నడి సముద్రంలో ఫిషింగ్ బోటు దగ్ధం!

– ఐదుగురు మత్స్యకారులు సురక్షితం
– ఎంపీ భరత్‌ దృష్టి దుర్ఘటన
– ప్రభుత్వం ఆదుకోవాలి
– అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మణరావు

విశాఖపట్నం, మహానాడు: నడి సముద్రంలో ఫిషింగ్ బోటు అగ్నికి ఆహుతైంది. ఐదుగురు మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు. ఐదుగురు మత్స్యకారులతో ఆదివారం ఉదయం ఐ.ఎన్.డి.ఏపీ వి 5 ఎం ఎం 495 నెంబర్ గల వాసుపల్లి అప్పయ్యమ్మకు చెందిన మేకనైజ్డ్
బోటు చేపల వేటకు వెళ్ళింది. మధ్యాహ్నం 12గంటల సమయంలో బోటు ఇంజిన్లో ప్రమాదవశాత్తు అగ్ని మంటలు చెలరేగాయి. బోటు పూర్తిగా దహనమైంది.

ప్రాణభయంతో మత్స్యకారులు వి.గురుమూర్తి, ఆర్. నర్సింహులు, గణగల్ల రాము, ఉమ్మడి సత్తయ్య, సురపతి అప్పన్న బోటు నుండి సముద్రంలో దూకేసి సమీపంలో ఉన్న ఏరుపల్లి ధనరాజుకు చెందిన ఐఎన్డీ ఏపీ వి 5ఎంఎం 894 బోటులో ఆదివారం సాయంత్రం సురక్షితంగా హార్బర్ కు చేరుకొన్నారు. ఈ ఘటన తెలియగానే మత్స్య శాఖ ఇంచార్జి జాయింట్ డైరెక్టర్ జి.విజయ ఫిషింగ్ హార్బర్ కు చేరుకొని మత్స్యకారుల యోగ క్షేమాలు అడిగి తెలుసుకొన్నారు. ప్రమాదంపై నివేదికను ప్రభుత్వామని పంపుతామని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర మెకనైజ్డ్ ఫిషింగ్ బోటు ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మైలపల్లి లక్ష్మణరావు మాట్లాడుతూ సముద్రంలో బోటు కాలిపోవడం దురదృష్టకరమని, రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు తగు పరిహారం చెల్లించాలని కోరారు. బోటు ఇంజన్లో మంటలు చెలరేగడంతో ఈ ఘటన జరిగిందని ఈ ఏడాది జూన్ 15న వేట ప్రారంభమయ్యాక ఇంతవరకు ఆరు బోట్లు ప్రమాదాలకు గురయ్యాయని వాటిలో రెండు అగ్నికి దగ్ధం అయ్యాయని చెప్పారు.

తాజాగా దుర్ఘటనను విశాఖపట్నం ఎంపీ శ్రీ భరత్ కు తెలియజేశామని ఆయన వెంటనే స్పందించి, ప్రభుత్వంతో మాట్లాడుతానని హామీ ఇచ్చినట్టు లక్ష్మణరావుచెప్పారు. ఈ కార్యక్రమంలో సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్న మత్స్యకారులతో పాటు రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలా గురువులు, రాష్ట్ర మరపడవల సంఘం మాజీ అధ్యక్షులు పి. సి. అప్పారావు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సురపతి నర్సింగరావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ గనగళ్ల రాజేష్, ఉపాధ్యక్షులు మట్టా రాజు, కార్యదర్శి మున్నం బాలాజీ, జాయింట్ క్యాషియర్ బడే అనీల్, డిప్యూటీ ట్రాఫిక్ మేనేజర్ బి.కె.పట్నాయక్, డాక్ ఇన్స్పెక్టర్ లీలాప్రసాద్, చీకటి రమేష్, గరికిన రవి, మెరైన్ సీఐ పల్లా అప్పారావు తదితరులు పాల్గొన్నారు.