కొడాలి అండలో కులాన్ని మార్చేసి పదవి పొందిన సర్పంచ్‌

• సైనిక వెల్ఫేర్ డైరెక్టర్ వెంకటరెడ్డి వేషాలు
• APEXCOలో మెజార్టీ సభ్యులు వైసీపీ సానుకూలపరులు ఉండేలా కుటిల యత్నం
• వైసీపీ నేతలకు కొమ్ముకాస్తున్న పోలీసులపై ఫిర్యాదులు
• అక్రమకేసులు పెట్టి వేధిస్తున్నారంటూ బాధితులు హోంమంత్రికి విన్నపం
• హోంమంత్రి సీరియస్.. ప్రజలను ఇబ్బంది పెడుతున్న పోలీసులను సస్పెండ్ చేయాలని ఆదేశం

మంగళగిరి, మహానాడు: డోన్ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంతియాజ్ బాషా తమపై అక్రమ కేసులు పెట్టి.. ఇబ్బంది పెడుతున్నారని.. డోన్ మండల తెలుదేశం పార్టీ(టీడీపీ) కన్వీనర్ సలింద్ర శ్రీనివాసులను దారుణంగా కొట్టారని.. తీవ్రమైన గాయాలతో శ్రీనివాసులు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని నంద్యాల జిల్లా డోన్ కు చెందిన అడ్వకేట్ లక్ష్మిశెట్టి కృష్ణప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంతియాజ్ బాషా విధుల దుర్వినియోగంపై అధికారులు తక్షణమే స్పందించకుంటే తాము ధర్నాకు దిగుతామని గురువారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ లో హోంమంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, వాణిజ్య విభాగం అధ్యక్షుడు డూండి రాకేష్, తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబులకు వినతి ఇచ్చి అభ్యర్థించారు. వారి మొర విన్న హోంమంత్రి వెంటనే జిల్లా పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి విచారించి సర్కిల్ ఇన్స్పెక్టర్ పై చర్యలు తీసుకోవాలని అవసరమైతే ప్రజలను ఇబ్బంది పెడుతున్న పోలీసులను సస్పెండ్ చేయాలని ఆదేశించారు.

• కోర్టును, అధికారులను తప్పుదోవ పట్టించి, కొడాలి అండతో తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాలు సృష్టించి పదవి పొందిన తమిరిశ గ్రామ సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా నందివాడ మండలం తమిరిశకు చెందిన అంబేద్కర్ నగర్ వాసులు హోంమంత్రికి వినతి పత్రం ఇచ్చారు. విచారించి చర్యలు తీసుకుంటామని ఆమె వారికి హామీ ఇచ్చారు.

• వైఎస్ భారతిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మాజీ ఎంపీ శ్రీనివాసరెడ్డిలకు సొంత బంధువైన వి. వెంకటరెడ్డి APEXCO లో సైనిక వెల్ఫేర్ డైరెక్టర్ గా ఉండి వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంల సహాయంతో సూరెడ్డి శివకుమార్, కటకం పూర్ణ చంద్రరావు మరికొందరు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా సైనిక సమావేశాలు నిర్వహిస్తూ.. APEXCO లో మెజారిటీ సభ్యులు వైసీపీకి చెందిన వారు ఉండేలా ప్రయత్నం చేస్తున్నారని సంఘ అధ్యక్షుడు మోటూరి శంకరరావు నేడు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు.

• వైసీపీ కార్యకర్తలు తన ఇండిపై దాడి చేసి తనను, తన కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషిస్తూ.. భయబ్రాంతులకు గురిచేసినా పోలీసులు పట్టించుకోకపోగా.. తిరిగి తమపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వేధిస్తున్నారని.. ఆ పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని అల్లూరి జిల్లా కూనవరం మండలం పోలిపాక గ్రామానికి చెందిన షేక్ రసూల్ హోంమంత్రికి విజ్ఞప్తి చేశారు.

• తన నుండి ఎప్పుడో విడిపోయిన తన భార్యా పిల్లలు.. తన ఆస్తికోసం తాను చనిపోయినట్టు రిజిస్ట్రర్ కార్యాలయంలో తప్పుడు సమాచారం ఇచ్చి తన భూమిని ఇతరులకు అమ్మేశారని.. తన భూమి తనకు ఇప్పించి న్యాయం చేయాలని కృష్ణా జిల్లా కంపాడుకు చెందిన వెంకటరెడ్డి గ్రీవెన్స్ లో విజ్ఞప్తి చేశారు.

