‘హిందూ బోర్డు’ కోసం గతంలోనే గళం విప్పా!

– కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ధార్మిక సంస్థ లేదు
– పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలకు కొనసాగింపుగా టీడీపీ, జనసేన ఎంపీలంతా గళాన్ని వినిపించాలి
– సుప్రీం కోర్టులో విజయ్ పాల్ తరఫున అభిషేక్ మను సింఘ్వి వాదనలు
– ఒక అప్పియరెన్స్ కు రూ. 30 లక్షలఫీజు తీసుకున్న న్యాయవాది మను సింఘ్వి
– నేనొక రాజకీయ నాయకుడిని కావడం వల్లే నిబంధనల ప్రకారం కేసు విచారణ… అందుకే ఆలస్యం
– ఉండి శాసన సభ్యుడు రఘురామకృష్ణంరాజు

ఉండి, మహానాడు: హిందూ బోర్డు ఏర్పాటు చేయాలని మూడున్నర ఏళ్ల క్రితమే పార్లమెంటులో తాను గళాన్ని వినిపించానని ఉండి శాసన సభ్యుడు రఘురామకృష్ణంరాజు తెలిపారు. సనాతన ధర్మం గురించి తిరుపతి వేదికగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ భక్తావేశంతో అద్భుతంగా ప్రసంగించారని ఆయన కితాబు ఇచ్చారు. ముస్లిం, క్రిస్టియన్ వంటి మైనార్టీల హక్కుల పరిరక్షణ కోసం బోర్డులు ఉన్నట్టుగానే, హిందువుల హక్కుల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ధార్మిక సంస్థ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను సభ దృష్టికి తీసుకువచ్చానన్నారు .ఉండి నియోజకవర్గ కేంద్రంలో రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

హిందువుల హక్కుల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ధార్మిక సంస్థను ఏర్పాటు చేయాలని పార్లమెంటులో పట్టుబట్టినట్టు తెలిపారు. ఇప్పుడు పవన్ కల్యాణ్‌ కూడా ఇదే అంశంపై మాట్లాడారు కాబట్టి, తెలుగుదేశం పార్టీ, జనసేన ఎంపీలంతా కలిసి హిందూ ధార్మిక సంస్థ ఏర్పాటు ఆవశ్యకత గురించి పార్లమెంటులో గట్టిగా తమ గళాన్ని వినిపించాలన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఈ అంశంపై ఇప్పటికే ఉపముఖ్యమంత్రి పవన్ మాట్లాడి ఉండి ఉంటారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్‌ ఒకవైపు తాను సనాతన ధర్మాన్ని పాటిస్తానని పేర్కొంటూనే మరొకవైపు అన్య మతాలను గౌరవిస్తానని చెప్పడం అందరూ స్వాగతించే అంశమని రఘురామకృష్ణంరాజు తెలిపారు.

పవన్ కల్యాణ్‌ ప్రకటనను స్వాగతించాల్సిందే….

నా మతాన్ని ప్రేమిస్తాను… అన్య మతాన్ని గౌరవిస్తానని తిరుపతి వేదికగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ చేసిన ప్రకటనను ప్రతి ఒక్కరూ స్వాగతించాల్సిందేనని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఇదే విషయాన్ని నేను నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో 100 సార్లకు పైగా చెప్పి ఉంటానని పేర్కొన్నారు. సనాతన స్వదేశీ సేన వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఈ మాట చెప్పానన్నారు. సేన ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దేవాలయాలను సందర్శించాలని భావించినప్పటికీ, అప్పుడు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా, నాపై విధించిన అనధికారిక రాష్ట్ర బహిష్కరణ నేపథ్యంలో సందర్శించలేకపోయానని తెలిపారు. అప్పటి నా వాదనకు ఇప్పుడు పవన్ సంప్రదాయ సనాతన వాదనకు పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుందన్నారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూనే నిజమైన హిందువు అయితే తన మతాన్ని ప్రేమించాలని, అన్య మతాలను ద్వేషించకుండా, గౌరవించాలన్నారు.

