– సీఎం చంద్రబాబు ఆమోదముద్ర
– గవర్నర్ వద్దకు ఫైలు
– ప్రస్తుతానికి కర్నూలులోనే లోకాయుక్త, హెచ్ఆర్సీ కార్యాలయాలు
– హైకోర్టులో ే సు తర్వాత అమరావతికి తరలింపు?
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఏపీ లోకాయుక్తగా జస్టిస్ ఆకుల శేషసాయి నియమానికి రంగం సిద్ధమయింది. ఆ మేరకు ఆయన పేరును ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సిఫారసు చేసి, ఫైలును గవర్నర్ ఆమోదముద్ర కోసం రాజ్‌భవన్‌కు పంపినట్లు తెలుస్తోంది. గతంలో జస్టిస్ శేషసాయి యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌గా పనిచేశారు.
కాగా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత లోకాయుక్త, మానహ హక్కుల కమిషన్ కార్యాలయాలను అమరావతి నుంచి కర్నూలుకు తరలించడంపై వివాదం త లెత్తింది. అన్ని జిల్లాలకు దూరంగా ఉండే కర్నూలుకు, వాటిని తరలించడం వల్ల.. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దానితో హెచ్ఆర్సి తరచూ విజయవాడలో కోర్టు ఏర్పాటుచేయాల్సి వస్తోంది.
కర్నూలుకు ఈ రెండు సంస్థలను తరలించడం వల్ల ఫిర్యాదులు గణనీయంగా తగ్గిపోయాయి. అంతదూరం వచ్చి ఫిర్యాదు చేసే ఓపిక లేకపోవడమే దానికి కారణం. దానితో చాలామంది ఉత్తరాలు, మెయిల్స్ ద్వారానే ఫిర్యాదు చేస్తున్నారు. అయితే వాటిని పరిశీలించడానికి సైతం, సరిపడా సిబ్బంది లేని దుస్థితి. పనిభారం పెరిగిన ఫలితంగా ఉద్యోగులు సతమతమవుతున్నారు. హెచ్చార్సీకి సిబ్బందిని నియమించాలని నాటి చైర్మన్ జస్టిస్ మాంధాత సీతారామమూర్తి, జగన్ సర్కారుకు ఎన్నిసార్లు నివేదికలిచ్చినా ఫలితం శూన్యం.
చివరకు ఆయనకు సైతం చాలాకాలం కారు, డ్రైవరు, పీఏ, స్టెనోగ్రాఫర్‌ను నియమించలేదు. దానితో ఆయనే తన తీర్పులను తానే టైప్ చేసుకోవలసిన దుస్థితి ఏర్పడింది. చివరకు చైర్మన్ దుస్థితి మీడియాలో రావడంతో ఆయనకు కారు, డ్రైవర్‌ను ఏర్పాటుచేసింది. విచిత్రమేమిటంటే.. ఇప్పటికీ హెచ్చార్సీ చైర్మన్‌కు స్టెనోగ్రాఫర్ లేకపోవడం!
తాజాగా నూతన లోకాయుక్త ప్రమాణస్వీకారం చేసిన వెంటనే బెంచి ప్రారంభించాల్సి ఉంది. కానీ కర్నూలులోని కార్యాలయంలో కనీస సౌకర్యాలు లేక, సమస్యలు ఎదుర్కోవలసి వస్తోంది. గత లోకాయుక్త ఎక్కువకాలం హైదరాబాద్ నుంచే కార్యకలాపాలు ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా లోకాయుక్త,హెచ్చార్సీని కర్నూలు నుంచి విజయవాడకు తరలించాలంటూ.. ఇప్పటికే హైకోర్టులో దాఖలయిన కేసు విచారణ దశలో ఉంది. అది వచ్చే వారం విచారణకు రానుంది. ఆ సందర్భంగా ప్రభుత్వం తన వైఖరి స్పష్టం చేయనుంది.
అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం.. జగన్ ప్రభుత్వం కర్నూలుకు తరలించిన లోకాయుక్త, హెచ్చార్సీ కార్యాలయాలను, తిరిగి అమరావతికి తరలించేందుకే కూటమి ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు గత ప్రభత్వం ఇచ్చిన జీఓను రద్దు చేసి, తిరిగి కొత్త జీఓ ఇవ్వాల్సి ఉందని న్యాయనిపుణులు చెబుతున్నారు. అన్నీ అనుకూలిస్తే మరో 3 నెలల్లో లోకాయుక్త-హెచ్చార్సీ విజయవాడకు తరలించవచ్చంటున్నారు.