• తన భర్తకు లివర్ ఆపరేషన్ కు డబ్బులు ఇప్పిస్తామని చెప్పి తనకు తన కూతురుకు తెలియకుండా తన భర్త పేరుమీద ఉన్న ఆస్తులను రాయించుకుని పొలాన్ని అమ్మేసి డబ్బులు ఇవ్వకుండా తన ఆడపడుచు పి.నాగిని తన అత్త గొల్లమూడి శివకుమారీలు మోసం చేశారని.. దాంతో తన భర్త చనిపోయారని, తనకు న్యాయం చేయాలని తన ఆస్తులు తనకు ఇప్పించాలని గుంటూరు జిల్లా పలకలూరుకు చెందిన గొల్లమూడి స్వర్ణలత వేడుకుంది.

• తీసుకున్న బంగారానికి ఇవ్వాల్సిన డబ్బులు అడుగుతుంటే తనపై రేప్ కేస్ పెట్టి చంపిస్తానని ఎం. శిల్ప అనే మహిళ బెదిరిస్తుందని.. తనకు గుంటూరు పోలీసులు, నాయకులు తెలుసని డబ్బులు అడిగితే ప్రాణాలు ఉండవని భయపెడుతుందని ఆమెపై చర్యలు తీసుకుని తనకు రావాల్సిన డబ్బులు ఇప్పించి ఆదుకోవాలని విజయవాడకు చెందిన కె. రాజేష్ అనే వ్యక్తి నేతల ముందు ఆవేదన వ్యక్తం చేశారు.

• నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం సునిపెంట గ్రామానికి చెందిన వినుకొండ యేసు విజ్ఞప్తి చేస్తూ.. తమ కుమారున్ని చంపి కర్నూలు రైల్వే ట్రాక్ పై వేశారని.. అనుమానంగా ఉన్న వ్యక్తులపై ఫిర్యాదు చేస్తే.. స్థానికంగా ఉన్న వైసీపీ నేతలు దాన్ని విచారణకు రాకుండా అడ్డుకుంటున్నారని.. తమ కుమారుడి హత్యపై విచారించి తమకు తగు న్యాయం చేయాలని యేసు నేతలకు విజ్ఞప్తి చేశారు.

• బాపులపాడు మండలం వేలేరు గ్రామంలో ఉన్నతమ భూమిని తమకు సర్వే చేయించి ఇవ్వమంటే స్థానిక సర్వేయర్, అధికారులు పట్టించుకోవడంలేదని తమ పక్కన ఉన్న పెద్ద రైతుకు అధికారులు బయపడి సర్వే చేయకుండా ఆగిపోతున్నారని.. దయచేసి తమ భూమిని తమకు సర్వేచేసి ఇప్పించవలసిందిగా నందివాడ మండలం వెన్నపూడి గ్రామానికి చెందిన పొట్లూరి వెంకటసత్యనారాయణ విజ్ఞప్తి చేశాడు.

• కావలి నియోజకవర్గం బాగోలు మండలం నాగులవరం గ్రామానికి చెందిన కంచర్ల వెంకటెశ్వర్లు వేడుకుంటూ.. తమ భూమి 0.70 లను కంచర్ల సుబ్బారావు, కంచర్ల శేషగిరిలు ఆక్రమించారని.. వారి నుండి భూమిని విడిపించి ఆదుకోవాలని వేడుకున్నారు.

• ప్రకాశం జిల్లా పామర్రు మండలం దొడ్డా వెంకటపల్లి గ్రామానికి చెందిన ఉడుముల మహేష్ రెడ్డి విన్నవించుకొంటూ.. తమను ఇనపరాడ్లు, కర్రలతో కొట్టి చంపాలని చూసిన దోసులను కఠిన చర్యలు తీసుకునేలా కేసును రీ ఓపెన్ చేసి విచారించాలని హోమంత్రికి అర్జీ ఇచ్చి అభ్యర్థించారు.

• ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రులలో గల రక్తనిధి, రక్త నిల్వ కేంద్రాల్లో గత 18 సంవత్సరాలుగా అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న 149 మంది సిబ్బంది సమస్యలను పరిష్కరించి.. కనీస వేతనం ఇవ్వాలని వారు వేడుకున్నారు.

• తన కొడుకును చిత్రహింసలు పెట్టి చంపేశారని.. వారిపై కేసు పెట్టడానికి వెళితే గుంటూరు కొత్త పేట పోలీసులు కేసు తీసుకోకుండా.. వైసీపీ వాళ్లతో కుమ్మక్కై తననే అవమానిస్తున్నారని.. గుంటూరుకు చెందిన బడిగినేని పద్మావతి ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడి చావుకు కారకులైన వారికి కఠిన శిక్షపడేలా చూడాలని కోరారు.

• గత 25 సంవత్సరాల నుండి పంచాయితీరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్‌ మండల పరిషత్ కార్యాలయంలో రోజువారి వేతనం నిమిత్తం బోర్ మెకానిక్స్ గా(చేతిపంపు మెకానిక్స్) పనిచేస్తున్నామని.. తమకు ఉద్యోగ భద్రత కల్పించి వేతనం పెంచాలని వారు వేడుకున్నారు.