కూటమి సర్కారుకు దేవుడి ఆశీస్సులు మెండు!

– ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు

ఎ.కొత్తపాలెం, మహానాడు: రాష్ట్రంలో సంక్షేమ పాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజల మద్దతుతో పాటు దేవుడి ఆశీస్సులు కూడా మెండుగా ఉన్నాయని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. సంక్షేమ ఫలాలు అందుకుంటున్న కోట్లాది మంది ప్రార్థనలు, అవ్వాతాతల దీవెనలన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి దైవబలాన్ని మరింత పెంచుతున్నాయన్నారు. వినుకొండ మండలం అందుగుల కొత్తపాలెంలో శనివారం వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవంలో మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావుతో కలిసి జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. ఆలయంలో స్వామి, అమ్మవారి విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణ నడుమ ధ్వజస్తంభం, వేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠ, కల్యాణోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది.
స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేదాశీర్వచనాలు పొందారు. వేద పండితులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే ప్రజాబలంతో పాటు దేవుడి దీవెనలు బావుండబట్టే కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతం అవుతోందని, రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, పరిశ్రమలు, పెట్టుబడులు, కేంద్రం నుంచి నిధులు, పెండింగ్ సమస్యలు అన్నింటిలో సానుకూల ఫలితాలు చూస్తున్నామన్నారు.