– ఎమ్మెల్యే గళ్ళా మాధవి
గుంటూరు, మహానాడు: నగర ప్రజల ఆరోగ్య పరిరక్షణకు, పరిశుభ్రతకు కృషి చేస్తున్న నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికుల సేవలు అభినందనీయమని, వారి సేవలు వెలకట్టలేనివని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. సోమవారం 23వ డివిజన్ నగరంపాలెంలో ఆడిటర్ గోపికృష్ణ ఆధ్వర్యంలో మహిళా శానిటరీ సిబ్బందికి దుస్తులు పంపిణీ చేసే కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు కరోనాలో ప్రాణాలను లెక్క చేయకుండా వీధులు శుభ్రం చేశారన్నారు. నగర పరిశుభ్రతపై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని కార్మికులకు సూచించారు. పారిశుద్ధ్య పనులు చేస్తూ తీవ్రమైన దుర్గంధాల నుంచి ప్రజలను కాపాడుతూ విశిష్ట సేవలు అందిస్తున్నారని ఎమ్మెల్యే కొనియాడారు. దాతృత్వంతో ముందుకు వచ్చి కార్మికులకు దుస్తులు పంపిణీకి ముందుకు వచ్చిన ఆడిటర్ గోపికృష్ణను అభినందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శనకాయల అరుణ, సాధు రాజేష్, లామ్ వర్ధన్ రావు, గంటా పెద్దబ్బాయి, తదితరులు పాల్గొన్నారు.