సుప్రీంకోర్టు తీర్పు అమోఘం…

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు అద్భుతంగా ఉందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ద్విసభ్య ధర్మాసనం ఐదు మంది సభ్యులతో స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేసి, విచారణ చేపట్టాలని నిర్ణయించడం అభినందనీయమన్నారు. శ్రీవారి లడ్డూ లో కల్తీ అనేది ఏ స్థాయిలో జరిగింది, ఎప్పుడు జరిగింది, అసలు జరిగిందా?, లేదా?? అన్న దానిపై స్వతంత్ర కమిటీ విచారణ జరుపుతుందన్నారు. సుప్రీంకోర్టు తీర్పును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా స్వాగతించారని గుర్తు చేశారు.

సుప్రీంకోర్టును ఆశ్రయించిన వారిలో ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తో పాటు ఆయన మిత్రుడు టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి, మరొక పత్రిక సంపాదకుడు ఉన్నారన్నారు. సుబ్బారెడ్డి న్యాయస్థానానికి తన రాజకీయ నేపథ్యం తెలియజేయకుండా, దాచిపెట్టే ప్రయత్నాన్ని చేయగా సాక్షి దినపత్రిక భాషలో చెప్పాలంటే సుప్రీం కోర్టు ఆయనకు అక్షింతలు వేసిందన్నారు. రాజకీయ నాయకులు తమ పూర్తి వివరాలను తెలియజేయకుండా ఇటువంటి వివాదాలను ఎందుకు సృష్టిస్తారని సుప్రీంకోర్టు మందలించిందని పేర్కొన్నారు. లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టు స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇక దానిపై వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు.

భక్తులకు సౌకర్యాలను మెరుగుపరచండి

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించాలని రఘురామ కృష్ణంరాజు కోరారు. గతంలో అద్దె గదుల ధరలను పెంచారన్నారు. అలాగే శ్రీవారికి భక్తులు నిలువు దోపిడీ సమర్పించుకోవడానికి వీలు లేకుండా, కొండపైనే ఉన్న దళారులు భక్తులను దోచేసేవారని నూతన పాలకవర్గం ఏర్పడిన తర్వాత ఈ పరిస్థితిని కట్టడి చేయాలని కోరారు. కాలినడకన కొండకు చేరుకుని భక్తులకు గతంలో 300 రూపాయల టికెట్ ద్వారా నేరుగా దర్శనం కల్పించే వారిని, గత ప్రభుత్వ హయాంలో భక్తులకు ఈ సౌకర్యం లేకుండా చేశారన్నారు.

కరోనా సమయంలో ఎత్తివేసిన ఈ విధానాన్ని తిరిగి ప్రవేశ పెట్టమని భక్తులు కోరితే, చిరుత పులిని సాకుగా చూపెట్టారన్నారు. ప్రజాభీష్టం మేరకు కాలినడకన వచ్చే భక్తులకు నేరుగా శ్రీవారిని దర్శించుకునే సౌకర్యాన్ని కల్పించాలన్నారు. కాలినడకన వచ్చే భక్తులకు నేరుగా దర్శనం కల్పించకపోవడం ఒక విధంగా భక్తులను నిరాశపరచడమే అవుతుందన్నారు. గతంలో ఉన్న విధానాన్ని పునరుద్ధరించి, భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని రఘురామకృష్ణంరాజు కోరారు. భక్తితో ఎవరైనా భగవంతుడిని దర్శించుకునే అవకాశాన్ని కల్పించాలన్నారు. భగవంతుడిని దర్శించుకోవడానికి భక్తులకు ఆలస్యం అయితే వారికి వసతి సౌకర్యం కల్పించి, భగవత్ దర్శనం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.

