పోలీసు వ్యవస్థ పై జనంలో నమ్మకం ఉంటుందా?

– ఏమి చేయలేకపోతే ఈ పోలీసు వ్యవస్థ పై సాధారణ ప్రజలకు నమ్మకం ఉంటుందా?
– విజయ్ పాల్ ను తక్షణమే అరెస్టు చేసి విచారణకు సహకరించడం లేదని సుప్రీంకోర్టుకు నివేదించాలి
– ఈ కేసు లోని పెద్ద తలకాయలు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా ?, లేకపోతే విజయ్ పాల్ పేర్లు చెప్పే వరకు వేచి చూస్తారా?
– ఎన్నో అరాచకాలను చేసిన సునీల్ కుమార్ అండ్ గ్యాంగ్
– ఒక పారిశ్రామికవేత్తను హింసించి డబ్బులను వసూలు చేసింది నిజం కాదా?
– గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మాజీ సూపరిండెంట్ ప్రభావతి కొడుకుకు అవుట్ ఆఫ్ ది వే లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాన్ని ఇవ్వలేదా?
– విజయ్ పాల్ కు ఏడాది పొడిగింపు ఎందుకు??
– ఉండి నియోజకవర్గ అభివృద్ధి కోసం రాజ్యసభ మాజీ సభ్యులు బీద మస్తాన్ రావు కోటి రూపాయల విరాళం
– ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజు

ఉండి: నన్ను లాకప్ లో చిత్రహింసలకు గురిచేసిన కేసులో ప్రధాన నిందితుడైన రిటైర్డ్ పోలీస్ అధికారి విజయ్ పాల్ సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా విచారణకు సహకరించ నందుకు తక్షణమే అతడిని అరెస్టు చేయాలని ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణం రాజు సూచించారు. విజయ్ పాల్ ను పోలీసులు అరెస్టు చేసి విచారణకు సహకరించడం లేదని సుప్రీంకోర్టులో మెమో దాఖలు చేయాలన్నారు.

సుప్రీంకోర్టు కల్పించిన రక్షణను విజయ్ పాల్ దుర్వినియోగం చేశాడని, కోర్టు ఆదేశాలను ధిక్కరించిన వ్యక్తిని తక్షణమే అరెస్టు చేసి కోర్టులో మెమో దాఖలు చేయవచ్చునని పలువురు న్యాయ కోవిదులు చెప్పారన్నారు. ఉండి నియోజకవర్గ కేంద్రంలో రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… విజయ్ పాల్ ను విచారించే సమయంలో పోలీసులు వీడియో రికార్డు చేసి ఉంటారని, విచారణకు ఆయన ఏమాత్రం సహకరించడం లేదన్న ఆధారాలను సుప్రీంకోర్టు కు నివేదించాలన్నారు.

లాకప్ లో నన్ను చిత్రహింసలకు గురిచేసిన కేసులో ప్రధాన నిందితుడైన విజయ్ పాల్ ఎట్టకేలకు పోలీసుల ముందు విచారణకు హాజరయ్యాడన్నారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళితే విజయ్ పాల్ ను పని చూసుకోమ్మంటే… సుప్రీంకోర్టును ఆశ్రయించగా అరెస్టు చేయవద్దని రక్షణ కల్పించిందన్నారు. పోలీసు విచారణకు సహకరించాలని విజయ్ పాల్ ను ఆదేశించిందని గుర్తు చేశారు.

మూడు నెలల పాటు తప్పించుకొని తిరిగిన విజయ్ పాల్ ను పోలీసులకు పట్టుకోవడం చేతకాక పోవడంతో… జాలేసి అతడే విచారణకు రమ్మంటారా? ఏంటి? అని అడిగి శుక్రవారం సాయంత్రం మూడు గంటలకు విచారణకు హాజరయ్యాడన్నారు. మూడు గంటల పాటు కొనసాగిన పోలీసు విచారణ కు విజయ్ పాల్ ఏమాత్రం సహకరించలేదని ఈరోజు పత్రిక కథనాల ద్వారా స్పష్టమవుతుంది.

నాకేమీ గుర్తులేదు. నాకు వయసు అయిపోయింది. వయసయి పోతేనే రిటైర్ అయిపోతారు కదా? అంటూ విచారణ అధికారినే ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది. ఎక్కడకెళ్ళావు అని విచారణ అధికారి ప్రశ్నించగా అది నా వ్యక్తిగతం… ఎక్కడకు వెళితే మీకేంటి? అని ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది. సెల్ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశావని ప్రశ్నించగా, రిటైర్ అయినటువంటి వ్యక్తికి సెల్ ఫోన్ తో పనేంటి అని ఎదురు ప్రశ్నించినట్టుగా తెలిసింది.

లాకప్ బయట సెంట్రీలుగా విధులు నిర్వహించిన పోలీసు సిబ్బంది ఇచ్చిన వాంగ్మూలం గురించి ప్రస్తావించగా, తనకేమీ తెలియదని … అంతా మరిచిపోయానని చెప్పినట్లుగా తెలిసింది. విజయ్ పాల్ కు సడెన్ గా మతిమరుపు వ్యాధి వచ్చినట్టుగా ఉందని రఘురామకృష్ణం రాజు అన్నారు. ఒక కేసులో ఇన్వెస్టిగేషన్ అధికారి అయిన విజయ్ పాల్ ఇప్పుడు సంబంధం లేనట్లుగా, ఏమీ జరగనట్లుగా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది.

ఈ కేసులో ఇతరులు ఇచ్చిన సాక్షాలను చూపెట్టినప్పుడు నాకసలు ఏమీ గుర్తులేదనడం విడ్డూరంగా ఉంది. ఏమైనా చెప్పాలనుకుంటే కోర్టులోనే చెబుతాను. మీకు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదని ఒక రిటైర్డ్ పోలీస్ అధికారి, డర్టీ క్రిమినల్ కంటే హీనంగా మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది. మతిమరుపు ఉన్నట్టు నటిస్తున్న విజయ్ పాల్ ను వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకోవాలి. పోలీసు విచారణకు సహకరించడం లేదని, సుప్రీంకోర్టుకు నివేదించాలి. నేను గజిని… నాకేమీ గుర్తులేదు, తెలియదని మాట్లాడడం నీచాతి నీచమని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు.

గతంలో ఉన్న వారు ఎఫెక్టివ్ పోలీసులు… ఇప్పుడున్న పోలీసులు డిఫెక్టివ్ పోలీసులా?

లాకప్ లో నన్ను చిత్రహింసలకు గురిచేసిన కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత కూడా మూడు నెలల పాటు తప్పించుకొని తిరిగిన విజయ్ పాల్ ను కనిపెట్టి అదుపులోకి తీసుకోలేకపోయినా, ప్రస్తుత పోలీసులు డిఫెక్టివ్ పోలీసులు… గతంలో ఎక్కడ ఉన్నా మమ్మల్ని గుర్తించి అరెస్టు చేసిన పోలీసులు ఎఫెక్టివ్ పోలీసులా అంటూ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు.

మూడు నెలలు విజయ్ పాల్ తప్పించుకొని తిరిగిన అతడిని అరెస్టు చేయకపోవడం పరిశీలిస్తే, పోలీసుల సత్తా ఏమిటో తెలుస్తోందన్నారు. కాదంబరి జత్వాని కేసులో ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని అప్రూవర్ గా మారిపోయి, కేసు నుంచి బయటపడ్డాడు. అలాగే లాకప్ చిత్రహింసల కేసులో విజయ్ పాల్ కూడా అప్రూవర్ గా మారితే ఈ కేసు నుంచి బయటపడతాడు. సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాన్ని చూపెడితే గుర్తులేదని విజయ్ పాల్ డ్రామాలాడడం ఎవర్ని కాపాడడం కోసమని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు.

ఈ డ్రామాలు క్లైమాక్స్ కు వచ్చాయని అనుకుంటున్నానని తెలిపారు. ఈ కేసులో ఉన్న ఇద్దరు పెద్ద తలకాయలు ముందుగానే బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయిస్తారేమో చూడాలన్నారు. లేకపోతే విజయ్ పాల్ విచారణలో తమ పేర్లు చెప్పే వరకు వేచి చూస్తారేమోనని అన్నారు. విజయ్ పాల్ పై తీవ్రమైన ఒత్తిడి ఉందన్న రఘురామకృష్ణం రాజు, లాకప్ లో నన్ను చితక్కొట్టారు. చితక్కొట్టామని చెప్పడానికి ఏంటి ఇబ్బంది అని ప్రశ్నించారు. తప్పని అప్పుడు తెలియదా? అంటూ నిలదీశారు.

అత్యంత నీచంగా, క్రూరంగా, కిరాతకంగా, ఆటవికంగా, అమానుషంగా వ్యవహరించారన్నది నిజం. ఆధారాలన్నీ ఉన్నాయి. లాకప్ లో నన్ను చిత్రహింసలకు గురిచేసిన గదికి RRR గది అని పేరు పెట్టి, ఇతరులను సునీల్ కుమార్ అండ్ గ్యాంగ్ బెదిరించారు. ఒక పారిశ్రామికవేత్తకు ఫోన్ చేసి నీకు కూడా RRR ట్రీట్మెంట్ కావాలా? కానీ అడగడమే కాదు… అడిగినంత డబ్బులు ఇవ్వనందుకు, అతడిని చిత్రహింసలకు గురి చేసినట్లు తెలిసిందన్నారు.

టీవీ5 డిబేట్ కార్యక్రమంలో జర్నలిస్టు మూర్తి ఆ పారిశ్రామికవేత్త పేరు చెప్పకపోయినప్పటికీ, అందరూ నాలాగే పైకి చెప్పుకోలేరని, కొంతమంది అవమానంగా భావిస్తూ ఉంటారన్నారు. సునీల్ కుమార్, విజయ్ పాల్ గ్యాంగ్ లో కొంతమంది ఏజెంట్లతో పాటు ఇద్దరు వైద్యులు ఉన్నారన్నారు. అవసరమైనప్పుడు ఈ వైద్యులు దొంగ వైద్య నివేదికలను ఇస్తారని తెలిపారు. డాక్టర్ చంద్రశేఖర్, ఇంకొక వైద్యుడు ఉన్నారన్న రఘురామకృష్ణంరాజు, ఇటువంటి తప్పుడు పనులు చేసినందుకే అవుట్ ఆఫ్ ది వేలో గుంటూరు ప్రభుత్వం మాజీ సూపరిండెంట్ ప్రభావతి కుమారుడికి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం ఇచ్చారని తెలిపారు.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రభావతి కుమారుడికి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం ఇచ్చారా? లేదా? అన్నదానిపై విచారణ జరిపించాలన్నారు. అలాగే విజయ్ పాల్ కు ఒక ఏడాది పొడగింపు ఇచ్చారని వీటన్నింటిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని రఘురామకృష్ణంరాజు కోరారు. ప్రభుత్వ పరిపాలన వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన వారిని ఉపేక్షించరాదన్నారు.

ఒక ఎంపీ ని లాకప్ లో చిత్రహింసలకు గురిచేసిన కేసులో నాకేమీ గుర్తు లేదని, నేను మర్చిపోయాను అంటే ఈ పోలీసులు ఏమీ చేయకపోతే… పోలీసు వ్యవస్థ పై సాధారణ ప్రజలకు నమ్మకం ఉంటుందా? అని ప్రశ్నించిన రఘురామకృష్ణంరాజు ఉండే అవకాశమే లేదన్నారు .

గతంలో ఎంపీగా ఉన్న నేను ఇప్పుడు శాసన సభ్యుడిగా కొనసాగుతున్నాను. నన్ను అన్యాయంగా లాకప్ లో చిత్రహింసలకు గురి చేసిన వ్యక్తులను శిక్షించకపోతే, ఎవరికైనా న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంటుందా?, ఆ నమ్మకాన్ని పునరుద్ధరించాలనే ప్రయత్నంలో భాగంగానే, రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడగానే పోలీసులకు ఫిర్యాదు చేశాను. ప్రభుత్వంపై కూడా ఒక రకంగా ఒత్తిడి తీసుకువచ్చాను . పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఈ కేసు ను వాదించడానికి ప్రభుత్వం తమ తరపున సీనియర్ న్యాయవాదిని నియమించింది. నేను నా తరఫున న్యాయవాదిని పెట్టుకున్నాను. ఈ సంఘటన ద్వారా తప్పు జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహించరనే స్పష్టమైన సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి. తప్పు జరిగితే పోలీసు వ్యవస్థ పని చేస్తుందన్న నమ్మకం కలిగింది. పోలీసుల చేత గత ప్రభుత్వ హయాంలో తప్పుడు పనులు చేయించారని, పోలీసులు స్వతహాగా పనికిరాని వారు కాదని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

