సమిష్టి కృషితో బ్రహ్మోత్సవాలు విజయవంతం

– టీటీడీ ఈవో శ్యామలరావు

తిరుమల, మహానాడు: శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలను సమిష్టి కృషితో విజయవంతం చేశామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. ఈ మేరకు అన్నమయ్య భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఏమన్నారంటే.. 15 లక్షల మందికి వాహన సేవలను తిలకించేలా బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చేశాం. 3.5 లక్షల మంది గరుడ సేవను వీక్షించారు. బ్రహ్మోత్సవాలపై భక్తుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఒక ప్రణాళిక బద్దంగా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను చేశాం. గత అనుభవాల దృష్టి ఉంచుకొని ఒక సూక్ష్మ ప్రణాళికను రూపొందించాం. సీఎం పట్టు వస్త్రాలు సమర్పించిన రోజున సూక్ష్మ ప్రణాళిక వివరించాం. సీఎం చంద్రబాబు కూడా మాకు కొన్ని సలహాలుచ్చారు. అన్ని విభాగాల అధికారుల సమన్వయం చేసుకొని భక్తులకు సంతృప్తికరంగా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు చేశాం.

బ్రహ్మోత్సవాల్లో నాలుగు లక్షల మంచినీటి బాటిళ్లను సరఫరా చేశాం. గరుడ సేవ రోజున ఆర్టీసీ బస్సుల ద్వారా 2, 800 ట్రిప్స్ ద్వారా భక్తులు తిరుమల చేరుకున్నారు. ఆలయంలో నైవేద్యాలు 3.20 లక్షల మంది స్వీకరించారు. బ్రహ్మోత్సవాల్లో 30 లక్షల లడ్డూలు విక్రయాలు జరిగాయి. బ్రహ్మోత్సవాల్లో విద్యుత్ దీపాలంకరణలు, ఫల, పుష్ప ప్రదర్శన శాల, కళాబృందాల వంటి కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. పారిశుద్ధ్యం కోసం ఎక్కువ సిబ్బందిని వాడుకొని పరిశుభ్రంగా తిరుమలను ఉంచాం. బ్రహ్మోత్సవాల్లో ఆరు లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ. 26 కోట్లు ఆదాయం వచ్చింది. బ్రహ్మోత్సవాల్లో 8 రోజులకు 475 లక్షల గ్యాలన్ల నీటిని వాడాం. గత ఏడాదితో పోల్చితే అధిక సంఖ్యలో ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు భక్తులు వచ్చారు.