దుర్గమ్మకు మహి రసజ్ఞ నాట్యనీరాజనం

విశాఖపట్నం, మహానాడు: పురుషోత్తపురంలోని శ్రీ విజయ గణపతి ఆధ్యాత్మిక వేదికపై వర్ధమాన కూచిపూడి నృత్య కళాకారిణి చిట్టిమోజు మహి రసజ్ఞ శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా నిర్వహించిన తన నృత్యాభినయంతో ఆహుతులైన భక్తుల్ని పరవశింపజేసింది. అందెల రవళిలు దివ్యనాదం వినవస్తుండగా తన నృత్త, నృత్య ప్రావీణ్యంతో భామాకలాపం… తాండవం అంశాలు నయన మనోహరంగా ప్రదర్శించి వీక్షకుల్ని మెప్పించి ప్రశంసలు అందుకుంది. నాట్యచార్యులు ఆలూరి సోమేశ్వర ప్రసాద్ శిష్యరికంలో రాణిస్తున్న రసజ్ఞ భాగ్యనగరంలో ఇంజనీరింగ్( ద్వితీయ) విద్యార్థి కావడం విశేషం. ఉన్న ఊరు మీద మమకారంతో మాతామహుల ఇంటికి విచ్చేసిన ఆమె దుర్గమ్మకు నృత్య నీరాజనం ఘటించడం ప్రశంసనీయం.