– నాగార్జున కుటుంబంపై మంత్రి సురేఖ వ్యాఖ్యల దుమారం
– ఆమెపై నాగార్జున క్రిమినల్, పరువునష్టం కేసు
హైదరాబాద్: ఎన్ కన్వెన్షన్ సెంటర్ అధినేత అక్కినేని నాగార్జునపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. హైటెక్ సిటీకి సమీపంలో ఉన్న తమ్మిడికుంట చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించిన నాగార్జునపై, కేసు నమోదు చేయాలని ‘జనం కోసం’ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును లీగల్ ఒపీనియన్ కు పంపించిన మాదాపూర్ పోలీసులు, నాగార్జునపై కేసు నమోదు చేశారు.
మాదాపూర్ తుమ్మిడికుంట చెరువులో 3 ఎకరాల భూమిని కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ ను నాగార్జున కట్టారనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇటీవల ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా కూల్చేసింది. మరోవైపు, నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన నేపథ్యంలో.. ఆమెపై నాగార్జున క్రిమినల్, పరువునష్టం కేసు వేశారు. ఆ ఘటన జరిగిన వెంటనే పోలీసులు నాగార్జునపై కేసు నమోదు చేయడం బట్టి..రేవంత్ ప్రభుత్వం మంత్రి కొండా సురేఖకు మద్దతుగా నిలిచినట్లు స్పష్టమవుతోంది.