– ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు
వినుకొండ, మహానాడు: ప్రాణత్యాగంతో ఆంధ్రరాష్ట్రానికి ఊపిరి పోసిన మహానుభావుడు అమరజీవి పొట్టి శ్రీరాములు అంటూ ఆయనకు ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఘన నివాళులు అర్పించారు. భాషాప్రయుక్త రాష్ట్రాల భావనకు రూపుదిద్దిన ఆద్యుడిగా చేసిన కృషే ఆయనను చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోయేలా చేసిందన్నారు. వినుకొండలోని నరసరావుపేట రోడ్‌లో ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్రం కోసం ఆయన చేసిన పోరాటం, త్యాగాన్ని స్మరించుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే పొట్టి శ్రీములు ఆమరణ నిరాహారదీక్ష ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందన్నారు. అందుకే తెలుగు ప్రజల హృదయాల్లో ఆయన శాశ్వతంగా ఉంటారన్నారు. ఒకప్పుడు తెలుగువారిని మద్రాసీలు అని పిలిచేవారని, తెలుగు వారికి గుర్తింపు ఇవ్వని పరిస్థితి ఉండేదన్నారు. అలాంటి పరిస్థితులను మార్చేందుకు తెలుగు ప్రజల ఆత్మగౌరవం చాటిచెబుతూ ప్రత్యేక రాష్ట్రం కావాలని పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చేశారంటూ చరిత్రను గుర్తు చేశారు. బీజేపీ నాయకులు మేడం రమేష్, గురునాథం, టీడీపీ పట్టణ అధ్యక్షుడు పట్టన్ అయిబు ఖాన్, గట్టుపల్లి శ్రీనివాసరావు, పత్తి పూర్ణచంద్రరావు, పువ్వాడ కృష్ణ, మోటమర్రి నరసింహారావు, పెనుగొండ శ్రీను కోటేశ్వరరావు, బాలరాజు, బత్తుల గోవిందరాజులు, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.