తిరుపతి: తిరుమల లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యి కల్తీ విచారణ కోసం ఏర్పడిన ప్రత్యేక దర్యాప్తు బృందం తిరుపతికి చేరుకుంది. సిట్ అధిపతి, ఐజీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా తిరుమల వెళ్లనున్నారు. ఇప్పటికే విశాఖ డీఐజీ గోపినాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు తిరుపతికి చేరుకున్నారు. వందే భారత్ రైలులో ఇద్దరు డీఎస్పీలు సీతారామారావు, శివనారాయణ స్వామి, ఉమా మహేశ్వర్ (విజయవాడ), సూర్యనారాయణలు సీఐ సత్యనారాయణ (అన్నమయ్య జిల్లా) తిరుపతికి చేరుకున్నారు.
సిట్‌లో సభ్యుడు తిరుపతి అడ్మిన్ ఎఎస్పీ వెంకటరావు స్థానికంగా ఉంటూ విచారణకు సహకరించనున్నారు. ముందుగా పోలీసు గెస్టు హౌస్‌కు చేరుకున్న సిట్ బృందం.. ఆపై తిరుపతి పోలీస్ గెస్ట్ హౌస్ నుంచి తిరుమలకు బయలుదేరి వెళ్లారు. తిరుమలకు వెళ్లి టీటీడీ ఈవో, అడిషనల్ ఈవోలని సిట్ బృందం కలువనుంది. ఆపై తిరుమలలో శ్రీవారిని సిట్ బృందం సభ్యులు దర్శించుకోనున్నారు. ఆ తరువాత తిరుమల అన్నమయ్య భవన్ సిట్ సమావేశం కానుంది.
కాగా… తిరుమల లడ్డూ వివాదాన్ని సీరియస్‌గా తీసుకున్న సర్కార్ నెయ్యి కల్తీపై విచారణకు సిట్‌ను నియమించిన విషయం తెలిసిందే. గుంటూరు రేంజ్ ఐజీగా ఉన్న సర్వ శ్రేష్ఠ త్రిపాటిని సిట్ అధిపతిగా నియమించింది. సిట్ డీఐజీగా విశాఖ రేంజ్లో పనిచేసిన గోపీనాథ్ జెట్టిని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నియమించారు. సిట్ ఎస్పీగా కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజును నియమించారు. మరి కాసేపట్లో ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయనుంది. సిట్ టీమ్‌లో మరి కొంతమంది డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలను ఏపీ ప్రభుత్వం నియమించనుంది