– కమిషనర్ శ్రీనివాసులు
గుంటూరు, మహానాడు: నగరపాలక సంస్థ పరిధిలో రోడ్లు, డ్రైన్ల మీద ఆక్రమణల తొలగింపు ముమ్మరంగా జరుగుతుందని, ఆక్రమణదార్లు స్వచ్ఛందంగా తొలగించుకోవాలని, లేకుంటే జిఎంసి సిబ్బందే పూర్తి స్థాయిలో తొలగిస్తారని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. గురువారం కమిషనర్ పట్టణ ప్రణాళిక అధికారులతో టెలి కాన్ఫరెన్స్ లో ఆక్రమణల తొలగింపుపై పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అమరావతి రోడ్డులో, గోరంట్ల మెయిన్ రోడ్డు, జీటీ రోడ్డు, నల్లపాడు రోడ్లలో ఆక్రమణలు తొలగిస్తున్నామన్నారు.
నగరంలో ఒకసారి ఆక్రమణలు తొలగించిన ప్రాంతాల్లో తిరిగి ఆక్రమణలు జరగకుండా ప్లానింగ్ కార్యదర్శులు పర్యవేక్షణ చేయాలన్నారు. డ్రైన్ కి ముందర ఏ విధమైన ఆక్రమణలు ఉండడానికి వీలు లేదని స్పష్టం చేశారు. అలాగే ఆక్రమణల తొలగింపు జరిగిన డ్రైన్లలో పూడిక తీత పనులు చేపట్టాలని, తీసిన పూడికను వెంటనే తరలించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.