అంబేద్కర్ ఒక బుద్ధిస్ట్.. ఆయన క్రిస్టియన్ కాదు

– నన్ను బద్నామ్ చేసేందుకు సునీల్‌కుమార్ బ్యాచ్ కుట్ర
– పి వి సునీల్ కుమార్ ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ లాగా తయారయ్యాడు
– సనాతన స్వదేశీ సేన అధ్యక్షుడిగా చూస్తూ ఊరుకునేది లేదు
– మా గుడికి అడ్డంగా ఫ్లెక్సీలను కడితే చూస్తూ ఊరుకోవడానికి మేమేమైనా చేతికి గాజులను తొడుక్కున్నామా?
– హక్కులు మీకేనా… మాకు ఉండవా?
– మా దేవాలయానికి అడ్డంగా ఫ్లెక్సీ కట్టి గుళ్లోకి వెళ్ళనివ్వరా?
– గుళ్లోకి వెళితే ఎస్సీ, ఎస్టీ కేసులు పెడతామని బెదిరిస్తారా?
– మేము ఎప్పుడైనా చర్చికి, మసీదుకు అడ్డంగా బ్యానర్లు కట్టామా? మేము ఎప్పుడూ అలా కట్టం
– గుడికి అడ్డంగా కట్టిన ఫ్లెక్సీ తొలగించి భద్రంగా పక్కన పెట్టినందుకు ఇన్ని మాటలు మాట్లాడతారా?రాష్ట్రాన్ని ఏకం చేస్తామని బెదిరిస్తారా?
– ఏలూరుపాడు లో జరిగిన సంఘటన గురించి అమలాపురంలో ఉన్న వ్యక్తికి ఏమి తెలుసు?
– ఇక్కడ దళితులు లేరా? వారు మాట్లాడరా?
– శూన్యంలో నుంచి ఒక కట్టుకథను సృష్టించిన నన్ను బద్నామ్ చేయాలని పీవీ సునీల్ కుమార్ అండ్ గ్యాంగ్ ప్రయత్నం
– మా గుడి గట్టు పై కూర్చుని అక్కడే సిగరెట్లు తాగుతూ , ఉమ్మి వేస్తూ దేవాలయంలోకి రానివ్వమని బెదిరిస్తే ఊరుకోవాలా?
– అంబేద్కర్ అంటే ఈ మాట్లాడే వారి కంటే నాకే ఎక్కువ గౌరవం
– ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజు

ఉండి: మా దేవాలయంలోకి మమ్మల్నే వెళ్లకుండా అడ్డంకులు సృష్టించి, ఎలా గుడిలోకి వెళ్తారో చూస్తామని బెదిరిస్తే, బెదిరిపోవాలా? హక్కులు మీకేనా? మాకు ఉండవా? సనాతన స్వదేశీ సేన అధ్యక్షుడిగా చూస్తూ ఊరుకునేది లేదు. అని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. ఏలూరుపాడు లో జరిగిన సంఘటనపై, సోషల్ మీడియాలో పీవీ సునీల్ కుమార్ అండ్ బృందం తో కలిసి చేస్తున్న దుష్ప్రచారంపై ఆయన మీడియాతో మాట్లాడారు.

మా దేవుడిని ప్రార్థించుకునే హక్కులు మాకు ఉండవా? మీకు మాత్రమే హక్కులు ఉంటాయా ? అని నిలదీశారు. మీరు వ్యక్తులనైనా ప్రార్థించుకోవచ్చు కానీ మేము మా దేవుడి గుడికి వెళ్లి ప్రార్థించుకోవద్దా? అంటూ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు.
పురాణ ఇతిహాసాల ప్రకారం మాకు కొన్ని నమ్మకాలు ఉంటాయి. మాది సనాతన ధర్మం. మీది ఆధునిక ధర్మం. అందులో తప్పేమీ లేదు. మీ ధర్మం తప్పని మేము అనడం లేదు. మా ధర్మం తప్పని మీరు కూడా అనకూడదన్నారు. స్క్రీన్లు వేసి మాట్లాడినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు. మీ దేవుడిని పూజించుకోవడానికి మీకు ఎంత హక్కు ఉందో… మా దేవుడిని పూజించుకోవడానికి మాకు అంతే హక్కు ఉందన్నారు.

