భావాల ధాటికి చిట్లిపోయిన నరాలు
నెత్తుటి సిరాగా
కలంలో ప్రవహిస్తున్నప్పుడు ….
అక్షరాల శబ్దానికి
విస్ఫోటనమై పోయిన భావాలు
శిధిల శకలాలుగా
కాగితంపై కుప్పకూలుతున్నప్పుడు ….
అనుభవాల ప్రకంపానికి
విచ్చిన్న మైపోయిన సంఘటనలు
బాధల స్మృతులుగా
కాలం వేదికపై కదలాడుతున్నప్పుడు ….
శ్రమజీవుల రెక్కల కష్టానికి
ఆవిరి అయిపోయిన ఊపిరి సెగలు
స్వేదబిందువులుగా
బతుకుచిత్రంపై వర్షిస్తున్నప్పుడు ………
మృగాల కామద్రావకానికి
దహనమైపోయిన శరీర భాగాలు
సమాధి గోడలుగా
సభ్యసమాజాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు ……
సేద్యకారుడి పంట నష్టానికి
పగిలిపోయిన ఆశల గుండెలు
అశ్రుసముద్రాలుగా
సంసార నౌకను ముంచేస్తున్నప్పుడు …
వేదనల తీవ్రతకు
ముక్కలైపోయిన జీవితాలు
నిస్సహాయ నిట్టూర్పులుగా
జీవన యానంలో కొనసాగుతున్నప్పుడు …
కవి కలంలో
కవిత దానికదే పుడుతుంది
అక్కున చేర్చుకొని
బాధిత వర్గాన్ని
ఓదారుస్తుంది !
– పి. లక్ష్మణ్ రావ్
(అసిస్టెంట్ రిజిస్ట్రార్ సహకార శాఖ)
విజయనగరం
9441215989