తేలింది. ఆయన కనీసం ఆర్ఎంపీ కాదుకదా, నాటుమందులు కూడా వాడటం తెలియని పనిమంతుడని.. అలాంటి శంకర్‌దాదా ఎంబిబిఎస్ ఉత్తి బిల్డప్ బాబూరావేనని తేలిందిట. అంతోటి పనోడికి బోలెడు ప్యాకేజీ ఇచ్చి తెచ్చుకున్న సదరు నయా సలహాదారు.. నేతల దగ్గర చిలక్కొట్టుడులోనే పనిమంతుడని తెలిసిన వైకాపేయులు, జగనన్న అమాయకత్వం చూసి కిసుక్కున నవ్వుకుంటున్నారట. ఆయన ‘మోహనరాగం’ అంతా చిన్న చితకా నేతల నుంచి డబ్బు లాగేసే వసూళ్లగానమేనట.
అసలు తమ పార్టీకి కొత్తగా వచ్చిన సలహాదారు ఎవరు? గతంలో ఎప్పుడూ ఆయన పేరు, ముక్కు మొహం కూడా వినిపించిన దాఖలాలు లేవు. సెఫాలజిస్టులకూ కొత్త ‘మోహనరాగం’ తెలియదంటున్నారు. అలాంటిది ఏకంగా జగనన్నే మన సలహాదారంటూ మన నెత్తిన పెట్టిన అంత పెద్ద మొనగాడు ఎవరు? అన్న ఆశక్తితో.. రంధ్రాన్వేషణ తెలిసిన వైకాపేయులకు, సలహాదారు గురించి బిత్తరపోయే నిజాలు తెలిసి, జగనన్న అమాయకత్వం చూసి జాలిపడుతున్నారట.
తమ పార్టీకి కొత్తగా వచ్చిన సలహాదారు.. ఏపాటి పనిమంతుడో తెలుసుకునేందుకు రంగంలోకి దిగిన వైకాపా సీనియర్లు, టీడీపీలోని తమ సన్నిహిత వర్గాల ద్వారా ఆయన గురించి వాకబు చేశారట. ఆ ప్రకారంగా సదరు సలహాదారు, టీడీపీ యువనేత లోకేష్ వద్ద కొన్నాళ్లు పనిచేశారట. అంతకుముందు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఓ గవర్నమెంటు ప్రాజెక్టును విజయవంతంగా చేశారట. తర్వాత లోకేష్ వద్ద చేరిన సలహాదారు, టీడీపీ అనుబంధసంస్ధల వ్యవహారం చూసేవారట.
ఆ హోదాను అడ్డుపెట్టుకుని పార్టీ పదవులు ఆశించే నాయకులను రక్తం వచ్చేలా గోకేవారట. ఒక్క గుంటూరు నగరానికే చెందిన పలువురు యువ నేతల వద్ద, దాదాపు 50 లక్షలు నాకేశారని తెలిసిందట. మరికొందరి వద్ద చేబదులుగా మరికొన్ని లక్షలు లాగించేశారట. ఆవిధంగా రాష్ట్రవ్యాప్తంగా పదవులు ఆశించే తమ్ముళ్ల వద్ద, దాదాపు 2 కోట్లు నాకేశారని తెలుసుకున్న వైకాపేయులు నోరెళ్లబెట్టారట.
ఇక మంగళగిరి వద్ద ఉన్న చెరువును అభివృద్ధి చేయాలన్న లోకేష్ ప్రయత్నాలను సైతం, సలహాదారు సద్వినియోగం చేసుకున్నారని.. ఈ ఘనకార్యాలన్నీ ఆలస్యంగా తెలుసుకున్న లోకేష్, నీలాంటి పనిమంతుడిని భరించలేమని గెంటేశారని తెలుసుకున్న వైకాపేయులు.. నోరెళ్లబెడుతున్నారట.
అన్ని లెక్కలు వేసుకుని నిర్ణయాలు తీసుకునే జగనన్న, పోయి పోయి ఇలాంటి పనోడిని బోలెడు ప్యాకేజీ ఇచ్చి, మాపై రుద్దుతున్నాడేంటి చెప్మా అని తలపట్టుకుంటున్నారట. అసలు లోకేష్ యువగళం స్కెచ్‌ను తానే రాబిన్‌శర్మకు ఇచ్చానని, అందులో ఆయన గొప్పతనమేదీ లేదని, అదంతా తన ప్రతిభేనన్న సొంత డబ్బా వాయించుకుని, అదే డబ్బాను జగన్ దగ్గర కూడా వాయించినట్లు తెలుసుకుని నోరెళ్లబెడున్నారట.