మీ చర్చిల జోలికి మేము రాము. మా ఆలయాల జోలికి మీరు రావద్దని రఘురామకృష్ణం రాజు తేల్చి చెప్పారు. ఏలూరుపాడు లో జరిగిన సంఘటనపై, కొందరు కావాలనే పచ్చి అబద్దాలు చెబుతున్నారన్నారు. నిన్ననే జరిగిన సంఘటనపై వివరణ ఇచ్చాను. అయినా ఉద్దేశపూర్వకంగా కొంతమంది తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు. దానిపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉంది.

ఆవేశం ఎక్కువ అయినప్పుడు నిజానిజాలు తెలుసుకోకుండానే, అవకాశం దొరికిందని కొంతమంది, దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకునే అవకాశం ఉందన్నారు. శూన్యంలో నుంచి ఒక కట్టు కథను సృష్టించి, పీవీ సునీల్ కుమార్ అండ్ గ్యాంగ్ తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారు. అంబేద్కర్ ఇండియా మిషన్ ( ఏఐఎం) ముసుగులో పి వి సునీల్ కుమార్ ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ లాగా తయారయ్యాడు.

సునీల్ కుమార్ అతడి బృందం, మధ్యాహ్నం 3 గంటలకు చిన్న హడావుడి కార్యక్రమం చేయాలని చూస్తున్నట్లుగా తెలిసిందన్నారు. ఒక అబద్ధాన్ని నిజం చేయాలని ప్రయత్నం చేసుకుంటే చేసుకోండి. నేనేమి చేస్తున్నానో, చేశానో నా నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసునని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఈ సంఘటనపై అమలాపురానికి చెందిన వ్యక్తుల స్టేట్మెంట్ ను సాక్షి దినపత్రిక ప్రచురించడం పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఏలూరుపాడు లో ఏమి జరిగిందో అమలాపురం లో ఉన్న వ్యక్తులకు ఏమి తెలుసునని ప్రశ్నించారు. గుడికి అడ్డంగా ఫ్లెక్సీ కట్టి, హిందూ ముసుగు లో ఉన్న ఇద్దరు క్రిస్టియన్ వ్యక్తులు లోపలికి వెళ్లకుండా దారి మూసి వేశారన్నారు. గుడికి అడ్డంగా ఉన్న తాళ్ళను విప్పేసి, ఫ్లెక్సీ ని భద్రంగా పక్కన పెడితే… ఫ్లెక్సీ ని చింపేసినట్లుగా గొడవ చేస్తున్నారని రఘురామకృష్ణంరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫ్లెక్సీ కోసం గుడి కి అడ్డంగా పెట్టిన కర్రను తొలగించి, ఫ్లెక్సీ తాళ్ళను విప్పడం జరిగిందన్నారు. భద్రంగా పక్కన పెట్టిన ఫ్లెక్సీ ని ఇదే వ్యక్తులు అంబేద్కర్ విగ్రహం కింద మళ్ళీ కట్టుకున్నారన్నారు. అసలు ఆ ఫ్లెక్సీ ఏమిటో…ఆ ఫ్లెక్సీలో ఏమి రాశారో తెలుసునా? అంటూ అసత్యాలను ప్రచారం చేస్తున్న వారిని ప్రశ్నించారు.

వర్గీకరణకు అనుకూలంగా, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఫ్లెక్సీ ని ఏర్పాటు చేశారన్నారు. ఈ దేశంలో నివసించే వారికి ఎవరికైనా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు శిరోధార్యమని, అటువంటి తీర్పు చెల్లదని రోడ్డుపై ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఫ్లెక్సీలు కట్టిన వ్యక్తులే.. నాగేంద్ర స్వామి గుడి పిట్ట గోడపై కూర్చొని సిగరెట్లు తాగుతూ, అక్కడ ఉమ్మి వేశారన్నారు.