భగవంతుని దరికి భక్తున్ని చేర్చే ప్రభుత్వం ఇది

గత ప్రభుత్వం భగవంతుడి నుంచి భక్తుడిని దూరం చేస్తే… ఈ ప్రభుత్వం భక్తుడిని భగవంతుని దరికి చేర్చేందుకు చర్యలు తీసుకుంటుందని రఘురామకృష్ణంరాజు తెలిపారు . రాబోయే రోజుల్లో కొత్త పాలకవర్గం ఏర్పడిన తర్వాత భక్తులకు మరిన్ని సౌకర్యాలను కల్పిస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఆ ప్రాంతవాసి కావడంతో , సౌకర్యవంతంగా భగవంతుడి దర్శనాన్ని హిందూ భక్తులు చేసుకునే చర్యలను చేపడుతారన్న పూర్తి విశ్వాసం ఉందన్నారు. తిరుమల కొండపై భక్తులను దొంగలను దోచుకోనివ్వరాదని, అలాగే దళారులు కూడా దోచుకోవద్దని హితవు పలికారు. గత ప్రభుత్వ హయాంలో లడ్డూ నాణ్యత పడిపోగా ప్రభుత్వం మారిన వెంటనే నూతన ఈవో, జేఈఓలు వచ్చిన తర్వాత లడ్డూ ప్రసాదం నాణ్యత పెరిగిందని, ఇప్పుడు లడ్డూ కొనుగోలు చేసిప్రసాదాన్ని ఆరగించిన వారు ఎవరైనా చెబుతారన్నారు.

విజయ్ పాల్ ఇప్పటికైనా పోలీసు విచారణకు హాజరు కావలసిందే….

సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం కస్టోడియల్ టార్చర్ కేసులో విజయ్ పాల్ పోలీసు విచారణకు పూర్తిగా సహకరించాల్సిందేనని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఇప్పటికిప్పుడు విజయ్ పాల్ ను అరెస్టు చేయకుండా కోర్టు నుంచి రక్షణ పొందినప్పటికీ, అజ్ఞాతం నుంచి బయటకు వచ్చి పోలీసు విచారణకు హాజరు కావాల్సిందేనన్నారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించి విఫలమైన విజయ్ పాల్, సుప్రీం కోర్టును ఆశ్రయించారని తెలిపారు. సుప్రీం కోర్టులో విజయ్ పాల్ తరఫున ప్రముఖ న్యాయవాదులలో ఒకరైన అభిషేక్ మను సింఘ్వి హాజరు కావడం, మరొక సీనియర్ న్యాయవాదిని కూడా వాదనలను వినిపించడానికి ఆయన నియమించుకోవడం చూసి సుప్రీం కోర్టే ఆశ్చర్యపోయిందన్నారు.

విజయ్ పాల్ ఇంత సంపన్నుడన్న సంగతి తనకు తెలియదని రఘురామ కృష్ణంరాజు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టులో వాదనలను వినిపించడానికి కాంగ్రెస్ ఎంపీ, ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి 30 లక్షల రూపాయల ఫీజు వసూలు చేస్తారని చెప్పారు. ఒకవేళ ఆయన ఆంధ్ర ప్రదేశ్ న్యాయస్థానానికి హాజరై వాదనలను వినిపించాలంటే కోటి రూపాయలు తీసుకుంటారన్నారు. అభిషేక్ మను సింఘ్వి, ముకుల్ రోహత్గి వంటి ప్రముఖ న్యాయవాదులను సాధారణ వ్యక్తులు ఎవరు తమ తరఫున వాదనలను వినిపించడానికి నియమించుకోలేరన్నారు.

కేవలం పారిశ్రామికవేత్తలు మాత్రమే వీరిని హైర్ చేసుకుంటారని చెప్పారు. అటువంటిది ఎస్పీ స్థాయి కంటే తక్కువ స్థాయి కలిగిన ఒక రిటైర్డ్ పోలీసు అధికారి నియమించుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. అభిషేక్ మను సింఘ్వి కి ఫీజు జగన్మోహన్ రెడ్డి చెల్లించి ఉంటాడన్న రఘురామకృష్ణంరాజు, ఒకవేళ నన్ను రక్షించకపోతే మీరంతా అడ్డంగా దొరికిపోతారని విజయ్ పాల్ బెదిరించి ఉంటారన్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి స్వయంగా తానే ఫీజు చెల్లించి ఉంటారని, లేకపోతే ఇతరుల చేత ఇప్పించి ఉంటారని అన్నారు. లేకపోతే విజయ్ పాల్ తరఫున అభిషేక్ మను సింఘ్వి ఫ్రీగా వాదనలను వినిపించారని, కనీసం కలవడానికి కూడా టైం ఇవ్వరని తెలిపారు. తెర వెనుక ఉండి అన్నీ నడిపిస్తున్న పీవీ సునీల్ కుమార్, ఏ3 జగన్మోహన్ రెడ్డి లే అభిషేక్ మను సింఘ్వికి డబ్బులు చెల్లించి ఉంటారన్నారు.

