వైసీపీలోకి మారలేదని తప్పుడు కేసులతో టీడీపీ కార్యకర్తలకు వేధింపులు!

• పలు సమస్యలపై పోటెత్తిన బాధితులు
• తమకు న్యాయం చేయాలంటూ విన్నపం
• అర్జీలు స్వీకరించిన నేతలు… సమస్యలు పరిష్కరిస్తామంటూ హామీ

మంగళగిరి, మహానాడు: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో శనివారం జరిగిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమానికి వివిధ సమస్యలపై అర్జీదారులు పోటెత్తారు. వారి నుండి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, బుచ్చిరాంప్రసాద్, టీడీపీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామిదాసులు అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలపై అయా అధికారులకు ఫోన్లు చేసి సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేశారు.

• వైసీపీలోకి మారకుండా తాము టీడీపీలోనే ఉన్నామని తమపై కక్ష గట్టి అప్పటి వైసీపీ ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్ తమపై అక్రమ కేసులు పెట్టి వేధించారని.. తమపై పెట్టిన అక్రమ కేసులు తొలగించి తమకు న్యాయం చేయాలని అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం ఎర్రప్పదొడ్డి గ్రామానికి చెందిన గొల్ల గోవిందు, గొల్ల కృష్ణప్పలు గ్రీవెన్స్ లో నేతలను కలిసి విజ్ఞప్తి చేశారు.
• తిరుపతికి చెందిన జి. గజేంద్ర విజ్ఞప్తి చేస్తూ.. తాను నగరంలో టీడీపీ అనుబంధ కమిటీ సెక్రటరీగా పనిచేస్తున్నానని.. గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతలు తనను వైసీపీలో చేరమని ఒత్తిడి చేశారని.. తాను పార్టీ మారకపోవడంతో నాపై అక్రమంగా రౌడీషీట్ ఓపెన్ చేశారని.. తప్పుడు కేసులు పెట్టించారని.. వాటివలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని.. వాటిని తొలగించి న్యాయం చేయాలని వేడుకున్నాడు.
• చిత్తూరు జిల్లా సోమల మండలం పేటఊరు గ్రామానికి చెందిన కె.గోవిందు విజ్ఞప్తి చేస్తూ.. తమ భూమిని వైసీపీ కబ్జాదారులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని.. తమ భూమికి తప్పుడు రికార్డులు సృష్టించేందుకు అధికారులు సహకరించారని.. తప్పుడు రికార్డులు సృష్టించిన అధికారులు, భూమిని కబ్జా చేసిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకొని తమ భూమిని విడిపించాలని వేడుకున్నారు.
• ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ నున్న గ్రామానికి చెందిన పోతురాజు విజ్ఞప్తి చేస్తూ.. గత ప్రభుత్వం పేదల ఇళ్ల కోసం నవత్నాలలో భాగంగా తమభూమిని తీసుకుని పొలంలో ఉన్న మామిడి చెట్లను నరికి ఎటువంటి పరిహారం ఇవ్వకుండా తమను మోసం చేసిందని.. తమకు దయచేసి పరిహారం ఇప్పించి ఆదుకోవాలని వేడుకున్నారు.
• అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలానికి చెందిన రమణమూర్తి విజ్ఞప్తి చేస్తూ.. తన పొలాన్ని వైసీపీ నేతలు కబ్జా చేశారని దానిపై ప్రశ్నిస్తే దాడులు చేసి పరుష పదజాలంతో తిడుతున్నారని. కబ్జాపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడంలేదని… దయచేసి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
• నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం దర్బలమిట్టకండ్రిక గ్రామానికి చెందిన పీలా రవీంద్ర విజ్ఞప్తి చేస్తూ.. తన అన్న గుండెపోటుతో.. వదిన కరోనాతో మరణించారని.. వారి కూతురు దివ్యాంగురాలని.. వారసత్వంగా మరణించిన తల్లిదండ్రుల నుండి పాపకు రావాల్సిన ఆస్తిని ఆన్ లైన్ లో ఇతరుల పేరుమీదకు మార్చారని.. దాన్ని సరిచేసి దివ్యాంగురాలైన 12 ఏళ్ల పాపకు న్యాయం చేయాలని రవీంద్ర విన్నవించారు.
• కాకినాడ జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో శానటరి అటెండర్ కమ్ వాచ్ మెన్ గా పనిచేసిన తమకు మే 2021 నుండి.. అక్టోబర్ 2021 వరకు ఐదు నెలల 10 రోజుల జీతం ఆగిపోయిందని.. ఆగిపోయిన జీతం ఇప్పించి ఆదుకోవాలని తేటగుంట, రాజపూడిలకు చెందిన బాధితులు వేడుకున్నారు.
• ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దర్శి గ్రామానికి చెందిన శీలం బాలకృష్ణారెడ్డి విజ్ఞప్తి చేస్తూ.. తాను కొనుగోలు చేసిన భూమిని తనకు తెలియకుండా ఫ్లాట్స్ పెట్టి అమ్ముకున్నారని.. ఈ మోసానికి పాల్పడిన పంటా సుబ్బారావు అనే వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
• కృష్ణా జిల్లా బాపులాపడు మండలం కోడూరుపాడు శోభనాధ్రిపురం, మంగలికుంట చెరువు ఆయకట్టు రైతులు విజ్ఞప్తి చేస్తూ.. ఇరిగేషన్ శాఖకు సంబంధించి మంగళికుంట చెరువును కొంతమంది ఆక్రమించుకుని వరి, పామాయిల్ సాగుచేస్తున్నారని.. దీంతో చెరువుపై ఆధారపడి సాగుచేస్తున్న రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని దయచేసి చెరువులోని ఆక్రమణలుతొలగించాలని గ్రామానికి చెందిన పలువురు రైతులు విన్నవించారు.
• అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం గ్రామానికి చెందిన పలువురు విజ్ఞప్తి చేస్తూ.. మండలంలోని కర్రివానిపాలెం గ్రామ పంచాయతీ లోని నక్కల చెరువులో ఆక్రమణలు తొలగించి రైతులను ఆదుకోవాలని అక్రమార్కులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.
• బాపట్ల జిల్లా పర్చూరు మండలం బొట్ల అగ్రహారానికి చెందిన కారంచేటి ఉమామహేశ్వరరావు విజ్ఞప్తి చేస్తూ.. గోరంట్ల రామానాయుడు అనే వ్యక్తి వైసీపీ నేతల అండదండలతో దేవస్థానం భూమిని ఆక్రమించి తన ఇంటి గోడను కూల్చేందుకు యత్నిస్తున్నాడని.. తన ఊరు సర్పంచ్ పోలీసులతో బెదిరిస్తున్నాడని.. తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు.