– జనసేన, బీజేపీ నాయకులతో కలిసి ప్రారంభించిన శాప్ చైర్మన్ రవి నాయుడు
– రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొన్న 14 పురుషులు, 14 మహిళ జట్లు
– ప్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో 12వ తేదీ వరకు కబడ్డీ లీగ్
– విజేతలకు రూ. లక్ష, రూ.75 వేలు, 50 వేలు నగదు బహుమతులు
– పురుషులు, మహిళలకు వేర్వేరుగా బహుమతులు
– పెద్ద ఎత్తున హాజరైన టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు, క్రీడాకారులు
మంగళగిరి, మహానాడు: విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సహకారంతో మంగళగిరి పట్టణంలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి పురుషులు, మహిళల కబడ్డీ పోటీలను శాప్ చైర్మన్ రవి నాయుడు.. జనసేన నియోజకవర్గ ఇంఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి, గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావుతో కలిసి బుధవారం ప్రారంభించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. క్రీడాకారులను పరిచయం చేసుకొని కొంత సేపు కబడ్డీ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. క్రీడాకారులందరూ క్రీడా స్పూర్తిని కలిగి అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించాలని ఆకాంక్షించాచి, శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా రవి నాయుడు మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ సహకారంతో ఫ్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో నాలుగు రోజుల పాటు నిర్వహించే పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 14 పురుషుల జట్లు, 14 మహిళ జట్లు పాల్గొంటున్నట్లు తెలిపారు.
నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున క్రీడాపోటీలు నిర్వహిస్తున్న మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో మంత్రి నారా లోకేష్ అనేక క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మంత్రి నారా లోకేష్ సహకారంతో రానున్న ఐదేళ్లలో క్రీడాకారులను, కోచ్‌లను ప్రోత్సహించి ఏపీని క్రీడల్లో అగ్రస్థానంలో నిలబెడతామన్నారు. పెండింగ్ లో ఉన్న స్టేడియంలను పూర్తి చేస్తామని చెప్పారు. త్వరలో స్పోర్ట్స్ పాలసీ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఏపీలో అంతర్జాతీయ క్రీడలను నిర్వహించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం దృఢ సంకల్పంతో ఉన్నారని అన్నారు.
వైసీపీ ప్రభుత్వం యువత కోసం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసిందని విమర్శించారు. ఐదేళ్లుగా క్రీడా రంగాన్ని భ్రష్టు పట్టించిందని ఆగ్రహాం వ్యక్తం చేశారు. కీడాకారులను ప్రోత్సహించకపోగా క్రీడాకారులు అనేక ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. 2014-2019 మధ్య టీడీపీ ప్రభుత్వం 90 శాతం పూర్తి చేసిన స్టేడియంలను తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వాటిని పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో కబడ్డీ పోటీలకు ఈవెంట్ స్పాన్సర్ మురళీకృష్ణ యార్లగడ్డ (మార్కోరోస్) కాగా పోటీలలో గెలుపొందిన పురుషుల జట్లకు ప్రథమ బహుమతి కింద లక్ష రూపాయలను జవ్వాది కిరణ్ చంద్, ద్వితీయ బహుమతి కింద రూ 75 వేలను నందం అబద్దయ్య, తృతీయ బహుమతి కింద రూ. 50 వేలు నగదును గద్దె శ్రీనివాస్, జంపాల సుబ్బారావు నగదు బహుమతులు అందిస్తున్నట్టు తెలిపారు. అలాగే మహిళల జట్లకు ప్రథమ బహుమతి కింద లక్ష రూపాయలను ఆవల రవికిరణ్, ద్వితీయ బహుమతి కింద రూ 75 వేలను మంగళగిరి రోటరి క్లబ్ అధ్యక్షుడు గాజుల శ్రీనివాసరావు, తృతీయ బహుమతి కింద రూ. 50 వేలు నగదును గుడూరు వెంకట్రావు అందజేస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.