ఈ కేసులో అన్ని సాక్షాధారాలు ఉన్నాయి. మిలటరీ ఆసుపత్రి ఇచ్చిన వైద్య నివేదిక ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పలు సభలు, సమావేశాలలో రఘురామ కృష్ణంరాజును లాకప్ లో చిత్రహింసలకు గురి చేశారని పేర్కొన్నారు. అయినా ఇప్పుడు పోలీసు విచారణలో విజయ్ పాల్ నాకేమీ గుర్తులేదు… అన్నీ మర్చిపోయానంటే ఉపేక్షించరాదు. తప్పక చర్యలు తీసుకోవాలి. మళ్లీ సుప్రీంకోర్టు ఎప్పుడో పిలుస్తుంది. పిలిచినప్పుడు చెబుదాంలే అని కాకుండా, తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు.

విజయ్ పాల్ నా మైండ్ దొబ్బింది అంటే, మిగిలిన సాక్షుల సాక్షాన్ని ప్రామాణికంగా తీసుకొని ఈ కేసులో పోలీసులు ప్రొసీడ్ కావాలి. నువ్వు మర్చిపోయావు చిట్టి.. మతిమరుపు ఉన్నంత మాత్రాన శిక్ష శిక్షే. కేవలం తనని తాను కాపాడుకోవడానికి విజయ్ పాల్ మతిమరుపు నాటకాన్ని ఆడుతున్నాడని రఘురామ కృష్ణంరాజు తెలిపారు .

కాదంబరి జత్వాని కేసులో విశాల్ గున్ని చెప్పినట్లుగానే నిజాలను చెప్పి విజయ్ పాల్ ఈ కేసు నుండి బయట పడుతాడా లేదా చూడాలి. గజినీకి కూడా అప్పుడప్పుడు అన్నీ గుర్తుకు వస్తాయి. పోలీసులు మతిమరుపు వ్యాధిని నయం చేయడానికి విజయ్ పాల్ కు డాబర్ చవన్ ప్రాష్ తినిపించాలని, నిజంగానే బుర్ర దొబ్బితే, ఆ బుర్ర పనిచేయడానికి అవసరమైతే కస్టడీలోకి తీసుకొని సపర్యలను చేయాలన్నారు.

డబ్బులున్నా కోటి రూపాయల విరాళం ఇవ్వడం ఆషామాషీ కాదు

డబ్బులు ఉన్నప్పటికీ కోటి రూపాయల విరాళం ఇవ్వడం అనేది అంతా ఆషామాషీ వ్యవహారం కాదని రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఉండి నియోజకవర్గ అభివృద్ధి కోసం రాజ్యసభ మాజీ సభ్యులు బీద మస్తాన్ రావు కోటి రూపాయల విరాళం ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలో బీద మస్తాన్ రావు కంపెనీకి చెందిన ప్రోడక్ట్ లాంచ్ కోసం ఆయన హాజరై, నియోజకవర్గ పరిధిలో జరిగిన కాలువలు, డ్రైన్లు, పంట కాలువల అభివృద్ధిని పరిశీలించి నియోజకవర్గ అభివృద్ధి కోసం తనవంతుగా కోటి రూపాయల విరాళాన్ని ఇస్తున్నట్లుగా ప్రకటించారని తెలిపారు.

పెద మేరం, భీమవరం సర్కిల్ లో రతన్ టాటా కాంస్య విగ్రహం

పెద మేరం, భీమవరం సర్కిల్లో దిగ్గజ పారిశ్రామికవేత్త, మానవతావాది రతన్ టాటా కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లుగా రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఈ విగ్రహాన్ని మంత్రి నారా లోకేష్ చేతులమీదుగా ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు. నారా లోకేష్ అమెరికా పర్యటనకు ముందే ఏర్పాట్లు పూర్తయితే వెంటనే ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు, ఒకవేళ ఆలస్యమైతే ఆయన అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నారా లోకేష్ కోరిక మేరకు, టిసిఎస్ ద్వారా పదివేల మందికి ఉపాధి కల్పించేందుకు టాటా సంస్థ చర్యలు తీసుకుంటుందని తెలిపారు.