ఇన్నాళ్లు దాగుడుమూతలు ఆడాం… ఇక వచ్చేయ్…అంటారేమో?

ఒక రిటైర్డ్ పోలీస్ అధికారి మూడు నెలలుగా తప్పించుకొని తిరుగుతున్నప్పటికీ, అతడ్ని పట్టుకోలేని పోలీసు డిపార్టుమెంటును చూస్తే సిగ్గేస్తోందని రఘురామ కృష్ణంరాజు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో చెడిపోయిన పోలీసు శాఖ ఇంకా బాగుపడలేదన్నారు. ఒక పోలీసు అధికారి అజ్ఞాతంలో ఉంటూ, అన్ని కోర్టులు తిరుగుతున్నప్పటికీ, అతడు దొరకడం లేదని పేర్కొనడం సిగ్గుచేటన్నారు. ఇక ఇప్పుడు విజయ్ పాల్ ను విచారణకు పిలుస్తారేమోనని అనుకుంటున్నట్టు రఘురామకృష్ణం రాజు తెలిపారు.

ఇన్నాళ్లు దాగుడుమూతలాట ఆడాం… ఇక చాలు వచ్చేయ్ అని అంటారేమోనని ఆయన ఎద్దేవా చేశారు . అయినా ఈ కేసు నుంచి ఎవరు తప్పించుకోలేరని రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. ఆధారాలన్నీ చాలా క్లియర్ గా ఉన్నాయని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి కాస్తా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టినందుకు విజయ్ పాల్ పూర్తి నిజాలను చెప్పడానికి కాసింత టైం పట్టవచ్చునని అన్నారు. ఈ కేసులో విజయ్ పాల్, పీవీ సునీల్ కుమార్, సీతారామాంజనేయులు పాత్ర కచ్చితంగా బయటకు వస్తుందన్నారు.

ఏ తప్పు చేయకపోతే ముందస్తు బెయిలు కోసం ప్రయత్నం ఎందుకు?

ఒకవేళ ఏ తప్పు చేయకపోతే విజయ్ పాల్ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. అరెస్టు చేస్తారన్న భయంతోనే విజయ్ పాల్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారన్నారు. వీరి చరిత్ర చూసి హైకోర్టు పని చూసుకోమ్మందని, దానితో సుప్రీంకోర్టును ఆశ్రయించారన్నారు. సిన్సియర్ గా ఉద్యోగం చేసిన ఒక పోలీస్ అధికారికి న్యాయవాదికి చెల్లించడానికి 40 లక్షల రూపాయలు ఎక్కడ నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఒక్క న్యాయవాదినే కాకుండా ఇద్దరు సీనియర్ న్యాయవాదులను నియమించుకోవడం చూసి సుప్రీం కోర్టు ఆశ్చర్యపోయిందన్నారు. గూగుల్ టేక్ అవుట్ ఆధారాలు ఆరు నెలల కంటే ఎక్కువ ఉండవని, ఒకసారి ఇచ్చిన వైద్య నివేదిక మార్చి ఇస్తే వైద్యులుగా సర్టిఫికెట్లు రద్దు అవుతాయని పీవీ సునీల్ కుమార్ బెదిరింపులకు పాల్పడుతూ వేషాలు వేస్తున్నారని రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు.

