జగన్‌వి సిగ్గు లేని విమర్శలు!

– మంత్రి కొల్లు రవీంద్ర

అమరావతి: మద్యం టెండర్లు, ఇసుక రవాణాలో దోపీడీ జరుగుతోందంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. అమరావతిలో శనివారం ఆయన మాట్లాడుతూ.. జగన్ ధన దాహంతో రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేశారని అన్నారు. కూటమి సర్కార్‌లో పారదర్శకంగా జరిగిన మద్యం విధానంపై విమర్శలు చేయడం సిగ్గు చేటని మండిపడ్డారు.

ఎక్సైజ్ విభాగాన్ని నిర్వీర్యం చేసి వైసీపీ మద్యం పేరుతో దోచుకుంది నిజం కాదా? సెబ్‌ పేరుతో అక్రమ మద్యం వ్యాపారానికి అడ్డులేకుండా చేసుకోవడం నిజం కాదా. తయారీ నుండి రిటైల్ అమ్మకాల వరకు అన్ని వ్యవస్థల్ని గుప్పిట్లో పెట్టుకొని ప్రభుత్వ షాపుల పేరుతో దోచుకున్నది నిజం కాదా? జగన్ కల్తీ మద్యం కారణంగా 50 లక్షల మంది కిడ్నీ, లివర్ సమస్యలతో సతమతమయ్యారు.

ప్రభుత్వ షాపుల్లోనే వేలాది ఎంఆర్‌పీ ఉల్లంఘనలు జరగడంపై ఏం సమాధానం చెబుతావు? ఎన్నడూ లేని విధంగా 2019-24 మధ్య అక్రమ మద్యం రవాణా కేసులు ఎందుకు ఎక్కువగా నమోదయ్యాయి? వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి ఇప్పుడు నీతులు చెప్పడానికి సిగ్గు పడాలి. రాష్ట్ర ఖజానాకు ఆదాయం తగ్గించి.. మీ ఆదాయం పెంచుకోవడం నిజం కాదా? కూటమి అధికారంలోకి వచ్చాక దేశ వ్యాప్తంగా ఉన్న మద్యాన్ని ఏపీలో అందుబాటులో ఉంచేలా పాలసీ తీసుకొచ్చాం.
రూ.99 కే క్వార్టర్ అందించే ప్రయత్నం చేస్తున్నాం. రిటైర్డ్ జడ్జితో టెండర్ కమిటీ వేసి ధరల్ని నిర్ణయించబోతున్నాం.

నీతులు చెప్తున్న జగన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో జరిగిన మద్యం అక్రమాలపై చర్చకు సిద్ధమా? కల్లు గీత కార్మికులకు కేటాయించిన షాపులకు త్వరలోనే దరఖాస్తులు స్వీకరిస్తాం. అత్యంత పారదర్శకంగా మద్యం దుకాణాల కేటాయింపు జరిగింది. ప్రభుత్వంపై నమ్మకంతో 89,882 మంది దరఖాస్తు చేసుకుని, దుకాణాలు ఏర్పాటు చేశారు. పునరావాసం కోసం అదనంగా 2 శాతం సెస్ అమలు చేస్తున్నాం. ఆదాయం పోయిందనే బాధతో జగన్ రెడ్డి దిక్కుమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తే ప్రజలు ఊరుకోరు అని గుర్తుంచుకోండి. ఇసుక మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకొని దోచుకున్న ఘనత జగన్ రెడ్డికే చెందుతుంది.

జగన్ రెడ్డి ఇసుక మాఫీయా కారణంగా 70 మంది భవన నిర్మాణ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. రూ.వెయ్యి కోట్లకు పైగా ప్రజా ధనాన్ని జగన్ బినామీ కంపెనీలతో కలిసి దిగమింగారు. మీ అక్రమాల కారణంగానే ఎన్జీటీ రూ.100 కోట్ల జరిమానా విధించింది.

ఉన్నతాధికారులకు చీవాట్లు పెట్టింది. రాష్ట్రంలో 130 ఇసుక రీచులు ఎందుకు మూతబడ్డాయో సమాధానం చెప్పాలి. అధికారంలోకి రాగానే జులై 8 న ఉచిత ఇసుక పాలసీని ప్రకటించాం. అక్టోబర్ 15 వరకు ఇసుక తవ్వకాలకు ఎన్జీటీ అడ్డుకోవడం వాస్తవం కదా? ఐదేళ్ల పాలనా కాలంలో ఏ రోజైనా అందుబాటులో ఉన్న ఇసుక వివరాలు బయట పెట్టారా? విలువలు వదిలేసి రాజకీయం చేయడం జగన్ రెడ్డికి అలవాటుగా మారిపోయింది.

ఆన్లైన్ పోర్టల్ అందుబాటులోకి తెచ్చి ఎవరైనా ఇసుక బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించాం. ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లతో ఉచితంగా ఇసుక తీసుకెళ్లొచ్చని నిర్ణయించాం. 8 జిల్లాల్లో డీసిల్టేషన్ కోసం అనుమతులు ఇచ్చి ఇసుక అందుబాటులో ఉంచాం. ఓపెన్ టెండర్లపై కూడా జగన్ రెడ్డి విమర్శలు చేయడం సిగ్గు చేటు. ఐదేళ్లు వ్యవస్థల్ని నిర్వీర్యం చేసిన జగన్ రెడ్డి ఇప్పుడు నీతులు చెప్పడం హాస్యాస్పదం. సీనరేజి వసూళ్లను కూడా ఉపసంహరించుకున్నాం.

కనీసం పారదర్శకత అంటే ఏంటో జగన్ రెడ్డికి తెలుసా? వ్యవస్థల్ని చెప్పు చేతుల్లో పెట్టుకుని రాష్ట్రాన్ని రావణకాష్ఠం చేసిన ఆయనకు ప్రజలు గుణపాఠం చెప్పారు. పొరుగు రాష్ట్రాలకు తరలించినా, బ్లాక్ మార్కెట్ సృష్టించినా తీవ్ర చర్యలు ఉంటాయని వైసీపీ, జగన్ గుర్తుంచుకోవాలి అని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు.