గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

– పల్లె పండుగతో ప్రగతి పరుగులు
– 4 నెలలకే రూ 4,500 కోట్లతో 30 వేల పనులకు శ్రీకారం
– 57 లక్షలతో అభివృద్ధి పనులకు భూమిపూజ
– మంత్రి సవిత

పెనుకొండ, మహానాడు: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతోందని మంత్రి సవిత తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం పరిగి మండలంలో బీచిగానిపల్లి పంచాయతీ గొల్లపల్లి, బీచిగానిపల్లి, పాత్రగానీపల్లి, వంగలపల్లి గ్రామాల్లో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా 57 లక్షల రూపాయలు నిధులతో సీసీ రోడ్డు, కల్వర్టు నిర్మాణానికి మంగళవారం మంత్రి సవిత భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమం ద్వారా గ్రామాల్లోని మౌలిక వసతుల సమకూరుతాయని చెప్పారు. ఎప్పటికప్పుడు సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. గ్రామాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర మంతటా నాలుగు నెలలకే రూ 4,500 కోట్లతో 30 వేల పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు.

గత ప్రభుత్వంలా కాకుండా ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్యను గుర్తించిన వెంటనే ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తున్నట్టు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ దశల వారీగా నెరవేరుస్తున్నామన్నారు. మహిళలకు దీపావళి కానుకగా ఉచిత గ్యాస్ సిలిండర్లను అందజేస్తామని మంత్రి సవిత తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా పనిచేస్తోందని, ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.