విజయ్ పాల్ ను విచారణలో భాగంగా అరెస్టు చేయడానికి మళ్లీ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే, అప్పుడు జగన్మోహన్ రెడ్డి దేశంలోనే ముగ్గురు ప్రముఖ న్యాయవాదులను నియమిస్తారేమోనని రఘురామ కృష్ణంరాజు అనుమానాన్ని వ్యక్తం చేశారు. విజయ్ పాల్ దాఖలు చేసిన పిటీషన్ లో నేను కూడా ఇంప్లిడ్ కావచ్చు. కానీ ఇది క్లియర్ కేసు. ఇందులో ఇంప్లిడ్ కావలసిన అవసరమే లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు పట్ల చిత్తశుద్ధితో ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం, సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రాను ఈ కేసులో వాదనలను వినిపించడానికి నియమించింది.. అయితే కాదంబరి జత్వానీకి జరిగినంత సత్వర న్యాయం నాకు జరగకపోవచ్చు. కాసింత ఆలస్యం అయినప్పటికీ, ఈ కేసులో నాకు న్యాయం జరుగుతుందన్న పరిపూర్ణ విశ్వాసం ఉంది. నేనొక రాజకీయ నాయకుడిని కాబట్టే అన్నీ నిబంధనల ప్రకారమే చేస్తున్నారు. ఈ విషయాన్ని నేను అర్థం చేసుకున్నాను.. నా అభిమానులు కూడా అర్థం చేసుకోవాలని కోరుతున్నానని రఘురామకృష్ణంరాజు తెలిపారు.

పవన్ కల్యాణ్‌ మాటల్లో తప్పేమీ లేదు

తిరుపతి వేదికగా జరిగిన సభలో పవన్ కల్యాణ్‌ మాట్లాడిన మాటల్లో ఎటువంటి తప్పు లేదని రఘురామకృష్ణం రాజు ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల క్రైస్తవ మతాన్ని ఆచరిస్తుంది…ఇతర మతాలను గౌరవిస్తుంది. కానీ ఈ విషయాన్ని ఆమె ఎక్కడా నేరుగా చెప్పలేదన్నారు. పవన్ కల్యాణ్‌ తన మనసులో ఉన్న మాట బాహాటంగానే చెప్పారని పేర్కొన్నారు. రాజకీయాలలో ఉన్నవారు తన విశ్వాసం ఇదని బాహాటంగా ఎక్కడా చెప్పరన్నారు. ఎందుకంటే ఆ విశ్వాసం లేని వారు తమకు ఓట్లు వేయరనే భయంతో, చెప్పకుండా ఉంటారన్నారు. కానీ పవన్ కల్యాణ్‌ కు ఆ భయం లేదని, రాజకీయాలకతీతంగా మాట్లాడిన పవన్ ను అభినందిస్తున్నట్టు రఘురామ కృష్ణంరాజు తెలిపారు. తన మతాన్ని ప్రేమిస్తానని, అన్య మతాలను గౌరవిస్తానని చెప్పారని పేర్కొన్న ఆయన, పవన్ భార్య అన్యమతస్తురాలని గుర్తు చేశారు. మనది లౌకిక దేశమని, మతసామరస్యం ఉండాలన్నారు.

హిందూమతమే సనాతన ధర్మం

సనాతన ధర్మం అంటే ఏమిటని పవన్‌ కల్యాణ్‌ ప్రసంగాన్ని విన్న అనేకమంది తలలను గోక్కున్నారని , హిందూమతమే సనాతన ధర్మం అని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. సనాతన ధర్మం అంటే శాశ్వతమైనదని పేర్కొన్నారు. సనాతన అనే పదం సంస్కృత పదమని తెలిపారు. క్రైస్తవ మతం 2000 సంవత్సరాల క్రితం ఏర్పడితే, ఇస్లాం మతం దాని తర్వాత ఏర్పడిందన్నారు. క్రైస్తవ మతంలో జీసస్ ను మాత్రమే దేవుడుగా అంగీకరిస్తూ ఆయననే ప్రార్థించాలని పేర్కొంటారని, ఇక ఇస్లాం మతం గురించి మహమ్మద్ ప్రవక్త బోధించాడని తెలిపారు. హిందూ మతం ఏ ఒక్క వ్యక్తి నిర్దేశించిన మతం కాదని, హిందూ మతం అంటే ఒక జీవన విధానం అని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

