– కూటమి పాలనలో నేటి నుండి ‘పల్లె పండగ’
– టీడీపీ ‘దర్శి’ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
దర్శి, మహానాడు: వైసీపీ విధ్వంస పాలనలో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యమైందని, గడిచిన ఐదేళ్లకాలంలో గ్రామ సీమలన్నీ ఎడారిని తలపించాయన్నాయని, కనీస సౌకర్యాలకు నోచుకోక దిష్టిబొమ్మలుగా తయారయ్యాయని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. గెలిచిన సర్పంచులు అభివృద్ధి చేయలేక, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, పదిహేనో ఆర్థిక సంఘం నిధులను కూడా విద్యుత్ బిల్లుల సాకుతో పక్కదారి పట్టించారని, గ్రామపంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సంఘం నిధులను గత ప్రభుత్వం మింగేసిందని ఆరోపించారు. నేటి నుంచి పల్లె పండగ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆమె ఆదివారం విలేఖర్లతో మాట్లాడారు.
ఏ పనిచేపట్టేందుకు నిధులు లేక పాలకవర్గాలు మిన్నుకుండిపోయాయని లక్ష్మి పేర్కొన్నారు. సర్పంచల నిధులను జగన్ లాగేసుకున్నారని, ఏపీవ్యాప్తంగా ఈ నెల 14వ తేదీ నుంచి పల్లె పండుగ వారోత్సవాలు నిర్వహించనున్నారని, 13,324 గ్రామాల్లో ఒకేసారి పల్లెపండుగ వారోత్సవాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో కనీస అవసరాలైన రోడ్లు, మురుగుకాలువలు, మంచినీటి వంటి సమస్యల పరిష్కారం కానున్నాయని చెప్పారు. దీంతో పల్లెల రూపురేఖలు మారనున్నాయని పేర్కొన్నారు.