టీటీడీ జేఈఓ.. ఆ మజానే వేరప్పా!

– ఈఓను మించిన అధికారాలు
– ఢిల్లీలో సీఎం అంబాసిడర్‌గా కీర్తి
– జగన్ జమానాలో సీఎం స్థాయి వైభోగం
– నచ్చిన వారికే సబ్ కమిటీల్లో స్థానం
– సొంత వారికే పర్చేంజింగ్ కమిటీలో చోటు
– నోరు తెరవనివారికే ప్రాధాన్యం
– జగన్ జమానాలో మారిన గౌరవం
– లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్లకూ కమిటీల్లో స్థానం
– ఓటు హక్కు లేని వారికి స్థానం లేదని టీటీడీ యాక్టు స్పష్టీకరణ
– అయినా వారికి సబ్ కమిటీలో చోటు ఇచ్చిన వైనం
– గతంలోనూ జేఈఓలదే పెత్తనం
– సీఎంల కుటుంబసభ్యులతోనే నేరుగా టచ్
– బెంగళూరు, ముంబయిలో ఓ మాజీ జేఈఓ విలాసాలు
– బెంగళూరు ఫాంహౌస్‌లో రెండోఫ్లోర్ ఆయనకే
– ముంబయిలో మోడల్స్‌తో ఖుషీ ఖుషీ
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఆయన హిందువుల కులదైవం వెంకన్న కొలువు దీరిన తిరుమల కొండకు పాలనాధికారి. సహజంగా పాలనాధికారి అంటే అంతా ఈఓ అనుకుంటారు. కానీ అది పేరుకే. నిజానికి పెత్తనమంతా జేఈఓలదే. టీటీడీలో అనేక విభాగాలకు జేఈఓలున్నప్పటికీ, కొండపైన పరిపాలన వ్యవహారాలు చూసే జేఈఓ పదవిలోనే మజా ఉంటుంది. వారి వైభోగమే వేరు.

రాష్ట్రంలో ఒక సీఎం పదవి ఎంత స్థాయి క్రేజ్ ఉంటుందో, టీటీడీ జేఈఓకూ అంతే ఇమేజ్ ఉంటుంది. సహజంగా సీఎం కుటుంబసభ్యులు దయతలిచిన వారినే జేఈఓ పోస్టు వరిస్తుంటుంది. అప్పుడప్పుడు ఈఓ పోస్టు నియామకం కూడా అంతే ఉంటుంది. కానీ తక్కువ సందర్భాల్లోనే అలా జరుగుతుంది. మరి నేరుగా సీఎంల కుటుంబసభ్యులతోనే టచ్‌లో ఉండే జేఈఓలు.. టీటీడీ చైర్మన్లు, బోర్డు సభ్యులు, ఎమ్మెల్యేలు, మంత్రులను ఎందుకు ఖాతరు చేస్తారు? మన అమాయకత్వం కాకపోతే!?

జేఈఓల వైభోగం అంతా ఇంతా కాదు. ఒక్కముక్కలో చెప్పాలంటే వారు సామంతరాజులు. ఆ వైభోగం ఎలాంటిదో ఓసారి చూద్దాం. ఆయనో మాజీ జేఈఓ. చాలా ఏళ్లు కొండను వెలిగించారు. చూడ్డానికి పంచె, నుదుట గోవిందనామంతో అపర వెంకన్న భక్తుడిలా సాక్షాత్కరిస్తారు. కానీ ఇదంతా ఒకవైపే. ఇక మరోవైపు.. అంటే శనివారం ఉదయం నుంచి ఆదివారం రాత్రివరకూ సారు స్టైలే వేరు. జీన్స్, టీషర్టు, రేబాన్ కళ్లద్దాలు. బాగా తెలిసిన వారు కూడా గుర్తుపట్టలేనంత పైలాపచ్చీస్ డ్రెస్సింగ్.

సారు బెంగళూరు, ముంబయి, థాయ్‌లాండ్ వెళితే అక్కడ కూడా రాచమర్యాదలేనట. సారుకు గాన ‘కోకిల’లంటే చాలా ముచ్చటన్న ప్రచారం ఉంది. గాన ‘కోకిల’లు దర్శనానికి వస్తే వారికి ప్రత్యేక దర్శనాలు, ప్రత్యేక మర్యాదలు చేయించేవారన్న ప్రచారం కూడా అప్పట్లో నడిచింది.

సారు బెంగళూరు శివార్లలోని ఓ ఫాంహౌస్, ఎట్రియా లాంటి హోటల్స్‌లో దిగితే.. అచ్చంగా రెండోఫ్లోరంతా సారుకేనట. ఆయన ఉన్నంత వరకూ ఎవరినీ పైకి పంపించరు. కేవలం ‘ఆయన సేవలో తరించేందుకు’ వచ్చే వారిని తప్ప! ఇక సారు ముంబయి వెళితే, ఎయిర్‌పోర్టులో దిగగానే ఖరీదైన పడవ లాంటి కారులోని ఫిమేల్ ‘ఎస్కార్ట్’ ఆయనకు స్వాగతం పలుకుతారట.

