– ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు
వినుకొండ, మహానాడు: అయిదేళ్ల వైసీపీ నిరంకుశ పాలనలో జగన్మోహన్ రెడ్డి పీక నులిపేసిన పంచాయతీలకు కూటమి ప్రభుత్వం కొత్త ఊపిరి అందిస్తోందని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం సాకారం కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరితపిస్తున్నారని తెలిపారు.
ఈపూరు మండలం బోడెపూడివారిపాలెం పంచాయతీ బోడిశంభునివారిపాలెంలో నిర్వహించిన పల్లె పండగకు ఎమ్మెల్యే జీవీ, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు హాజరయ్యారు. గ్రామసభలో చేసిన తీర్మానం మేరకు రూ.10 లక్షల ఉపాధి హామీ నిధులతో అంతర్గత సీసీ రహదారులు, డ్రైనేజీలు, మినీ గోకులం నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ హయాంలో కనీసం మాడిపోయిన బల్బులు మార్చలేదని, 5 ఏళ్ల జగన్ పాలనలో స్థానిక సంస్థల నిధులు రూ.12 వేల కోట్లు దారి మళ్లించి దోచుకున్నారని విమర్శించారు. అలాంటి పరిస్థితుల నుంచి కూటమి ప్రభుత్వం ఏర్పడిన 4 నెలల్లోనే స్థానిక సంస్థలకు రూ.1452 కోట్లు విడుదల చేశారన్నారు. ఉపాధి హామీ నిధులు కూడా 35 వేల కోట్లకు పైగా దోచుకున్న దొంగల ముఠా వైసీపీ ప్రభుత్వమని ఆరోపించారు.
గ్రామసీమల అభివృద్ధికి సీఎం చంద్రబాబు రూ.4,500 కోట్లు కేటాయించారని, డిప్యూటీ సీఎం పవన్ గ్రామ సభలు ఏర్పాటు చేసి 30 వేల పనుల అభివృద్ధికి నిధులు మంజూరు చేశారన్నారు.
మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు మాట్లాడుతూ బోడిశంభునివారిపాలెంలో మౌలికవసతుల కల్పనకు గ్రామ పెద్దలంతా ఐక్యంగా ముందుకు వచ్చారని అభినందించారు. గ్రామంలో లోఓల్టేజీ సమస్య ఉందని, మాడిపోయిన బల్బులు వేయలేదని, సీసీ డ్రైన్లు లేవన్నారు. వీటన్నింటిని ఎమ్మెల్యే జీవీ పూర్తి చేస్తారన్నారు.