ఫ్లెక్సీ అడ్డంగా కట్టడం వల్ల మొన్న నేను ఏలూరుపాడుకు వెళ్ళినప్పుడు నాగేంద్ర స్వామి విగ్రహం కనపడలేదన్నారు. గుడికి వెళ్లడానికి అంతరాయాన్ని కలిగించడమే కాకుండా, ఎవడు వస్తాడో…ఎలా వస్తాడో చూసుకుంటామని బెదిరింపులకు దిగారన్నారు. గుడిలోకి ఎవరైనా వస్తే వారిపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద ఫిర్యాదు చేస్తామని బెదిరింపులకు దిగారన్నారు.

ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసుల నమోదుపై సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తుల్ని కులం ప్రాతిపదికన దూషించినట్లు ఆధారాలు ఉంటేనే, ఎదుటి వారిపై కేసులను నమోదు చేయాలనిపేర్కొనడం జరిగిందన్నారు. ఏలూరుపాడు గుడిలో వ్యక్తుల గురించి కులం , మతం గురించి తాను మాట్లాడలేదన్నారు.

హిందూ దేవాలయంలోకి వెళ్లకుండా, అడ్డంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం కరెక్ట్ కాదన్న రఘురామకృష్ణం రాజు.. చర్చి, నేను చంద్రబాబు నాయుడు బ్యానర్ ను ఏర్పాటు చేస్తే , మసీదు ముందు పవన్ కళ్యాణ్ బ్యానర్ ను మరొకరు ఏర్పాటు చేస్తే.. టీవీల్లో కూర్చుని డిబేట్లు చేస్తున్న వారు ఊరుకుంటారా చెప్పండి అంటూ రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. మా గుడికి అడ్డంగా ఫ్లెక్సీలను కడితే చూస్తూ ఊరుకోవడానికి మేమేమైనా చేతికి గాజులను తొడుక్కున్నామా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సుప్రీం కోర్టు తీర్పు పై అభ్యంతరం ఉంటే కోర్టుకు వెళ్ళండి. రోడ్డుపై పంచాయతీ ఏమిటి?

ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై అభ్యంతరాలు ఉంటే కోర్టుకు వెళ్లాలని, రోడ్డుపై ఫ్లెక్సీలను కట్టి పంచాయితీలు చేయడం ఏమిటని రఘురామకృష్ణంరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో నివసించే, ఏ వ్యక్తి అయినా సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాల్సిందేనన్నారు.

దేవాలయంలోకి వెళ్లకుండా అడ్డంగా ఫ్లెక్సీ కడితే చూస్తూ ఖాళీగా కూర్చోవాలా, ఎస్సీ ఎస్టీ కేసులు పెడతామంటే గుళ్లోకి వెళ్లకుండా ఊరుకోవాలా అని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. అక్కడ కూర్చొని సిగరెట్లు కాల్చి ఉమ్మి వేయడం గురించి కదా నేను మాట్లాడింది? అంటూ నిలదీశారు.

అంబేద్కర్ ను అవమానించానని మాట్లాడేవారు అక్కడ నేను ఏమి చేశానో చూశారా ?

అంబేద్కర్ ను అవమానించానని మాట్లాడుతున్న వాళ్ళు, అక్కడ నేను ఏమి చేశానో చూశారా? అంటూ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. గుడికి అడ్డంగా కట్టిన ఫ్లెక్సీ తొలగించి భద్రం చేశామని చెప్పారు. అదే ఫ్లెక్సీ ని తీసి వారు తిరిగి అంబేద్కర్ విగ్రహం కింద కట్టుకున్నారని ఆధారాలతో సహా మీడియా సమావేశంలో ప్రదర్శించారు.

ఫ్లెక్సీ ని తొలగించి భద్రంగా పక్కన పెడితే, ఫ్లెక్సీ ని చింపేశానని అసత్య ప్రచారాన్ని చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ఏమైనా కుసంస్కారినా అంటూ ప్రశ్నించిన ఆయన.. ఇప్పుడు నన్ను వ్యతిరేకిస్తున్న క్రిస్టియన్ల కంటే, అంబేద్కర్ ను నేను ఎక్కువగా గౌరవిస్తానని తెలిపారు.

