– మంత్రి సవిత
పెనుకొండ, మహానాడు: ప్రజల సమక్షంలోనే భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సవిత కోరారు. ఈ మేరకు ఆమె పెనుకొండ మండలం మునిమడుగు గ్రామంలో శుక్రవారం జరిగిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్నారు. ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మీడియా తో మంత్రి మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి రెవెన్యూ శాఖలో ఆన్లైన్ ట్యాంపరింగ్, రికార్డులు తారుమారుపై అధికారులు గ్రామస్థాయిలో ఫిర్యాదుల స్వీకరించి పరిష్కరిస్తారని తెలిపారు. గ్రామ స్థాయిలోనే భూ సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని, వైసీపీ ప్రభుత్వ పాలనలో రెవెన్యూ పరంగా ప్రజలు అనేక ఇబ్బందులుఎదుర్కొన్నారన్నారు.
గత ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ లో జరిగిన మోసాలపై రైతులకు వివరిస్తూ ఈ రెవెన్యూ సదస్సులో పట్టాదారు పుస్తకాల్లో తప్పులు ఏమైనా ఉంటే సరి చేసుకోవాలని మంత్రి సూచించారు. గత ప్రభుత్వం పట్టా పట్టాదారు పుస్తకాలపై ముద్రించిన జగన్ ఫోటోలను తొలగించి భూ సర్వేలో జరిగిన తప్పులను సరిచేస్తూ రాజముద్ర తో ముద్రించిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఎన్డీయే ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. . ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఆనందరావు ఎమ్మార్వో, వీఆర్వోలు, సచివాలయ సిబ్బంది గ్రామ ప్రజలు, అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.