రానున్న నాలుగు రోజులు ఏపీలో భారీ వర్షాలు

– విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా

విజయవాడ, మహానాడు: ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు ఏర్పడడంతో రానున్న నాలుగు రోజులు ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఆదివారం తెలిపారు. ఈ నెల 17 వరకు కోస్తా, రాయలసీమలో భారీవర్షాలు, తీరం వెంబడి 40 నుండి 55 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఈ దృష్ట్యా 24 గంటలు విపత్తు నిర్వహణ శాఖ అప్రమత్తంగా ఉండాలని,  జిల్లా, రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్ లు ఏర్పాటు చేసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలాగే, ఏలూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి, పల్నాడు, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్లకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దు అని సిసోడియా హెచ్చరించారు.