– నా చిరకాల కల నెరవేరింది
– 75 కోట్ల రూపాయలతో బుజబుజ నెల్లూరు, కనుపర్తిపాడు జంక్షన్ ల వద్ద వంతెనలు
– నెలలో సర్వీస్ రోడ్లు పూర్తి…
– ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
నెల్లూరు, మహానాడు: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని బుజబుజ నెల్లూరు నేషనల్ హైవే వద్ద 75 కోట్ల రూపాయల నిధులతో నిర్మిస్తున్న బైపాస్ ఫ్లై ఓవర్ బ్రిడ్జీలు, సర్వీస్ రోడ్లు పనులను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి ఏమన్నారంటే… నా చిరకాల కల నెరవేరబోతోంది. నేను 2014లో మొట్టమొదటిసారిగా నెల్లూరు రూరల్ ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యే గా గెలిచిన తరువాత, నెల్లూరు నేషనల్ హైవే లో బుజబుజ నెల్లూరు, కనుపర్తిపాడు, మెడికవర్ హాస్పిటల్ జంక్షన్ ల వద్ద ఫ్లైఓవర్ లు లేదా అండర్ పాస్ ల నిర్మాణాలు అత్యంత అవసరమని అప్పట్లోనే ప్రయత్నాలు ప్రారంభించాను.
ఆ నాటి కేంద్ర మంత్రి ముప్పవరపు వెంకయ్య నాయుడు సహాయ సహకారాలతో అడుగులు పడ్డాయి. రెండోసారి ఎమ్మెల్యే గా గెలిచాక పనులు కార్యరూపం దాల్చాయి. దురదృష్టవశాత్తు మెడికవర్ వద్ద మంజూరు కాలేదు. బుజబుజ నెల్లూరు, కనుపర్తిపాడు జంక్షన్ ల వద్ద 75 కోట్లతో ఫ్లైఓవర్, సర్వీస్ రోడ్లు మంజూరు అయ్యాయి. గత ప్రభుత్వంలో ఈ పనులు మంజూరైనా, నేను అధికార పార్టీ నుండి దూరంగా జరిగాక ఈ పనులు వేగవంతంగా సాగలేదు, ఆగిపోయాయి. రాష్ట్ర ప్రజలందరి ఆశీస్సులతో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా, నేను నెల్లూరు రూరల్ ప్రజల ఆశీస్సులతో మూడోసారి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గా గెలిచాను. చంద్రబాబు నాయుడు, మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, నెల్లూరు పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక చొరవతో యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి.
మరో నెలలో సర్వీస్ రోడ్లు పూర్తి అవుతాయి. బుజబుజ నెల్లూరు, కనుపర్తిపాడు జంక్షన్ ల వద్ద ఒక్క సంవత్సరంలో ఫ్లైఓవర్ / అండర్ పాస్ ల పనులు పూర్తి అయ్యి ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. అలాగే మెడికవర్, సుందరయ్య కాలనీ, ఎన్టీఆర్ నగర్ రాజుపాళెం జంక్షన్ ల వద్ద కూడా ఫ్లైఓవర్ / అండర్ పాస్ ల నిర్మాణం కోసం స్థానిక శానసభ్యుడిగా నా శక్తివంచన లేకుండా కృషి చేస్తా. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జాతీయ రహదారుల అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేస్తున్నందుకు ఎన్‌హెచ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏం.కె. చౌదరికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ, నెల్లూరు జిల్లా ప్రజల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.