ధాన్యం కొనుగోలులో రైతులకు సమస్యలు ఉత్పన్నం కాకూడదు…

– తేమశాతం, గోనేసంచుల విషయంలో రైతుకు ఎటువంటి ఇబ్బంది కలుగకూడదు..
– ఖరీఫ్ ధాన్యం కొనుగోలుపై అధికారులతో సమీక్షించిన మంత్రి కొలుసు పార్ధసారధి

ఏలూరు: ఖరీఫ్ ధాన్యం కొనుగోలులో రైతులకు ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకూడదని రాష్ట్ర గృహనిర్మాణశాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి స్పష్టం చేశారు.

శుక్రవారం స్ధానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో ఖరీఫ్ ధాన్యం కొనుగోలుపై రైస్ మిల్లర్లు, ట్రాన్స్ పోర్టర్లు, పౌర సరఫరాల అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ పి. ధాత్రిరెడ్డితో కలిసి రాష్ట్ర గృహనిర్మాణశాఖ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి సమీక్షించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రైతులు ఎట్టి పరిస్ధితుల్లోను రైస్ మిల్లును సంప్రదించవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలులో తేమ శాతం విషయంలో ఒకేసారి తేమ కొలిచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు ఆయా రైతు సేవాకేంద్రాలవద్ద టెక్నికల్ అసిస్టెంట్ తో పాటు మిల్లర్ల అసోషియేషన్ తరపున ఒకరిని ఉంచాలన్నారు.

ధాన్యం రవాణాచేసే ప్రతి లారీలో ఖచ్చితంగా టార్పాలిన్ అందుబాటులో ఉంచాలన్నారు. గోనేసంచుల సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మిల్లర్ల దగ్గరకు రైతులు వెళ్లే అవకాశం కానీ, బ్రతిమలాడే పరిస్ధితి కానీ రాకూడదని ఆయన స్పష్టం చేశారు.

రైతు గోనెసంచులు గానీ, హమాలీలు గానీ, రవాణా కానీ ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వ లెక్కలప్రకారం ఆ పైకం నేరుగా రైతు ఖాతాలోకి ధాన్యం సొమ్ముతో సహా చెల్లించబడుతుందనే విషయాన్ని రైతులకు తెలియజేయాలన్నారు.