ఆ రెండురోజుల అక్కడే గానాబజానా. డాన్సులు, డిస్కోలు, మందు, విందు, చిందు ఇంకా .. చాలా కళలు ప్రదర్శిస్తారట. మళ్లీ ఆదివారం రాత్రికి తిరుమతికి వెళ్లి, సోమవరం తెల్ల పంచె. నుదుట గోవిందనామంతో తయార్. ఈ కళలన్నీ అప్పట్లోనే బాగా ప్రచారం జరిగాయి. కొండపై జేఈఓల వైభోగం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి, ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే.

జేఈఓలకు ఢిల్లీలో ఉండే పలుకుబడి..రాష్ట్రంలోని సీఎం, మంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలకూ ఉండదు. ఎందుకంటే హస్తినలో సీఎంల కోసం లాబీయింగ్ చేసేది జేఈఓలే కాబట్టి. తిరుమల ప్రసాదాలు ప్రత్యేక కార్టన్లలో తీసుకువెళ్లి.. పీఎంఓ నుంచి కేంద్రమంత్రుల ఆఫీసులు, సీబీఐ, ఈడీ, ఐటీ ఆఫీసుల వరకూ స్వయంగా వీరే వెళ్లి ప్రసాదం ఇస్తుంటారు. ఆ సందర్భంలో కేంద్ర మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులతో బంధం బలపడుతుంది. ఆ బంధమే జగన్‌ను ఢిల్లీ స్థాయిలో ఐదేళ్లు కాపాడింది. ఇక వీరు డిఫెన్సు సర్వీసుకు చెందిన వారయితే చెప్పాల్సిన పనిలేదు.

సుప్రీంకోర్టు-హైకోర్టు న్యాయమూర్తులకు జేఈఓలతో ఉండే సంబంధాలు మరెవరికీ ఉండవు. సహజంగా న్యాయమూర్తులకు బయట ప్రపంచంతో పెద్దగా సంబంధం ఉండదు. కానీ టీటీడీ జేఈఓలకు మాత్రం.. వారి ఇళ్లలో జరిగే అన్ని శుభకార్యాలకు పిలుపు వెళుతుంటుంది. అంటే జేఈఓలు ఎంత శక్తివంతులో అర్ధమవుతుంది.

జగన్ జమానాలో ఒక జడ్జిగారి ఇంట్లో పెళ్లికి వెళ్లిన సందర్భంలో.. 2 కోట్ల ఖరీదైన డైమండ్ వాచ్‌ను, జగన్ తరఫున ఇవ్వజూపిన జేఈఓల ధైర్యంపై ఆ జడ్జి ఫైరయిన వార్త అప్పట్లో సంచలనం సృష్టించింది. సుప్రీంకోర్టు-హైకోర్టు జడ్జిలు, వారి బంధుమిత్రులు తిరుమలకు వచ్చి- తిరిగి విమానం ఎక్కేంతవరకూ, జేఈఓలు స్వయంగా దగ్గరుండి వారి మంచిచెడ్డలు చూసుకుంటారు.

గతంలో సినిమా కమ్ పొలిటీషియన్ అయిన ఓ రెడ్డిగారు చైర్మన్‌గా ఉన్నప్పుడయితే.. ఢిల్లీలోని ప్రతి ఎంపి క్వార్టర్‌కు వెళ్లి, స్వయంగా ఆయనే ప్రసాదాలు ఇచ్చేవారు. ఆ తర్వాత వచ్చిన ఇంకో గడ్డం రెడ్డిగారయితే, ఏకంగా ఢిల్లీలో ప్రసాదాల దుకాణమే పెట్టేశారు.

అసలు విజయసాయి ఢిల్లీ వెళ్లకముందు, జగనన్న పనులు చక్కబెట్టింది ఆ గడ్డం రెడ్డిగారే. అంటే తిరుమల శ్రీవారి లడ్డును పైరవీకారులు ప్రలోభాలకు అస్త్రంగా మార్చుకున్నారని అర్ధమవుతూనే ఉంది. జగన్ జమానాలో, ఢిల్లీలోని కొందరు ప్రముఖులకు టీటీడీలో స్థానం కల్పించడం ద్వారా ..ఆయన న్యాయ, ప్రభుత్వ రక్షణ పొందారన్న చర్చ బహిరంగంగానే జరిగింది. అందుకు ప్రధాన కారణం జేఈఓ హోదానే.

ఇంకో ఆశ్చర్యం.. నోరెళ్లబెట్టే అంశం ఏమిటంటే.. చంద్రబాబు పక్షపాతి-జగన్‌కు శత్రువుగా పేరున్న అప్పటి సుప్రీంకోర్టు పెద్దాయన, జగన్ సీఎంగా ఉండగా స్టార్‌హోటల్‌లో భేటీ వేయడానికి కీలకపాత్ర పోషించిన వారిలో.. ఇద్దరు జేఈఓలున్నారన్న వార్త అప్పుడే వినిపించింది.

