దోచుకో, పంచుకో, తినుకో భరించలేకనే ప్రజలు జగన్‌ను తరిమేశారు

– ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు

మంగళగిరి, మహానాడు: దోచుకో, పంచుకో, తినుకో భరించలేకే ఎన్నికల్లో ప్రజలు జగన్మోహన్‌ రెడ్డిని 151 నుంచి 11కి తెచ్చి అధికారం నుంచి తరిమేశారని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విమర్శించారు. ఈ డీపీటీ మాఫియాకు అయిదేళ్లు నాయకుడు గా ఉండి, అది చాలక రాష్ట్రాన్ని రూ. 14లక్షల కోట్ల అప్పుల్లో ముంచిన ఘనుడు ఇప్పుడు నీతులు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు కనిపిస్తోందని ఆయన విమర్శించారు. ఇసుకలో వేల కోట్లు, మద్యంలో లక్ష కోట్లు దోచుకుని ప్యాలెస్‌లు నింపుకున్న జగన్… ఏర్పడిన 6నెలలు కూడా పూర్తిగాని కూటమి ప్రభుత్వంపై దిగజారుడు విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో శుక్రవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పార్టీ ప్రజాప్రతినిధుల సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు 125 రోజుల్లో 125 విజయాలు గురించి మాట్లాడారన్నారు. చేసిన మంచి పనులు కూడా చెప్పుకోలేకపోతే ఎలా అని తమందరికీ మార్గనిర్దేశం చేసినట్టు తెలిపారు. అదే సమయంలో పూటకో అబద్ధం-రోజుకో కుట్ర చేస్తున్న జగన్, టీడీపీ సభ్యత్వ నమోదు డ్రైవ్, పంచాయతీరాజ్ వ్యవస్థకు పూర్వ వైభవం, పారిశ్రామిక సూపర్ సిక్స్ పాలసీలతో రాష్ట్ర అభివృద్ధికి బాటలు, శాండ్, లిక్కర్ పాలసీలు- వైసీపీ దుష్ప్రచారం, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు- ఓటర్ల నమోదు, సాగునీటి సంఘాల ఎన్నికలకు సన్నాహాలు, తదితరాంశాలపైనా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాప్రతినిధులు అందరికీ దిశానిర్దేశం చేశారని అన్నారు.