అంబేద్కర్ ఒక బుద్ధిస్ట్.. ఆయన ఎప్పుడూ క్రిస్టియన్ కాదన్నారు. అంబేద్కర్ కు పాలాభిషేకం చేయడంపై రఘురామకృష్ణంరాజు స్పందిస్తూ.. ఆయన పాలాభిషేకానికి అన్ని విధాలుగా అర్హుడని, అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని పోరాడిన వ్యక్తే కాకుండా , రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లను కల్పించిన మహానుభావుడని పేర్కొన్నారు.

అంబేద్కర్ కు రోజు పాలాభిషేకం చేయమని, అవసరమైతే పాలు తానే ఇస్తానని చెప్పారు. అంతేకానీ హిందువుల దేవాలయాలకు అడ్డంగా ఫ్లెక్సీలను కడుతామనడం కరెక్ట్ కాదన్నారు. మా గుడిలోకి మేము వెళ్తామంటే, ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం కింద కేసులు నమోదు చేస్తామని బెదిరించడం సమంజసం కాదని పేర్కొన్నారు. ప్రజలందరూ చూస్తుండగానే, వీడియో తీస్తుండగానే గుడికి అడ్డంగా ఏర్పాటు చేసిన కర్రను, ఫ్లెక్సీ ని తొలగించడం జరిగిందన్నారు.

మా గుడికి అడ్డంగా ఉన్న కర్రను, ఫ్లెక్సీ ని తొలగిస్తే ఇన్నేసి మాటలు అంటూ, ఊరేగింపులు చేస్తారా ? అని రఘురామకృష్ణం రాజు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంబేద్కర్ జోలికి వస్తే రాష్ట్రాన్ని ఏకం చేస్తామని కొంతమంది పేర్కొనడం హాస్యాస్పదంగా అనిపించిందన్నారు. అంటే మీరు అబద్ధాలు చెబుతూ పోతే, మేము నిజాలను చెప్పలేమని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు.

నిజానిజాలను తెలుసుకోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడడం కరెక్టేనా అని నిలదీసిన ఆయన.. అసలు ఇది న్యాయమేనా అని ప్రశ్నించారు. ఈ గొడవలను ప్రోత్సహించిన వారు జగన్ పార్టీలో చురుకుగా ఉంటూ, క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్న వారు.. హిందువులపై ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద, కేసు నమోదుకు ఫిర్యాదు చేస్తున్నారన్నారు.

స్థానిక ఏలూరుపాడు సి ఎస్ ఐ చర్చిలో కొనసాగుతూ, తాము హిందువులమని పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. వారు క్రిస్టియన్లు అనడానికి తగిన ఆధారాలు ఉన్నాయని, వారి తల్లిదండ్రులు, పూర్వీకుల సమాధులపై రాసిన పేర్లు, సిలువ ఆకారంతో రూపొందించిన సమాధుల ఫోటోగ్రాఫ్ తో సహా అన్ని ఆధారాలను కలెక్టర్, స్థానిక ఎమ్మార్వో కు అందజేసి, వారి కుల ధ్రువీకరణ పత్రాలను రద్దు చేయాలని కోరడం జరిగిందన్నారు.

ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం దుర్వినియోగంలో ఏపీ టాప్

ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం దుర్వినియోగంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉన్నదని రఘురామకృష్ణం రాజు తెలిపారు. 90 శాతం మంది వేరొక మతాన్ని ఆచరిస్తూ, తప్పుడు ఫిర్యాదులను చేస్తూ ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. మతం మారిన వారికి రాజ్యాంగం ప్రకారం బీసీ- సీ సర్టిఫికెట్ జారీ చేయడం జరుగుతుందన్నారు.

ఈ చట్టాన్ని మార్చమని ఎంతోమంది న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పిందన్నారు. క్రిస్టియన్, ఇస్లాం మతాలు కులాలకతీతంగా ఏర్పడ్డాయని పేర్కొన్న ఆయన, 2000 సంవత్సరాల క్రితం క్రిస్టియన్ మతం, 1400 సంవత్సరాల క్రితం ఇస్లాం మతం ఏర్పడ్డాయని తెలిపారు.