సదరు సుప్రీంకోర్టు పెద్దాయన కుటుంబం, అమరావతిలో అక్రమంగా స్థలాలు కొనుగోలు చేసిందంటూ అదే జగన్ సర్కారు, ఆయనను అప్రతిష్టపాలు చేసింది. కోర్టుదాకా వెళ్లింది. అసలు ఆయనను సుప్రీం బాసుగా నియమించవద్దని అప్పటి పెద్దాయనకు, బారెడు పొడుగు లేఖలతో ఫిర్యాదు చేసింది. అలాంటి పెద్దాయననే మచ్చిక చేసుకుని, పాత పగ మర్చిపోయి, కొత్త బంధానికి బాటలు వేసేలా చేసిన జేఈఓల శక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే.

తర్వాత సదరు సుప్రీం పెద్దమనిషి తిరుమలకు ఎప్పుడు వెళ్లినా, జేఈఓ రెడ్‌కార్పెట్ వేసేవారు. దాని తర్వాత జరిగిన చంద్రబాబు అరెస్టు పరిణామంలో.. బాబు మనిషిగా ముద్రపడ్డ సదరు సుప్రీం మాజీ పెద్దమనిషి ఎక్కడా కనిపించకపోవటడం, టీడీపీ సోషల్‌మీడియా సోల్జర్స్ కోపానికి కారణమయింది. బాబు జైల్లో ఉన్న సమయంలో సదరు సుప్రీం పెద్దమనిషి , బాబును బయటకు తెచ్చేందుకు న్యాయపరంగా ఎలాంటి సాయం చేయలేదని.. తన పలుకుబడి వినియోగించలేదన్నది టీడీపీ సోషల్‌మీడియా సైనికుల కోపానికి అసలు కారణం.

పైగా కేవలం సదరు సుప్రీం పెద్దాయన అధికారంలో ఉన్నప్పుడు.. అన్యాయానికి గురైన ఓ న్యాయాధికారి, ఆ ఆగ్రహాన్ని బాబుకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారన్న చర్చ అప్పట్లో జరిగిన విషయం తెలిసిందే. విచిత్రంగా.. ఇప్పుడు సుప్రీం పెద్దమనిషి పేరు టీటీడీ చైర్మన్ పదవికి వినిపిస్తోంది. అన్నట్లు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి చాలా మంచివాడని ఇదే పెద్దాయన కితాబివ్వడం విశేషం.

ఇక టీటీడీ బోర్డు మీటింగులు, ఫైనాన్స్ కమిటీ, పర్చేజింగ్ కమిటీల్లాంటి సబ్ కమిటీలపై టీటీడీ యాక్ట్ ఏం చెబుతోంది? జగన్ జమానాలో దానికి విరుద్ధంగా ఏం చేశారని తెలుసుకుంటే నోరెళ్లబెట్టాల్సిందే. టీటీడీ సభ్యుల సంఖ్యపై మొదటి నుంచీ వివాదమే కాబట్టి.. దాని సంగతి పక్కనబెడదాం.

అసలు బోర్డు మీటింగులకు కేవలం ప్రభుత్వం నియమించిన బోర్డు సభ్యులు, దేవాదయ శాఖ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరి, ఈఓ మాత్రమే అర్హులు. పర్చేంజింగ్, ఫైనాన్స్ వంటి కమిటీలకు వారిని మాత్రమే నియమించాన్నది టీటీడీ యాక్టు చెబుతోంది. చివరకు జేఈఓ కూడా హాజరయ్యే అధికారం లేదు. ఆయన తన సబ్జెక్టు వచ్చినప్పుడు మాత్రమే హాజరయి బయటకు రావలసిందే. అందుకే బోర్డు మీటింగును చిన్న భవనంలో నిర్వహించేవారు.

కానీ జగన్ జమానాలో పద్ధతి రివర్సయింది. ప్రత్యేక ఆహ్వానితులు, వివిధ రాష్ట్రాల్లోని లోకల్ బాడీ చైర్మన్లు కూడా బోర్డు సమావేశాలకు హాజరవుతున్న పరిస్థితి. టీటీడీ యాక్టు ప్రకారం, వీరికి బోర్డులో ఓటు హక్కు ఉండదు. దర్శనాల విషయాల్లోనే ప్రొటోకాల్ ఉంటుంది. కానీ విచిత్రంగా జగన్ జమానాలో.. వీరిని బోర్డు మీటింగులకు ఆహ్వానించడమే కాకుండా, పర్చేజింగ్ కమిటీలో కూడా స్థానం కల్పించి యాక్టును బుట్టదాఖలు చేశారు.

హైదరాబాద్, ఢిల్లీ, కశ్మీర్ వంటి రాష్ట్రాల్లో నిర్మించిన టీటీడీ ఆలయాలకు అక్కడి స్థానికులను మాత్రమే చైర్మన్లుగా నియమించాలి. కానీ కొండపై వెలసిన ‘రెడ్డిదొరలు’, నెల్లూరు నాయకులను కూడా ఉత్తరాది రాష్ట్రాల లోకల్‌బోర్డులకు చైర్మన్లుగా నియమించారు. సహజంగా ఈ నియామకాలు జేఈఓనే చూస్తుంటారు.