అయినా పార్టీ పెట్టి ఇన్నేళ్లయి, ఐదేళ్లు అధికారంలో ఉన్న పార్టీకి ఇంకా ఇలాంటి ‘పనిమంతులు’ అవసమా అని వైసీపీ సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. ‘ఇలాంటి వాళ్లందరినీ మాపై రుద్దుతున్న జగన్ తెలివిని ఏమనాలో అర్ధం కావడం లేదు. రాజకీయాలు తెలియని ఇలాంటి వారి నుంచి, మమ్మల్ని రాజకీయాలు-వ్యూహాలు నేర్చుకోమని చెబుతున్న జగన్ ఎప్పటికి బాగుపడతాడో మాకు అర్ధం కావడం లేదు. అంటే ఇన్నేళ్లు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీగా గెలిచిన మేం ఏమీ తెలియని ఇలాంటి సలహాదారుల మాటలు వినాలన్నమాట. ఖర్మ’ అని.. జగన్‌కు అత్యంత సన్నిహితుడైన ఓ మాజీ మంత్రి తలపట్టుకున్నారు.
‘‘అసలు పార్టీ ఎందుకు ఓడిపోయిందో మాలాంటి వాళ్లతో మాట్లాడితే జగన్‌కు నిజాలు అర్ధమవుతాయి. ఇప్పుడు ఏం చేయాలో మాలాంటి వాళ్లను సలహాలు అడిగితే చెబుతాం. తన వైఖరి కారణంగా దూరమైన మీడియాను మళ్లీ దగ్గర చేసుకోవడం ఇప్పుడు రాజకీయంగా మాలాంటి నాయకులకూ అవసరం. కానీ ఇప్పటికీ ఆయన మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. ఇంకా సీఎంగా ఉన్నారని భావిస్తున్నారు. కేవలం ట్వీట్లు, ప్రెస్నోట్ల ద్వారా జనాలకు మళ్లీ దగ్గరవాలనుకుంటున్నారు. ఇలాగైతే మాలాంటి వాళ్లు ఎక్కువకాలం పార్టీలో కొనసాగలేం. టీడీపీ-జనసేనలో చేరే అవకాశం లేని వారు మాత్రమే, ఈ పార్టీకి మిగులుతార’ని మరో మాజీ మంత్రి కుండబద్దలు కొట్టారు.
అయితే జగన్ ధీమాకు మరో కారణం లేకపోలేదని మరికొందరు నాయకులు చెబుతున్నారు. ‘మనం వీలైనన్ని ఎక్కువ పథకాలు జనాలకు ఇచ్చాం. అంతకుమించి ఏ నాయకుడూ ఇవ్వలేరు. అయినా ప్రజలు మనల్ని ఓడించారు. ఇప్పుడు చంద్రబాబు మనకంటే ఎక్కువ ఏమీ ఇవ్వలేరు. కాబట్టి మళ్లీ అధికారాన్ని మళ్లీ మనకే బంగారుపళ్లెంలో అప్పగిస్తారు. కాకపోతే అప్పటివరకూ మనపై పెట్టే కేసులు, అరెస్టులను భరించాలి. దానికి మన లీగల్ టీమును సిద్ధం చేశా. కోర్టులున్నాయి కాబట్టి మీకేమీ భయం లేదు. మీరు మీ నియోజకవర్గాల్లో గట్టిగా నిలబడండి చాలు. ఇప్పటికే సొంత పార్టీ నేతలు చంద్రబాబు తమకేమీ చేయడం లేదన్న అసంతృప్తితో ఉన్నారు. ఇవన్నీ మనకు కలసివచ్చేవేనని జగన్‌ను ఇటీవల మేం కలసిన సందర్భంలో ధీమాతో చెప్పారు. 11సీట్లు వచ్చినా, రాజ్యసభ సభ్యులు చాలామంది వెళ్లిపోతారని తెలిసినా వారిని పిలిచి మాట్లాడకపోవడానికి ఆ ధీమానే కారణం’ అని ఓ మాజీ మహిళా మంత్రి, జగన్ ధీమాను విశ్లేషించారు.
ఇటీవల రాజ్యసభ సభ్యులు పార్టీ నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని, వారిని పిలిపించి ఓసారి మాట్లాడాలని ఓ సీనియర్ నేత జగన్‌కు సూచించారట. అయితే అందుకు స్పందించిన జగన్ ‘ఎలాగూ వెళ్లాలని డిసైడ్ అయిన వాళ్లతో మాట్లాడటం ఎందుకులేన్నా. వెళ్లేవాళ్లని ఆపడం ఎందుకు’ అని తేలిగ్గా కొట్టిపారేసిన ట్లు తెలిసింది.