‘దర్శి’ అభివృద్ధికి రూ. 15 కోట్లు మంజూరు

– టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి

దర్శి, మహానాడు: ప్రతి పల్లె ప్రగతి వైపు పరుగులు తీసేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా సన్నాహాలు చేసిందని, ఇందులో భాగంగానే మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం దర్శి నియోజకవర్గానికి రూ.15 కోట్లు మంజూరు చేసిందని, తెలుగుదేశం పార్టీ(టీడీపీ) నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి వెల్లడించారు. కురిచేడు మండలం, పడమరి వీరయపాలెం గ్రామంలో సోమవారం పల్లె పండుగ – ప్రగతికి అండగా కార్యక్రమంలో లక్ష్మి పాల్గొని, మాట్లాడారు. ప్రభుత్వం నాలుగు నెలల పాలనలో పల్లెల ప్రగతికి పెద్దపీట వేస్తోందని, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, దేశాభివృద్ధికి పల్లెల అభివృద్ధి ముఖ్యమని భావించి కేంద్రం నిధులు మంజూరు చేసిందని చెప్పారు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోందని తెలిపారు. తుపాన్లు, వరదలతో రోడ్లన్నీ గుంతల మయమయ్యాయి… గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వం గ్రామాల్లోని రోడ్లను, ప్రధాన రోడ్లను పట్టించుకోలేదని ఆమె విమర్శించారు. ఈ తరుణంలో పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని తెలిపారు. ప్రతి గ్రామానికి 10 లక్షల రూపాయలను మంజూరు చేసింది. దర్శి నియోజకవర్గంలో దాదాపు 15 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని, సిమెంట్ రోడ్లు, డ్రైన్ ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యతనిస్తూ, పల్లెల్లో ప్రజలకు ఉపాధి అందించే నిమిత్తం ఉపాధి పనులు కూడా కల్పిస్తూ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వంగా ముందుకు వెళుతోందన్నారు.

జిల్లా మంత్రులు డోలా బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి సహకారంతో దర్శి ప్రాంతంలోని ప్రతి పల్లెను అభివృద్ధి చేసుకుందాం… దర్శి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే నా లక్ష్యమని మీకు మళ్ళీ చెప్తున్నానని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కురిచేడు ఎంపీడీవో, పంచాయతీ రాజ్ డీఈ, పార్టీ మండల అధ్యక్షుడు పిడతల నేమిలయ్య, తదితరులు ఉన్నారు. అలాగే, కురిచేడు టౌన్ లో సీసీ రోడ్ల నిర్మాణానికి గొట్టిపాటి లక్ష్మి భూమి పూజ చేశారు. మాజీ శాసన సభ్యుడు నారపుశెట్టి పాపారావు, తదితరులు పాల్గొన్నారు.