ఏ మతాన్ని ఆచరించాలన్నది ఎవరికి వారి వ్యక్తిగత అభిప్రాయం అని, కుల రహిత మతంలోకి వెళ్లినప్పుడు… ఆ మతంలో కులాలు పెట్టాలనడం భావ్యం కాదన్నారు. అది ఆయా మతాలను అవమానించడమే అవుతుందని పేర్కొన్నారు. నా తల్లిదండ్రులు క్రిస్టియన్లు అయినప్పటికీ.. నేను హిందువునని పేర్కొంటున్నవారికి గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, క్రిస్టియన్ తల్లిదండ్రులకు జన్మించిన వారు జన్మతః క్రిస్టియన్ అవుతారని స్పష్టం చేయడం జరిగింద న్నారు.

క్రిస్టియన్లు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు పెడతామంటే, గుడ్లప్పగించి పెట్టించుకోవాలా? అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. ఇప్పటికే ఈ అంశంపై ఫిర్యాదు చేసినట్లు, వారి సర్టిఫికెట్లను రద్దు చేయాలని కోరినట్లు తెలిపారు. అందరం కలిసి ఉందామని పేర్కొన్న ఆయన.. మీరు మా దేవాలయాలలోకి వెళ్లడానికి అడ్డంకులు సృష్టించవద్దన్నారు.

వైకాపా సహకారంతోనే ఇవన్నీ చేస్తున్నారన్న సమాచారం తనకు ఉందని, పనికిమాలిన సాక్షి దినపత్రికలో ఎవడో అమలాపురంలో స్టేట్మెంట్ ఇస్తే ప్రచురిస్తారన్నారు. అమలాపురం, కాకినాడలో మాట్లాడడం ఎందుకన్న ఆయన, తమ నియోజకవర్గంలో దళితులు లేరా అంటూ నిలదీశారు. గుడికి అడ్డంగా రావద్దంటే డిబేట్లు పెట్టి రాష్ట్రాన్ని ఏకం చేస్తామంటే బెదిరిపోతామా అంటూ నిలదీశారు.

నాలుగు సంవత్సరాల క్రితమే ఈ పోరాటం మొదలు పెట్టానని, ఇదే అంశంపై పార్లమెంట్లో కూడా మాట్లాడాలని గుర్తు చేశారు. మతమార్పిడులను జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్న విషయాన్ని స్ట్రింగ్ అనే ఇంగ్లీష్ ఛానల్ లో ఓపెన్ గా బయటపెట్టానని, ఆ ఇంటర్వ్యూకు మిలియన్ వ్యూస్ పైగా వచ్చాయని పేర్కొన్నారు. ఎవరైనా రాజ్యాంగాన్ని గౌరవించాలని అప్పుడు చెప్పాను. ఇప్పుడు చెబుతున్నానని పేర్కొన్నారు.

అంబేద్కర్ పై గౌరవంతో వారు పిలవకపోయినా, వందల విగ్రహాలకు వెళ్లి దండలు వేసి నివాళులు అర్పించానని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అది చేస్తాం… ఇది చేస్తామని చెప్పి 50 నుంచి 60 లక్షలు అడిగిన బ్యాచ్ ఉన్నారని, అవసరమైతే వారి పేర్లు బయట పెట్టడానికి కూడా వెనుకాడనని చెప్పారు.

నేను అంత ఖర్చు పెట్టుకోలేనని చెప్పి వారిని పంపించడం జరిగిందన్నారు. నిజమైన హిందువులు రిజర్వేషన్ల కోసం హిందూ మతం నుంచి, క్రైస్తవ మతంలోకి మారిన వారి వల్ల ఇబ్బందులు పడుతున్నారన్నారు.

గుడిలో కూర్చొని సిగరెట్లు కాల్చి, అక్కడే ఉమ్మి వేసిన వారికి మద్దతుగా డిబేట్లు పెట్టే వారికి ఒకటే చెబుతున్నా.. గుడిలోకి వెళ్లకుండా అడ్డంకులను సృష్టిస్తే సనాతన స్వదేశీ సేన అధ్యక్షుడిగా చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.
చర్చీలు, మసీదుల ముందు తాము ఎప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బ్యానర్లు కట్టమని, అలాగే దేవాలయాల ముందు మీరు ఫ్లెక్సీలు కట్టి, ఈ అరువు దెబ్బలాటకు దిగవద్దన్నారు.