– ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ కి వినతి
అమరావతి, మహానాడు: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ పలువురు ఉద్యోగులు శనివారం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ నిషాంత్ కుమార్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తాము మద్యం దుకాణాల్లో ఐదేళ్లుగా పని చేస్తున్నామని కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ను దృష్టిలో ఉంచుకుని ప్రాణాలకు తెగించి ఉద్యోగాలు చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన మద్యం పాలసీ ద్వారా 12 వేల మంది ఉద్యోగాలు అర్ధాంతరంగా కోల్పోయి రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
నూతన మద్యం పాలసీ విధానం పై మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవని తమను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పించాలని కోరారు. తమలో చాలా మందికి ప్రభుత్వ ఉద్యోగం పొందే వయస్సు అర్హత కోల్పోయామని, ఈ దృష్ట్యా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుని తమకి న్యాయం చేయాలని కోరారు. దీనిపై నిషాంత కుమార్ స్పందిస్తూ తమ విజ్ఞప్తిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సత్వర న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాశాల రామచంద్రరావు, జాతిన్, స్వామీ, పవన్, చరణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.