సమాజంలోని మనుషులంతా ఆనందంగా జీవించడానికి ఏర్పాటు చేసుకున్న విధివిధానాల సమాహారమే సనాతన ధర్మం అని పేర్కొన్నారు. తరతరాలుగా, యుగయుగాలుగా పదివేల సంవత్సరాల పూర్వం నుంచి ఈ సనాతన ధర్మాన్ని ప్రజలు ఆచరిస్తున్నారన్నారు. దాన్ని చరిత్ర అని కొంతమంది అంటే, మరి కొంతమంది పురాణం, ఇతిహాసాలు అంటుంటారని తెలిపారు. సనాతన ధర్మానికి చారిత్రక ఆధారాలు ఉన్నాయన్న ఆయన, మనుషులంతా ఒక్కటేనని అందరూ బతకాలి కాబట్టి కులాలు ఏర్పడ్డాయన్నారు. ఎందులోనైనా వెర్రి తలలు ఉన్నట్లే, కులం వల్ల కొంతమందికి జరిగిన అన్యాయాన్ని అంబేద్కర్ అనే మహానుభావుడు రిజర్వేషన్ల ద్వారా సరి చేసే ప్రయత్నం చేశారన్నారు.

పునర్జన్మపై నమ్మకం ఉండేది హిందూ మతంలోనే…

పునర్జన్మ పై నమ్మకం ఉండేది ఒక హిందూ మతంలోనేనని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. అన్య మతాలలో పునర్జన్మ పై నమ్మకం ఉండదని పేర్కొన్నారు. పునర్జన్మ, కర్మ సిద్ధాంతం అనేది కేవలం ఒక హిందూ మతంలోనే ఉంటుందన్నారు. క్రైస్తవ మతంలో ముస్లిం మతంలో పునర్జన్మ ప్రస్తావన లేదని పేర్కొన్నారు. హిందూమతంలో మాత్రం చచ్చిపోయిన తర్వాత కూడా మళ్లీ పుడతామని, ఇప్పుడు చేసిన తప్పులకు అప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోవలసిన పరిస్థితి నెలకొంటుందని నమ్ముతారన్నారు. సనాతన ధర్మాన్ని ఆచరించేవారు తప్పు చేయడానికి వెనుకాడుతారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. హిందువులు అంటే సింధు పరివాహక ప్రాంతం లో నివసించి ఇండో సివిలైజేషన్ తర్వాత హిందువులుగా గుర్తింపు పొందారన్నారు. దానికి ముందు మనం ఆచరించింది, ఇప్పుడు ఆచరిస్తున్నది కూడా సనాతన ధర్మమేనని తెలిపారు.

సైన్స్ ను ఏ ఒక్కరు ఎలాగైతే కనిపెట్టలేదో, అలాగే హిందూ మతం గురించి ఏ ఒక్కరు చెప్పలేదు. సైన్సును అనేకమంది కనిపెట్టినట్లుగానే, హిందూ ధర్మం గురించి అనేకమంది చెప్పారన్నారు. అన్య మతాల గురించి ఒకే వ్యక్తి చెబితే ఇతరులు ఆచరించారని, కానీ హిందూ మతం అనేది ఎంతోమందికి జ్ఞానులు చెప్పిన ఆదర్శాల ఆధారంగా ఆచరిస్తున్నదే సనాతన ధర్మమని పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారని గుర్తు చేశారు. సనాతన ధర్మానికి భగవద్గీత ఒక గైడ్ వంటిదని పేర్కొన్న రఘురామకృష్ణంరాజు, భగవద్గీతలో భగవంతుడైన శ్రీకృష్ణుడు తప్పు చేయకు, నీ వీధిని నువ్వు నిర్వర్తించు అని చెప్పారని గుర్తు చేశాడు…. భగవద్గీత గురించి మాట్లాడాలంటే సమయం సరిపోదని ఆయన అన్నారు.