జగన్‌ ముందు తన బుద్ధిని మార్చుకోవాలి

– ఎమ్మెల్యే గళ్లా మాధవి

గుంటూరు, మహానాడు: వైసీపీ అధినేత జగన్ ఎన్నికల ముందు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు స్థాన చలనం కల్పించి ప్రజలను మభ్యపెట్టాలన్న ఆలోచనలకు రాష్ట్ర ప్రజలు చెక్ పెట్టి, అవినీతి వైసీపీ ఎమ్మెల్యేలను ఇంటికి పరిమితం చేశారని, ఈ విషయాన్ని వైసీపీ అధినేత జగన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లా మాధవి హితవు పలికారు. గుంటూరులో రెండు నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జీలను ప్రకటించటంపై ఎమ్మెల్యే స్పందించారు. తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాధవి మాట్లాడారు.

గత వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని, ఇష్టానుసారంగా దోచుకొని తిని, ప్రజల మీద దౌర్జన్యాలకు పాల్పడి డబ్బుతో గెలిచేయవచ్చు అనే అవివేకంతో పోటీ చేసిన ఎమ్మెల్యేలకు ప్రజలు ఇచ్చిన తీర్పుతో తత్వం బోధపడిందని మాధవి అన్నారు. తమకు వైసీపీలో రాజకీయ జీవితం ఉండదన్న ఆలోచనకు వైసీపీ నేతలు వచ్చారని, పార్టీని వీడేందుకు సిద్దమయిన వారిని కాపాడుకోవటం కోసం నేడు వారికి పూర్వపు నియోజకవర్గానికి పంపిస్తే, వారిని ప్రజలు తిరిగి ఆదరిస్తారు అనుకోవటం అవేవికం అన్నారు. ముందు జగన్ రెడ్డి తన ఆలోచన విధానాలు మార్చుకోవాలని, తమను గెలిపించిన ప్రజల కోసం అసెంబ్లీకి జగన్ రెడ్డి, ఎమ్మెల్యేలు రావాలన్న బాధ్యత కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆమె మండిపడ్డారు.

జగన్ రెడ్డిని నమ్ముకొని ఇలా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే ప్రజలే వారికి బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే గళ్ళ మాధవి అన్నారు. గతంలో వైసీపీ సామాన్య కార్యకర్త మొదలుకొని మంత్రుల వరకు ఇష్టానుసారంగా నోరుపారేసుకొని సోషల్ మీడియా వేదికగా జుగుప్సాకరంగా పోస్ట్లు పెట్టిన వారికి మద్దతుగా వైసీపీ నేతలు, గుంటూరు ఎస్పీని కలవటం చూస్తే, నిస్సుగుగా నీచ రాజకీయాలు చేయటం వైసీపీకే చెల్లిందని, ప్రజలు వారిని అసహ్యించుకుంటున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు.