రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
పెనుకొండ : పెనుకొండ పట్టణాభివృద్ధికి పార్టీలకతీతంగా కృషి చేద్దామని, పన్నుల బకాయి వసూళ్లలో రాజీపడొద్దని మున్సిపల్ అధికారులకు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత స్పష్టం చేశారు. పెనుకొండలో మౌలిక వసతుల కల్పన అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో శ్రీకృష్ణదేవరాయులు,బాబయ్య స్వామి ఉరుసు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మున్సిపల్ పాలక వర్గ సమావేశంలో మంత్రి సవిత పాల్గొని ప్రసంగించారు. పెనుకొండ మున్సిపాల్టీలో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. తాగునీరు, రోడ్లు, డ్రైనీజీల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
కియా వంటి పరిశ్రమలు ప్రస్తుతం పెనుకొండలో ఉన్నాయని, భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలను తీసుకురానున్నామని, ఈ నేపథ్యంలో పట్టణంలో మౌలిక వసతుల కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పెనుకొండలో సరైన మౌలిక వసతులు లేకపోవడం వల్ల ఉద్యోగులు, ఇతరులు అనంతపురం, పుటపర్తి వంటి ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారన్నారు. పట్టణంలో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సౌకర్యాలు కల్పిస్తే, పెనుకొండలోనే నివాసం ఉండడానికి అవకాశం ఉంటుందన్నారు. ఇదే విషయమై ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లాని, పెనుకొండలో మౌలిక వసతుల కల్పనకు నిధుల కేటాయింపునకు ఆయన సుముఖం వ్యక్తంచేశారని మంత్రి వెల్లడించారు.
పన్నుల వసూళ్లలో రాజీ పడొద్దు
ప్రభుత్వంపైనే కాకుండా సొంతంగానూ ఆదాయ మార్గాల పెంపుదలపై మున్సిపల్ అధికారులు దృష్టిసారించాలని మంత్రి సవిత స్పష్టంచేశారు. ముఖ్యంగా పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం చూపొద్దన్నారు. పన్నుల బకాయిల వసూళ్లలో రాజీపడొద్దని, రాజకీయ ఒత్తిళ్లను పట్టించుకోవొద్దని మున్సిపల్ అధికారులకు మంత్రి స్పష్టంచేశారు. అధికార, ప్రతిపక్షాలు సైతం పట్టణ అభివృద్ధిలో రాజకీయాలకతీతంగా వ్యవహరించాలని సూచించారు. తమకు ట్యాక్స్ గా ఎక్కువగా వేశారని ఇటీవల కొంతమంది తనను సంప్రదించారని తెలిపారు. పన్నుల విధింపు కంప్యూటరీకరణ ప్రకారమే జరుగుతోందని, ఎంత పన్నువస్తే అంతా చెల్లించాల్సిందేనని తెలిపినట్లు మంత్రి వెల్లడించారు. ఇలా ఏ పార్టీ నాయకులైనా పన్నుల వసూళ్లలో విషయంలో జోక్యం చేసుకోవొద్దిన మంత్రి కోరారు. ఇటీవల చంద్రబాబు ప్రభుత్వం చెత్త పన్ను తొలగించి, ప్రజలపై ఆర్థిక భారం పడకుండా చర్యలు తీసుకున్న విషయాన్ని మంత్రి సవిత గుర్తు చేశారు.
దాతల సాయం తీసుకోండి…
కేవలం ప్రభుత్వమిచ్చే నిధులపైనే ఆధారపడకుండా, సీఎస్ఆర్ ఫండ్స్, విరాళాల సేకరణపై వినియోగంపై దృష్టి సారించాలని మున్సిపల్ అధికారులకు మంత్రి సవిత సూచించారు. దాతల నుంచి విరాళాల సేకరణకు మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు కూడా ముందుకు రావాలని మంత్రి కోరారు. అందరి ధ్యేయం పెనుకొండ పట్టణాభివృద్ధే కావాలని మంత్రి సవిత తెలిపారు. త్వరలో శ్రీకృష్ణదేవరాయులు, బాబయ్య స్వామి ఉరుసు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్, కౌన్సిలర్లు, అధికారులు తదితరులుపాల్గొన్నారు.